విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి.. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉందన్నారు
మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ కంటతడి పెట్టారు. ఆదివారం తన దివంగత తండ్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రితీష్ దేశ్‌ముఖ్ కన్నీళ్లు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో రితీష్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ బాధపడ్డారు. నాన్న చనిపోయి 12 ఏళ్లు అయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో వెంటనే ఆయన అన్నయ్య, లాతూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ దేశ్‌ముఖ్ ఓదార్చారు.
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మనల్ని విడిచిపెట్టి పన్నెండేళ్లు గడిచాయి.. ఆయన లేకపోవడం వల్ల ఎంతో బాధగా ఉందన్నారు రితీష్. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఈ రాష్ట్ర ప్రజల్లో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నారు. ఆయన గొప్పతనం ఎప్పటికీ మసకబారదు.. ఆయన ప్రజల కోసం బలంగా నిలబడ్డారని అన్నారు. ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా, మనపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుందన్నారు. మే 26, 1945న లాతూర్‌లో జన్మించిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, మహారాష్ట్రకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉన్నారు. ఆయన ఆగస్టు 14, 2012 న మరణించారు. రితీష్ దేశ్‌ముఖ్ బాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ నటి జెనీలియాను పెళ్లి చేసుకున్నాడు.