గుమ్మడి వెంకటేశ్వరరావు(Gummadi venkateshwar rao) నటనా వైదుష్యం గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ముందు తరం ప్రేక్షకులు ఆయన నటనకు నీరాజనాలు పలికారు.
గుమ్మడి వెంకటేశ్వరరావు(Gummadi enkateshwar rao) నటనా వైదుష్యం గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ముందు తరం ప్రేక్షకులు ఆయన నటనకు నీరాజనాలు పలికారు. సమ్మోహితులయ్యారు. చిన్న వయసులోనే పాపం ఆయన బరువైన పాత్రలు పోషించారు. తన కంటే చిన్నవారితో నాన్నా అని పిలిపించుకున్నారు. మెథడ్ యాక్టింగ్‌కు అర్థం తెలిసేలా చేశారు. పాత్ర ఎలాంటిదైనా అందులో జీవించాల్సిందే. లీడ్ రోల్ అయినా అతిథి పాత్రైనా..
ఆ సినిమాపై తనదైన ముద్ర వేయాల్సిందే. దుష్ట పాత్రల్లో సైతం అద్భుతంగా నటించారు గుమ్మడి.
గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు(Farmer) కుటుంబంలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎన్.టి.రామారావు తమ ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన చిత్రాలలో మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా రామారావు సొంత చిత్రాలు పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఆ తరువాత గుమ్మడి మరి వెనుదిరిగి చూసుకోలేదు. తోడుదొంగలులో గుమ్మడి వయసు మీరిన పాత్ర ధరించడం చూసిన పి.పుల్లయ్య తన అర్ధాంగి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. తన కన్నా వయసులో పెద్దవారయిన నటులకు తండ్రిగా నటించడంతో అప్పటి నుంచీ గుమ్మడికి అధికంగా తండ్రి పాత్రలే పలకరించసాగాయి. ఒకే రకం పాత్రలు ధరించినా, వాటిలో తనదైన బాణీ ప్రదర్శించడానికి గుమ్మడి ప్రయత్నించేవారు. అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడికి మహామంత్రి తిమ్మరుసు సినిమా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడిని కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటాయి. అదీ గుమ్మడి అభినయంలోని ప్రత్యేకత! గుమ్మడి తన చివరి రోజుల్లో చిత్రసీమలో తన అనుభవాలను తీపి జ్ఞాపకాలు – చేదు గుర్తులు పేరుతో రాసుకున్నారు. 2010 జనవరి 26న గుమ్మడి వెంకటేశ్వరరావు మనల్ని విడిచి వెళ్లిపోయారు.