✕
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(Balasubrahmanyam).. సంగీత ప్రపంచాన్ని మకుటం లేని చక్రవర్తిగా ఏలారు. మధురమైన పాటలను అందించారు. ఆయన ఉత్తి నేపథ్య గాయకుడే కాదు, సంగీత దర్శకత్వాన్ని వహించారు. సినిమాల్లో నటించారు. అనేక మంది నటులకు గాత్రాన్ని అరువిచ్చారు. చమత్కారపు మాటలతో కార్యక్రమాలను రక్తి కట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనది బహుముఖ ప్రతిభ.

x
Remebering SP Balasubhrahmanyam
-
- శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(Balasubrahmanyam).. సంగీత ప్రపంచాన్ని మకుటం లేని చక్రవర్తిగా ఏలారు. మధురమైన పాటలను అందించారు. ఆయన ఉత్తి నేపథ్య గాయకుడే కాదు, సంగీత దర్శకత్వాన్ని వహించారు. సినిమాల్లో నటించారు. అనేక మంది నటులకు గాత్రాన్ని అరువిచ్చారు. చమత్కారపు మాటలతో కార్యక్రమాలను రక్తి కట్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనది బహుముఖ ప్రతిభ. ఆ గానగంధర్వుడు మన మధ్యన లేరనే తలంపే అసలు కలగడం లేదు. మూడేళ్ల కిందట కరోనా ఆయనను భౌతికంగా మనకు దూరం చేసింది కానీ మన మనస్సుల్లోంచి తొలగించలేకపోయింది. ఆయన మనకు నిత్య స్మరణీయులు. ఎందుకంటే పాటలతో ఆయన మనల్ని ప్రతి రోజూ పలకరిస్తున్నారు కాబట్టి. ఆయన పాటతోనే పొద్దుపొడుస్తున్నది. ఆయన పాటతోనే పొద్దుగడుస్తున్నది.
-
- 1946, జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో బాలు జన్మించారు. తండ్రి సాంబమూర్తి హరికథా కళాకారుడు. తల్లి శకుంతలమ్మకు కూడా సంగీత పరిజ్ఞానం ఉంది. అలా బాలుకు చిన్నప్పట్నుంచే సంగీతంలో ఆసక్తి పెరిగింది. అనురక్తి కలిగింది. తండ్రిని తొలి గురువుగా చేసుకున్న బాలు సంగీతంలో ఓనమాలను ఆయన దగ్గరే నేర్చుకున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు దగ్గర ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. తర్వాత శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. శ్రీకాళహస్తిలోనే పీయూసీ కంప్లీట్ చేశారు. తర్వాత నెల్లూరుకు వచ్చి కొంత మంది మిత్రులతో కలిసి ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని ప్రొగ్రాములు కూడా ఇచ్చారు.
-
- అటు పిమ్మట అనంతపురంలో ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినా అక్కడి వాతావరణం నచ్చక వెనక్కి వచ్చేశారు బాలు. ఇంజనీరు కావాలన్న తండ్రి కోరికను మన్నించి మద్రాస్‌కు వెళ్లి ఎఎంఐఈ కోర్సులో చేరారు.చదువుతో పాటు అక్కడ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయసాగారు. అలా ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న సమయంలోనే సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి బాలులోని ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు అప్పుడే మాట ఇచ్చారు.1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో ఏమి ఈ వింత మోహం అనే పాటను పి.సుశీల, ఈలపాటి రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌లతో కలిసి పాడారు.
-
- అలా సినిమా గాయకుడిగా బాలు ప్రస్థానం ప్రారంభమయ్యింది. 1967, జూన్ 2వ తేదీన ఆ సినిమా విడుదలయ్యింది. దీనికి ఎస్.పి.కోదండపాణి సంగీతాన్ని అందించారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్‌తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవారు కోదండపాణి. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని ఆయన పేరే పెట్టుకున్నారు బాలు.
-
- బాలు శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదు. అయితేనేం విన్న వెంటనే ట్యూన్ పట్టేసే అద్భుతమైన ప్రతిభ ఆయనది. అనుభవమే ఆయనకి సంగీత పాఠాలు నేర్పింది. అందుకే అలవోకగా అన్నేసి పాటలు అందరికీ పాడగలిగారు. కఠినమైన పదబంధాలతో సాగే పాటలనైనా సింగిల్ టేక్‌లోనే ఓకే చేయగల సమర్థుడు కాబట్టే మ్యూజిక్ డైరెక్టర్లకు ఇష్టుడయ్యారు.రచయితలూ సంతుష్టులయ్యారు. 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆనాటి యువతను ఆకట్టుకున్నాయి. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది.
-
- నాలుగు తరాల హీరోలకు పాడే అవకాశం ఒక్క బాలుకే దక్కింది.ప్రపంచంలో మరే గాయకుడికీ దక్కని అరుదైన అదృష్టమిది. బాలులో ఉండే ప్రత్యేకమైన శైలి.. ఎవరినీ అనుకరించని ఓ విశిష్టమైన బాణీయే ఆ గాన గంధర్వుడికి పాటల పట్టాభిషేకాన్ని చేసి పెట్టాయి. తెరముందు ఎందరు హీరోలున్నా తెర వెనుక ఒకడే హీరో బాలు! హీరోలకి పాడగలరు. కమెడియన్లకి పాడగలరు. ఒక్కో హీరోకి ఒక్కోలా పాడగలరు. ఒక్కో కమెడియన్ కి ఒక్కోలా పాడగలరు. వంద కంఠాలతోనైనా పాడగలిగే అద్భుత ప్రతిభాశాలి. అయినా బాలు నిగర్వి. ప్రతిభనీ వినయాన్నీ అనులోమానుపాతంలో పెంచుకున్న వినయశీలి. అసలు- వినయం అంటే బాలు దగ్గరే నేర్చుకోవాలి.
-
- ఆకాశమంత ఎత్తు ఎదిగినా తనకి ఏమీ రాదని చెప్పే నిరహంకారం ఎవరికోగానీ సాధ్యం కాదు. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు.లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథలీల సినిమాలను తెలుగులో డబ్ చేశారు. అప్పుడు సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు బాలు. ఆ సినిమాలో కమలహాసన్‌కు చక్రవర్తి గాత్రమిస్తే, కమల్ ఆఫీసులో పని చేసే ఓ పాత్రకు బాలు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత అనేక మంది నటులకు డబ్బింగ్ చెప్పారు. 2010లో కమలహాసన్ హీరోగా వచ్చిన దశావతారం సినిమాలో కమలహాసన్ పోషించిన పది పాత్రలల ఏడు పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పారు.
-
- న్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్స్లేకు తెలుగులో గాత్రమిచ్చినది మన బాలునే! 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ సినిమాలో మెరిశారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో హీరోగా నటించారు. తెలుగులో ఈ సినిమాను ఓ పాపాలాలి పేరుతో డబ్ చేశారు. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం తదితర చిత్రాల్లో ఆయన నటన అమోఘం.
-
- చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన దేవదాస్‌లో కనిపించారు. శంకరాభరణం సినిమాకు మొదటిసారి జాతీయ అవార్డును గెల్చుకున్న బాలు తన మొత్తం కెరీర్లో ఆరు నేషనల్ అవార్డులను అందుకున్నారు. మైనే ప్యార్ కియా సినిమాకుగాను తొలిసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. మొత్తం ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు బాలు సొంతమయ్యాయి. 29 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకుడు .
-
- భారతదేశం మొత్తం వెతికినా దొరకడు. భారతదేశమే కాదు. ప్రపంచంలోనే అలాంటి సింగర్ లేరు, రారు అని చెప్పడానికి మొహమాటపడాల్సిన పని లేదు. గాయకుడిగా కంటే మంచిమనిషిగా బాలునే చెప్పుకోవాలంటారు కొందరు. అందుకే పద్మశ్రీల్లాంటి కిరీటాలూ, డాక్టరేట్ల లాంటి డాబుసరి బిరుదాలూ బాలు ప్రతిభకీ, వ్యక్తిత్వానికీ ఎంతమాత్రం వెలకట్టలేవు.

Ehatv
Next Story