విజయలక్ష్మి వడ్లపాటి(Vijay lakshmi Vadlapati).. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.

విజయలక్ష్మి వడ్లపాటి(Vijay lakshmi Vadlapati).. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సిల్క్‌ స్మిత(Silk smitha) పేరు మాత్రం తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారంతా డిసెంబర్‌ 2వ తేదీని గుర్తు పెట్టుకోకుండా ఉండరు. ఎందుకంటే ఆ రోజు సిల్క్‌ స్మిత బర్త్‌డే! ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా చాలామంది గుండెల్లో గూడుకట్టుకునే ఉంది కాబట్టి బర్త్‌ డే అంటే తప్పులేదు.

తొమ్మిదో దశకంలో ఆమె తెరమీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు సమ్మోహితులయ్యేవారు. ఆ మత్తుకళ్ల సౌందర్యాన్ని చూసి మంత్ర ముగ్ధులయ్యేవారు. ఆమె క్రేజ్‌ మామూలుగా ఉండేది కాదు. ఓ సినిమా షూటింగ్‌(Cinema shooting) సమయంలో షాట్‌ గ్యాప్‌లో సిల్క్‌ స్మిత ఆపిల్‌ తింటున్నారు. డైరెక్టర్‌ షాట్‌ రెడీ అనడంతో సగం తిన్న ఆపిల్‌ను అక్కడే పెట్టేసి కెమెరా ముందుకు వెళ్లారు. సెట్‌లోని ఓ బాయ్‌ ఆ ఆపిల్‌ను సిల్క్‌ స్మిత కొరికిన ఆపిల్‌(Smitha apple) పండు అంటూ వేలం వేశాడు. ఆ పండును కొనేందుకు జనం ఎగబడ్డారని చెబుతుంటారు. వేలంలో ఎంతకు కొన్నారో తెలియదు కానీ ఎక్కువ ధరనే పలికింది. సిల్క్‌ స్మిత క్రేజ్‌ ఎలాంటిదో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే! ఆమె సినిమాలో ఉంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడేవారట! ఆమె నవ్వును చూసేందుకు నాలుగైదు సార్లు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. స్టార్‌ హీరోలు ఎందరున్నా సరే, సిల్క్‌ ఉన్న సినిమాకు ఓపెనింగ్స్‌ బాగా ఉండేవి. తెరపై అందాలను ఒలకబోసి, మందస్మితంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిల్క్‌ జీవితం వ్యధాభరితమే! పాపం తెరవెనుక ఆమె నవ్వింది తక్కువ. కన్నీరు పెట్టిన సందర్భాలే ఎక్కువ. నమ్మినవారి చేతిలో దారుణాతిదారుణంగా మోసపోయి, ఆ బాధను తట్టుకోలేక చిన్న వయసులోనే జీవితాన్ని ముగించుకున్నారు సిల్క్‌.

ఇప్పటి ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో డిసెంబర్‌ 2, 1960లో జన్మించారు విజయలక్ష్మి ఉరఫ్‌ సిల్క్‌ స్మిత. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె జీవితంలో చేసిన మొదటి తప్పు అది! భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయారు సిల్క్‌. మద్రాస్‌లో ఉంటున్న తన అత్త దగ్గరకు వెళ్లారు. సినిమాలంటే ఆమెకు ఎంతో ప్రేమ! ఎప్పటికైనా కథానాయిక కావాలని అనుకునేవారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టడం కోసం ముందు సినీ నటి అపర్ణకు టచ్‌ అప్‌ ఆర్టిస్‌గా చేరారు. అలా ఆమె సినీ కెరీర్‌ మొదలయ్యింది. సిల్క్‌లోని అనిర్వచనీయమైన అందాన్ని చూసిన మలయాళ దర్శకుడు ఆంటోని ఈస్ట్‌మన్‌ ఆమెను ఇనాయే తేడి అనే సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు. సినిమా కంప్లీట్‌ అయినప్పటికీ విడుదల కావడం చాలా ఆలస్యమయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్ విజయలక్ష్మి పేరును స్మిత గా మార్చాడు. తమిళ నటుడు దర్శకుడు, విను చక్రవర్తి స్మితకు కెరీర్ తొలినాళ్లలో సాయం చేసాడు. విను చక్రవర్తి రైటర్ గా విజయన్ దర్శకత్వంలో 1979లో వచ్చిన (వండి చక్రం) బండి చక్రం సినిమాలో తొలిసారిగా సిల్క్ స్క్రీన్ పై కనిపించింది.

ఈ సినిమాలో ఆమె పేరు సిల్క్‌.. ఆ పాత్ర పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి స్మిత కాస్తా సిల్క్‌ స్మిత అయ్యారు. వండి చక్రం సూపర్‌ డూపర్‌ హిట్టయ్యింది. ఆ సినిమాతో సిల్క్‌ ఓ ఐటం సాంగ్స్‌ చట్రంలో ఇరుక్కుపోయారు. ఆమెలో అద్భుతమైన నటి ఉన్నప్పటికీ దర్శకులు ఆమెను ఐటం సాంగ్స్‌కే పరిమితం చేశారు. సీతాకోకచిలుక సినిమాలో భారతీరాజా అమెలోని నటిని వెలికి తీశారు. సిల్క్ పాట ఉంది అంటే చాలు జనాలు విరగబడేవారు. థియేటర్లు ఫుల్లు అయ్యేవి. కొందరు ఆమెను సాఫ్ట్ పోర్న్ స్టార్‌ అంటూ విమర్శించారు కానీ వాటిని ఆమె ఎప్పుడూ పట్టించుకోలేదు. అవకాశం దొరికిన ప్రతీ సినిమాలో నటించారు. విడుదలకు నోచుకోకుండా లాబ్‌లో మూలుగుతున్న సినిమాలను కూడా బయటకు తీసి సిల్క్‌ స్మిత పాటను జత చేసి సొమ్ము చేసుకున్న నిర్మాతలు చాలా మందే ఉన్నారు. 17 ఏళ్లు స్వల్ప సినీ కెరీర్ లో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 500 లకు పైగా సినిమాలలో నటించారు సిల్క్‌. అందరూ ఆమెను అహంకారి అంటారు కానీ ఆమె స్వభావమే అంత! సినీ కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే ఓ స్టార్‌ హీరో ప్రేమలో పడ్డారు. అయితే ఆ స్టార్‌ హీరో దారుణంగా మోసం చేశాడు. అదే సమయంలో నిర్మాతగా రెండు సినిమాలు తీశారు. ఆ రెండూ సినిమాలు ఫెయిలయ్యాయి. అప్పులు పెరిగాయి. ప్రేమలో మోసపోయిన సిల్క్‌ను ఆర్ధిక సమస్యలు మరింత వేదనను కలిగించాయి. ఆ బాధను తట్టుకోలేక మద్యానికి అలవాటు పడ్డారు. డిప్రెషన్‌లోకి కూడా వెళ్లారు. 1996 సెప్టెంబరు 23 రాత్రి, కన్నడ సినిమా షూటింగ్ తర్వాత హోటల్ కు వచ్చారు సిల్క్‌. తన స్నేహితురాలు నటి అనురాధ కు కాల్ చేసి తన బాధను చెప్పుకున్నారు. అదేరోజు తన హోటల్ గదిలో ఉరివేసుకుని చనిపోయారు. స్మిత శరీరంలో అధికంగా మద్యం ట్రేసెస్ దొరకడం వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. పోలీసులు ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సిల్క్‌ స్మితది ఆత్మహత్య కాదని, హత్య అని బలంగా నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఏమైతేనేమీ ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

ehatv

ehatv

Next Story