✕
మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన.మనసు పడే వేదన అక్షరరూపం దాలిస్తే ఆయన రూపమే దాలుస్తుంది.ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది. మనసును టోటల్గా అటాప్సీ చేసిన హార్ట్ స్పెషలిస్టాయన. ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కొందరాయన్ను రాత్రేయన్నారు. ఇంకొందరు బూత్రేయన్నారు. అందరూ నిండు మనసుతో ఆత్రేయ(Atreya) అని పిలుచుకున్నారు. ఇవాళ ఆయన జయంతి(Birth anniversary) . కాబట్టి ఆయన మనసుకవి గురించి నాలుగు విషయాలు చెప్పుకుందాం!

x
Acharya Atreya
-
- మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన.మనసు పడే వేదన అక్షరరూపం దాలిస్తే ఆయన రూపమే దాలుస్తుంది.ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది. మనసును టోటల్గా అటాప్సీ చేసిన హార్ట్ స్పెషలిస్టాయన. ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కొందరాయన్ను రాత్రేయన్నారు. ఇంకొందరు బూత్రేయన్నారు. అందరూ నిండు మనసుతో ఆత్రేయ(Atreya) అని పిలుచుకున్నారు. ఇవాళ ఆయన జయంతి(Birth anniversary) . కాబట్టి ఆయన మనసుకవి గురించి నాలుగు విషయాలు చెప్పుకుందాం! మనిషి, మనసు, మమత, దేవుడు, విధి, ప్రేమ, విరహం ఇవి ఆత్రేయ కవితా వస్తువులు. వాటితోనే మనసును తాకే పాటలు రాశారు. విచిత్రమేమిటో కానీ ఆత్రేయ వాక్యం రాస్తే అది పాటయ్యేది. మామూలు పదాలు రాసినా పదికాలాల పాటు నిలిచే గీతమయ్యేది. అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు(Kilambi venkata narsinha charyulu).పేరు చివరిభాగాన్ని ముందుకు తీసుకొచ్చి దానికి గోత్రనామాన్ని తగిలించేసుకుని ఆచార్య ఆత్రేయ అయ్యారు. నాటకాలు, నాటికలు, కథలు, సినిమాకు పాటలు, కొన్నింటికి మాటలు అన్నీ రాశారు. వాగ్దానం సినిమాకు దర్శకత్వం వహించారు.
-
- ఆత్రేయ మనసుకవి. మన సుకవి. మనిషి, మనసు, ప్రేమ, దు:ఖం, బ్రతుకు, మరణం, ప్రేయసీప్రియుల ప్రణయం, అందులోని వేదన, విరహం, కోపతాపాలు, అలకలు, కినుకులు ఆత్రేయ పాటల్లో ఒదిగిపోయాయి. మనసు గురించి ఎంతగా మనసు పెట్టి రాస్తారో వయసు గురించి, ఆ వయసు పులకరింతల గురించి, ఆ వయసు చేసే తుంటరిపనుల గురించీ అంతే గడుసుతనంగా రాస్తాడు. ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది. ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది అంటారు ప్రేమనగర్లో. ఆ ఇరుకైన హృదయం ఎంత వేదనను అనుభవించిందో తెలియదు కానీ ఆ వేదనలోంచి వచ్చిన పాటలన్నీ చిరస్మరణీయాలయ్యాయి. దు:ఖం కమ్మేసినప్పుడు ఓదార్పు కావాలి. కంటి నిండా నిదురరావాలి...అప్పుడే కాస్త తేరుకోగలం...ఆత్రేయ ఒక్క పాటలో మొత్తం సారమంతా చెప్పేశారు. జోలపాటల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకున్న ఈ పాటలో ఆర్ర్దతను. అనురాగాన్ని చక్కగా ఇమడ్చారు మన సుకవి. అప్పుడప్పుడు ఆయనలో శ్రీశ్రీ పరకాయప్రవేశం చేస్తాడు. అలాంట సమయాల్లో ఆయన సోషలిస్ట్ భావాలతో కూడిన పాటలు రాశారు.
-
- తోడికోడళ్లు సినిమాలో కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పడచుదానా పాట ఇందుకు మంచి ఉదాహరణ. ఆత్రేయ చిలిపిపాటలు రాశారు. వలపు పాటలూ రాశారు. శభాష్ వదిన సినిమాలోని ఓ పాటలో పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకోవాలి. నాకు నువ్వు నీకు నేను రోజు రోజూ ఓడిపోవాలి అని అంటారు. నిజమే మిగతా అన్ని చోట్ల గెలవటం విజయం. శృంగారంలో మాత్రం అవతలివారిని గెలిపించడమే విజయం. దీన్ని ఆత్రేయ ఎంతబాగా సూత్రీకరించారో. మంచిచెడు సినిమాలోని రేపంటి రూపం కంటి పాట మరోసారి వినండి. అందులో రెండో చరణంలో ఏం రాశారంటే.' నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి వేయించి నన్నునేనే ఓడిపోమ్మంటి, నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిల్లు రోజు రానీ రమ్మంటి ' అని అంటారు. ఇంకో పాటలో అంటారు. 'తేటి ఎగిరిపోతుంది.పువ్వు మిగిలిపోతుంది. తేనె వున్న సంగతి తేటి గురుతు చేస్తుంది' అని. ఎంత అద్భుత భావన. తేలికైన పదాలతో బరువైన భావాలను పలికించడంలో ఆత్రేయకు మించిన వారు లేరు. ఆయన కష్టపడి ఏనాడు రాసింది లేదు. పదాలే ఇష్టపడి ఆయన పాటయ్యాయి.
-
- రామపాదాలు సోకిన రాయి అహల్య అయినట్టు ఆత్రేయ పదాలు అల్లుకున్న పాట పడుచుపిల్ల పయ్యెదలయ్యాయి. పలచని వెలుగును పరిచాయి. మనిషికీ మనసుకీ వున్న అనుబంధాన్ని ఆత్రేయంత గొప్పగా చెప్పిన కవి మరోకరు లేరు.. ఆయన రాసిన పాటల్లోని కొన్ని వాక్యాలు తెలుగునాట నానుడిగా మారాయంటే అది ఆ కలం బలం మహిమే! మనసు లేకుండా బతికేయడమంటే అది నరకంతో సమానమట! అలాగే మరుపులేని మనసు కూడా అంతేనట! లేకపోతే జ్ఞాపకాలు తరుముకుని వచ్చి గులాబిముళ్లులా పదే పదే గుచ్చుతుంటాయట! ఆడవాళ్ల మనసును అర్థం చేసుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదంటారు ఆత్రేయ. మనిషై పుట్టి ఎవరినో ఒకరిని ప్రేమిస్తే కాని దేవుడికి అర్థం కాదన్నది ఆయన భావన. ఆత్రేయ పాటరాయడానికి చాలా టైమ్ తీసుకునేవారు. అనుకున్నటైమ్కి పాట ఎప్పుడూ నిర్మాతకి ఇచ్చేవారు కాదు. కానీ మంచి చమత్కారి. ఓ నిర్మాత ఆత్రేయకోసం చోళ హోటల్ బుక్ చేసి, అక్కడ ఉండి తన సినిమాకి పాటలు రాసిపెట్టమన్నాట్ట. ఎంత కాలమైనా ఒక్క పల్లవీ రాసి ఇవ్వలేదట ఆత్రేయ. ఏమని అడిగితే, ఇది చోళ హోటల్. ఇక్కడ పల్లవులు రావడం ఎలా సాధ్యం? అన్నాట్ట. కానీ ఆత్రేయ కలం కదిలించి పాట రాస్తే మాత్రం అది ప్రేక్షకుల హృదయాల్ని కదిలించేది. అందుకే అంటారు.. ఆత్రేయ రాయక నిర్మాతల్నీ రాసి ప్రేక్షకుల్నీ ఏడిపిస్తాడని.
-
- ఆత్రేయది అంతరంగ కవిత్వం. అది స్వీయానుభవాల వ్యక్తీకరణ. ఆర్ర్దత వుంటుంది. నైరాశ్యం వుంటుంది. ప్రణయ పిపాసా వుంటుంది. మనిషి, మనసు, మమత వీటి మీదే కాదు మనసున్న మనిషి పడే ఆవేదన, సంఘర్షణకు సంబంధించీ ఆయన రాశారు. మనసును ఆయన పరిశోధించారు. పలకరించారు. విశ్లేషించారు. మనసును ఉపశమింపచేసేవి. మనిషిని ఓదార్చేవీ రాశారు... గుండెపోటొచ్చి ఆస్పత్రిలో చేరారు ఆత్రేయ. ఇది తెలిసి సన్నిహితులంతా ఆయన చుట్టూ చేరారు. 'చూశారా! ఇన్నాళ్లూ ఆత్రేయ హృదయం లేని మనిషని ఆడిపోసుకున్నారు కదా! ఇప్పుడు నాకూ హృదయముందని రుజువైంది' అన్నాట్ట నవ్వుతూ. పరిహాసానికి అన్నా నిజంగానే ఆత్రేయది నిండు హృదయం. ఆ హృదయం చిలిపితనం కురిపించింది. వలపుదనం పండించింది. భక్తిని పారించింది...
-
- జోల పాటలకి మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా తల్లి తన పాపాయికోసం పాడే ఈ పాటలు ఎంతో ప్రేమతో నిండి ఉంటాయి. మేనత్తపాడే పాటలు ఇంకానూ. తోడు నీడ సినిమాలో ఆత్రేయ రాసిన అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా పాట తలమానికం. ఇందులో అమ్మలు కన్నుల్లు తమ్మి పువ్వుల్లు అని ఆత్రేయ చేసిన ప్రయోగం అద్భుతం..ఆత్రేయ కలం నుంచి భక్తి రసం తరాల కొద్దీ పాడుకునేలా సిరాల కొద్దీ ఒలికింది. కలియుగాంతం వరకు తిరుమలవాసుని భక్తులు పాడుకునే పాట శ్రీవేంకటేశ్వర మహత్య్మంలోని శేష శైల వాసా శ్రీ వెంకటేశ పాట. కాదనగలరా ఎవరైనా?
-
- అలాగే వాగ్దానంలో వెలుగుచూపవయ్య మహిలో, శ్రీ వేంకటేశ్వరవైభవంలో తెర తీయరా తిరుపతి దేవరా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. చిన్ని కృష్ణుడి కోసం ఎదరుచూస్తూ వున్న వకుళాదేవి నిజంగానే పాటపాడితే అది శ్రీ వెంకటేశ్వరమహత్యంలోని ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురుచూతురా గోపాల పాట కంటే గొప్పగా ఉండదేమో! దేశభక్తి పాటలు కూడా రాశారాయన! బడిపంతులు సినిమాలోని భారత మాతకు జేజేలు పాట సదా మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఇక ఆకలిరాజ్యంలోని సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ పాటలో స్వతంత్రదేశంలోని అసమానతలను, స్థితిగతులను విడమర్చి చెప్పారు. ఆత్రేయ ఎక్కువగా రాత్రుళ్లే పాటలు రాస్తారు కాబట్టి కొందరాయన్ను రాత్రేయ అన్నారు. కొన్ని పాటల్లో ద్వందార్ధాలు నింపాడు కాబట్టి ఇంకొందరాయన్ను కాస్త పచ్చిగా బూత్రేయ అన్నారు. నిర్మాతల బలవంతమో, దర్శకుల పంతమో తెలియదు కానీ ఆయన కొన్ని చిలిపి పాటలూ రాశారు. గమ్మత్తేమిటంటే అప్పటి తరాన్ని అవి గట్టిగా ఆకర్షించాయి. మత్తులా ఆవరించాయి.

Ehatv
Next Story