మహానటుడు ఎన్.టి.రామారావు(Sr NTR) తెలుగువారికి ఆరాధ్యుడు. సినీ రంగంలోనే కాదు, రాజకీయరంగంలోనూ(Politics) ఆయన చరిత్ర సృష్టించాడు. సినిమాల్లో ఆయన చేయని ప్రయోగం లేదు. వేయని పాత్ర లేదు. తనకు నచ్చాలే కానీ ఎలాంటి పాత్రనైనా ఒప్పుసుకునే రకం. జనం చూస్తారా చూడరా అన్న ఆలోచన ఉండేది కాదు. ఆ పాత్ర చేస్తే కెరీర్‌కు(Career) నష్టం వస్తుందా అని చూసేవాడు కాదు. 1972లో వచ్చిన బడిపంతులు సినిమానే తీసుకోండి. అప్పటికీ ఆయన సినీరంగానికి వచ్చి 23 ఏళ్లు అవుతుంది. అప్పుడాయన వయసు 49 ఏళ్లు. బడిపంతులు సినిమాలో రామారావు నటనకు జనం నీరాజనాలు పట్టారు. విమర్శకులు ప్రశంసించారు. హీరో పాత్రలు వేస్తున్న ఎన్టీఆర్ బడిపంతులు పాత్ర వేయడమే ఆసక్తికలిగించే విషయం. ఈ సినిమా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మళ్లీ యువ హీరో పాత్రలు వేశారు. హిందీలో ధర్మేంద్ర, అమితాబ్‌బచ్చన్ వేసిన పాత్రలను తెలుగు వెర్షన్లో ఎన్టీఆర్ వేయడం మొదలుపెట్టాడు. యాదోంకీ బారాత్, జంజీర్, దీవార్, జానీమేరానామ్ ఇలాంటి సినిమాలు తెలుగులో ఎన్టీఆర్ చేశారు. ఎదురులేని మనిషి సినిమాతో రామారావు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
కొంచెం వల్గారిటీ వచ్చి చేరింది. జనం చూశారు కాబట్టి ఆయన కూడా చేస్తూ పోయాడు. ఎన్టీఆర్ సినీ ఫీల్డ్‌కు వచ్చిన కొన్నాళ్లకే సొంతంగా ఎన్ఎటీ అనే ఓ నిర్మాణ సంస్థను ఏర్పరచుకున్నాడు. ఆ బ్యానర్లో తోడుదొంగలు అనే సినిమా తీశాడు. అప్పుడాయనకు 30 ఏళ్లు. ఆ సినిమాలో ఆయన 60 ఏళ్ల ముసలివాడి వేషం వేశారు. ఆయన కొడుకుగా చలం, భార్యగా హేమలత వేశారు. ఇప్పుడు ఈ విషయం చెబితే ఎవరూ నమ్మరు. ఇదే సమయంలో అగ్గిరాముడు చేశారు. రాబిన్‌హుడ్ వంటి పాత్రను వేస్తూ ముసలివాడి పాత్ర వేస్తే ఇమేజ్ పోతుందేమోనన్న బెంగే లేదు ఎన్టీఆర్‌కు. వినోదావారు కన్యాశుల్కం సినిమా తీస్తూ గిరీశం పాత్ర కోసం నాగేశ్వరరావును అప్రోచ్ అయ్యారు. విలనిక్ షేడ్ ఉందని చెబుతూ ఎఎన్ఆర్ వద్దనేశాడు. రామారావు దగ్గరకు వెళితే మరో మాట మాట్లాడకుండా ఓకే చెప్పారు. అలాగే చింతామణి సినిమా కూడా. వేశ్యకు విటుడిగా ఉన్న బిల్వమంగళుడి పాత్ర కోసం మొదట ఎఎన్ఆర్ను అడిగారు. ఆయన వద్దన్నాడు. ఎన్టీఆర్ సరే అన్నాడు. స్వర్ణమంజరి సినిమా కూడా అంతే. ఇక రాజూపేద సినిమాలో ఎన్టీఆర్ వేసిన వేషం చూస్తే ఎలా ఒప్పుకున్నాడా అన్న అనుమానం కలగక మానదు.
ఆ సినిమాలో ఎన్టీఆర్ వేసిన పాత్ర ఓ దరిద్రుడి పాత్ర. మోస్ట్ అన్గ్లామరైజ్డ్ పాత్ర. చినిగిపోయిన దుస్తులు కట్టుకునే చిల్లరమల్లర దొంగ పాత్ర. తాగుబోతు, భార్య బిడ్డలను కొట్టడం తప్ప ఆ పాత్ర చేసేదేమీ ఉండదు. అయినా సరే చేశారు. దాసి సినిమాలో కూడా అంతే.. ఏ మాత్రం గ్లామర్ ఉండదు. భీష్మ సినిమాలో ముసలి పాత్రలోనే ఎక్కువ సేపు కనిపిస్తాడు. కలసివుంటే కలదుసుఖం సినిమాలో అవిటివాడి పాత్ర. నర్తనశాలలో బృహన్నల వేషం. ఈ విధంగా ఎన్టీఆర్ అన్ని రకాల పాత్రలు పోషించారు. చండీరాణి సినిమా గురించి కూడా చెప్పుకోవాలి. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరోనే అయినప్పటికీ సినిమా మొత్తం నడిపించింది భానుమతే. ఓ విధంగా చెప్పాలంటే సినిమాకు ఆమెనే హీరో! అయినా ఎన్టీఆర్ చేశారు. మంచి పాత్రలు వేయాలన్న తపన ఎన్టీఆర్‌లో ఎక్కువగా ఉండేది.
తెనాలి రామకృష్ణ,మహామంత్రి తిమ్మరసు చిత్రాలలో కృష్ణదేవరాయలుగా, సారంగధరలో సారంగధరుడుగా, బొబ్బిలియుద్ధంలో రంగరాయుడుగా, పల్నాటియుద్ధంలో బ్రహ్మనాయుడుగా, చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడుగా, సమ్రాట్ అశోకలో అశోకుడిగా నటించాడు. అల్లూరి సీతారామారాజుగా రెండు సినిమాలలో కాసేపు కనిపిస్తాడు. రామారావు కామెడీ కూడా బాగానే చేస్తాడు. పెళ్లి చేసి చూడు, వద్దంటే డబ్బు, మిస్సమ్మ సినిమాలలో సటిల్ హ్యూమర్‌ను అందించాడు. గుండమ్మకథ తీసేనాటికి ఎన్టీఆర్‌కు 40 ఏళ్లు. లాగూ వేసుకుని వేయాలని చక్రపాణి చెబితే ఈ వయసులో ఇదేమిటని ఎన్టీఆర్ నిర్ఘాంతపోయాడట! చక్రపాణి పట్టుబట్టేసరికి చేయక తప్పలేదు. సినిమా ఫస్ట్ కాపీ చిన్నపిల్లలకు చూపారట. వాళ్లు ఎన్టీఆర్ పాత్ర బాగా ఎంజాయ్ చేశారట! ఆ సినిమా హిట్ కావడంతో తర్వాత చాలా సినిమాల్లో అలాటి పాత్రలు వచ్చాయి. ఇరుగు-పొరుగు, రాముడు-భీముడు, దాగుడుమూతలు.
తిక్క శంకరయ్య, యమగోల(Yamagola) సినిమాలలో కూడా ఎన్టిఆర్ పండించిన హాస్యం చాలా బాగుంటుంది. ముఖ్యంగా యమగోలలో యముడి దగ్గిర డైలాగులు చాలా బాగుంటాయి. కానీ దేవాంతకుడి టైములో కనబడ్డ సటిలిటీ యమగోలలో మిస్సయింది. ఇదే ఎన్టీఆర్ చిరంజీవులు, ఇంటికిదీపం ఇల్లాలే, రక్త సంబంధం, ఆత్మబంధువు వంటి సినిమాలో కంటతడి పెట్టిస్తాడు. వివాహబంధం, నిర్దోషి, రాము సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నటన గొప్పగా ఉంటుంది. ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చాడే కానీ తనదే పై చేయిగా ఉండాలని ఎప్పుడూ పట్టబట్టలేదు. తన 200 వ సినిమా, తన సొంత సినిమాకు ఆయన తన పాత్రపరంగా పేరు పెట్టలేదు. కోడలు దిద్దిన కాపురం అని సావిత్రి పరంగా టైటిల్ పెట్టారు. ఎన్టీఆర్ పక్కన వేసింది వాణిశ్రీ. అప్పటికీ ఆమె చిన్న హీరోయిన్. ఆమె దెబ్బ కొడితే తను పడిపోయినట్టు చూపించుకున్నాడు. అప్పడు ఎన్టీఆర్ టాప్‌లో వున్నాడు. అభిమానులు ఏమనుకుంటారన్న బెంగే లేదు. వెరైటీ రోల్స్‌కి అవకాశం వచ్చినపుడు వదులుకోలేదు .తీర్పు సినిమాలో న్యాయమూర్తి పాత్ర ఇలాంటిదే. నటుడిగా ఆయన వేయలేని పాత్ర లేదన్నట్టు తనివితీరా అన్ని పాత్రలు వేశాడు. అందుకే ఆయన విశ్వవిఖ్యాతుడయ్యాడు. నటసార్వభౌముడయ్యాడు.