వహీదా రెహమాన్(Waheeda Rehman) బాలీవుడ్‌లో సుప్రసిద్ధ నటి అయ్యాక తెలుగు సినిమాలవైపు దృష్టి పెట్టలేదు. తెలుగు దర్శక, నిర్మాతలు కూడా తమ సినిమాల్లో నటించమని ఆమెను అడగలేదు. ఓసారి మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకు వహీదా రెహమాన్ ఎదురుపడ్డారు.
వహీదా రెహమాన్(Waheeda Rehman) బాలీవుడ్‌లో సుప్రసిద్ధ నటి అయ్యాక తెలుగు సినిమాలవైపు దృష్టి పెట్టలేదు. తెలుగు దర్శక, నిర్మాతలు కూడా తమ సినిమాల్లో నటించమని ఆమెను అడగలేదు. ఓసారి మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుకు వహీదా రెహమాన్ ఎదురుపడ్డారు. వహీదా 1951లో తెనాలిలో ఓ డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అప్పట్నుంచే దుక్కిపాటికి వహీదా పరిచయం ఉంది. ఎయిర్‌పోర్టులో ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగానే పెళ్లి చేసుకోబోతున్నానండి అని దుక్కిపాటికి చెప్పారు వహీదా.
మంచి వార్త చెప్పారు. పెళ్లి చేసుకోబోయేముందు ఓ తెలుగు సినిమాలో నటించవచ్చు కదా అని దుక్కిపాటి మధుసూదనరావు(Dukkipati Madhusudan Rao) అన్నారు. మీరు తీస్తానంటే ఎందుకు నటించను అని వహీదా సమాధానమిచ్చారు. యద్దనపూడి సులోచనరాణి రాసిన ఓ నవల ఆధారంగా బంగారుకలలు(bangaru kalalu) సినిమాను ప్లాన్ చేశారు దుక్కిపాటి. అందులో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshwar Rao) పక్కన హీరోయిన్ పాత్రను వహీదా రెహమాన్‌కు ఆఫర్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. ఆ సినిమాలో ముఖ్యమైన చెల్లెలు పాత్రను లక్ష్మికి(Lakshmi) ఇచ్చారు. కానీ అదే సమయంలో చలం నటించి నిర్మించిన దేవుడమ్మ సినిమాలో కూడా లక్ష్మి ఇలాంటి పాత్రనే పోషించారు.
పోలిక వస్తుందేమోనని భయపడి హీరోయిన్‌గా లక్ష్మిని పెట్టుకుని చెల్లెలు పాత్రను వహీదాకు ఇద్దామనుకున్నారు. కానీ అంత పెద్ద స్టార్ వచ్చి వేషం వేస్తానని చెబితే ఇలా చెల్లెలు పాత్ర ఇస్తే ఏం బాగుంటుందని అని దుక్కిపాటి మధుసూదనరావు సంశయించారు. ఏదైతే అది జరుగుతుందనుకుని వహీదాను స్వయంగా కలిసి అసలు విషయం చెప్పారు. ఆమె కొద్దిసేపు ఆలోచించారు. తాను ఆర్టిస్టునని, చేసేది మంచి పాత్రా? కాదా? అని తప్ప హీరోయిన్‌గా వేయాలన్న పట్టుదల తనకేమీ లేదని, తాను చెల్లెలు పాత్ర వేయడానికి సిద్ధమేనని చెప్పారు.
ఆమె సహృదయానికి మధుసూదనరావు కదిలిపోయారు. అక్కడితో ఆమె ఔదార్యం ఆగలేదు. బాలీవుడ్‌లో అంతటి స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న వహీదా తనతో పాటుగా మందీమార్బలం ఎవరూ లేకుండా ఓ టచప్ ఉమెన్‌ను మాత్రమే తెచ్చుకున్నారు. పైగా పాత్రకు కావలసిన క్యాస్ట్యూమ్‌ను, మేకప్ మెటీరియల్‌ను కూడా బొంబాయి నుంచి తానే తెచ్చుకున్నారు. రిట్జ్ హోటల్‌లో వహీదా కోసం ఓ రూమ్ బుక్ చేశారు.
దానికి కూడా ఆమె 'ఎందుకండి డబ్బులు దండగ, నేను కూడా సారథీ స్టూడియోలోనే ఉంటాను' అని చెప్పారు. దుక్కిపాటికి మనసొప్పక ఆమెను ఎలాగోలా ఒప్పించి బ్లూ మూన్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. తెలుగు నటీనటులతో కూడా ఏపాటి భేషజం లేకుండా నటించారు వహీదా. అన్నట్టు అందులో నాలోన వలపుంది మీలోన వయసుంది అన్న క్లబ్ సాంగ్ ఒకటుంది. ఆ పాటలో కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి క్లబ్‌లో ఓ కస్టమర్‌గా కనిపిస్తారు. క్లబ్ డాన్స్ చేస్తున్న వహీదా బుగ్గ గిల్లుతారు. దానికి కూడా వహీదా అభ్యంతరం చెప్పకపోవడమే విశేషం. అదీ వహీదా రెహమాన్ గొప్పదనం.