నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుంది కానీ సినిమారంగంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది.
నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుంది కానీ సినిమారంగంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ బంధుప్రీతి కారణంగానే చాలా మందికి సినిమా అవకాశాలు దక్కడం లేదన్నది నిర్వివాదాంశం. సుశాంత్ రాజ్‌పుత్(Sushant Rajput) ఆత్మహత్య తర్వాత నెపోటిజం(nepotism)ఎంత భయంకరమైనదో తెలిసింది. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh)కూడా నెపోటిజం కారణంగా ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయారట! ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్(Bollywood)తో పాటు తెలుగులోనూ నటించారు. టాప్ హీరోల సరసన నటించారు. 'పరిశ్రమలో నెపోటిజం (Nepotism) ఉన్నమాట వాస్తవం. దీని కారణంగా నేను అనేక అవకాశాలు కోల్పోయాను. అవి నాకు రాలేదని బాధ పడలేదు. ఆ సినిమాలు నన్ను ఉద్దేశించినవి కాదని అనుకుని ముందుకు వెళ్లాను. నా తండ్రి సైన్యంలో పనిచేసేవారు. ఆయన సలహాలు, అనుభవం నాకు ఎన్నో నేర్పాయి. చిన్నచిన్న వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. అవకాశాలు కోల్పోవడం జీవితంలో ఓ భాగం. నాకు దక్కని వాటి గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. ఏం చేస్తే నేను వ్యక్తిగతంగా ఎదుగుతానో దానిపైనే శ్రద్ధ పెడతాను. ఒక అగ్రహీరో పిల్లలకు లభించినంత ఈజీగా మిగతా వారికి ఛాన్స్‌లు రావు. అదంతా వారి తల్లిదండ్రుల కష్టం' అని రకుల్ ప్రీత్‌సింగ్ చెప్పారు. ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ హీరోగా వస్తున్న దేదే ప్యార్‌దే 2లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.