విలక్షణ నటుడు రఘువరన్(Raghuvaran) లేని లోటు సినిమా రంగంలో ఇప్పటికీ కనిపిస్తోంది. ఎలాంటి పాత్రనైనా సమర్థంగా పోషించగల గొప్ప నటుడు ఆయన! తాను ధరించిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేయగలరు. అందుకే ప్రజలకు ఆయనంటే అంత అభిమానం. దక్షిణాది భాషలన్నింటిలోనూ రఘువరన్ నటించారు.
విలక్షణ నటుడు రఘువరన్(Raghuvaran) లేని లోటు సినిమా రంగంలో ఇప్పటికీ కనిపిస్తోంది. ఎలాంటి పాత్రనైనా సమర్థంగా పోషించగల గొప్ప నటుడు ఆయన! తాను ధరించిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేయగలరు. అందుకే ప్రజలకు ఆయనంటే అంత అభిమానం. దక్షిణాది భాషలన్నింటిలోనూ రఘువరన్ నటించారు. కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ రఘువరన్ నటించి మెప్పించారు. చివరి రోజులలో మద్యానికి బానిసగా మారిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు. ఇదే విషయంపై రఘువరన్ తమ్ముడు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మీడియాకు దూరంగా ఉండే రఘువరన్ తమ్ముడు ఇన్నాళ్లకు మొదటిసారిగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. 'రఘువరన్ గురించి చాలా మందికి తెలియదు. నేను ఎప్పుడూ అన్నతోనే ఉండేవాడిని. అన్నయ్య చనిపోయిన రోజు నేను బెంగళూరులో ఉన్నాను.
ఆ రోజు రాత్రి తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు తెలపడంతో ఇంట్లోని పనివారు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అన్నయ్య చనిపోయాడని డాక్టర్లు చెప్పారు' అని రఘువరన్ సోదరుడు తెలిపాడు. 'అన్నయ్య చనిపోవడానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవి. ఆ సమస్యలేమిటో అందరికీ తెలుసు. అది ఆయనకు చాలా బాధ కలిగించింది. మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయాడు. రఘువరణ్ తన కొడుకును చాలా ప్రేమించాడు. అన్నయ్య, రోహిణి(Rohini) వేరు వేరుగా ఉండటంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకుని వచ్చే అవకాశం ఉండేది. ఆదివారం తిరిగి వాళ్లు తీసుకెళతారు. కోర్టు అలా చెప్పింది. కొడుకు పరుగెత్తుకుంటూ వచ్చి నాన్న అని ఆప్యాయంగా పిలిచేవాడు. అప్పుడు అన్నయ్య కన్నీరు పెట్టేవాడు. తన కొడుకు తిరిగి వెళ్లిపోయినప్పుడు చాలా బాధపడేవాడు. అలా తన చివరి రోజుల్లో ఎంతో క్షోభను అనుభవించాడు. దాంతో మద్యానికి బానిస అయ్యాడు' అని రఘువరన్ తమ్ముడు చెప్పాడు. అయితే రఘువరన్ మద్యానికి బానిస కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలున్నాయని చెప్పాడు. రోహిణినే కారణం అని పరోక్షంగా చెబుతూ దీనిపై మాట్లాడే ఆసక్తి లేదన్నాడు రఘువరన్ సోదరుడు.