✕
Producer Dil Raju : నిజంగానే దిల్లున్న రాజు దిల్‌రాజు...
By EhatvPublished on 19 April 2023 7:24 AM GMT
కొన్ని పేర్లకు ముందు అనుకోకుండానే, అలవోకగానే కొన్ని టైటిల్స్ వచ్చి చేరుతాయి. పాపం ఆ టైటిల్స్‌కి ఆ విషయం తెలియదు. అదే ఇందులో చమక్. ఎవడి పబ్లిసిటీ కోసం వాడు, మనసుకు నచ్చిన, నోటికి వచ్చిన టైటిల్స్‌ని ఆయాచితంగా తగిలించేసుకుని, సమాజంలో రెచ్చిపోతుంటారు. వాటికి ఏ రకమైన ఆచ్ఛాదన, అడ్డూఆపూ లేదు. అడ్డు తగిలేవాడు అసలే ఉండడు. ఎవడి గోల వాడిదని సమాజం కూడా సరిపుచ్చుకోవడానికి దానాదీనా అలవాటు పడిపోయింది. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో ఈ టైటిల్స్ బెడద ఎక్కువ.

x
Producer Dil Raju
-
- కొన్ని పేర్లకు ముందు అనుకోకుండానే, అలవోకగానే కొన్ని టైటిల్స్ వచ్చి చేరుతాయి. పాపం ఆ టైటిల్స్‌కి ఆ విషయం తెలియదు. అదే ఇందులో చమక్. ఎవడి పబ్లిసిటీ కోసం వాడు, మనసుకు నచ్చిన, నోటికి వచ్చిన టైటిల్స్‌ని ఆయాచితంగా తగిలించేసుకుని, సమాజంలో రెచ్చిపోతుంటారు. వాటికి ఏ రకమైన ఆచ్ఛాదన, అడ్డూఆపూ లేదు. అడ్డు తగిలేవాడు అసలే ఉండడు. ఎవడి గోల వాడిదని సమాజం కూడా సరిపుచ్చుకోవడానికి దానాదీనా అలవాటు పడిపోయింది. ముఖ్యంగా సినిమా ప్రపంచంలో ఈ టైటిల్స్ బెడద ఎక్కువ. అపరిమితం. ఎవడో పక్కన చేరిన భజనగాడు నోటికొచ్చింది, వీలు కుదిరింది, కుదరనిది కూడా సదరు తన ఆసామికి తగిలించేస్తాడు. ఇంక ఆ టైటిల్‌ని సార్థకనామధేయంగా భావించి, పరిగణించి విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తుంటారు సినిమా పరిశ్రమలో.
-
- ఒకడేమో ఆ స్టార్ అంటాడు. మరొకడు మాస్కా బాప్ అంటాడు. ఇంకొకడు బర్నింగ్ స్టార్ అంటాడు. ఇంక అంతే ....ఎవడికి తోచింది వాడు...సార్ధకనామధేయులను మాత్రం వేళ్ళమీదనే లెక్కపెట్టొచ్చు. ఒక నటరత్న, ఒక నటసమ్రాట్, మెగాస్టార్, ఒక వపర్ స్టార్, మెగా పవర్ స్టార్, విక్టరీ, రెబల్...ఇలా సూటయిన టైటిల్స్‌ని కూడా మనం చూశాం. ప్రేక్షకులో, విమర్శకులో ముద్దుగా వారివారి ఘనతలకు అనువుగా, అదనుగా కొన్ని నామమాత్రపు బిరుదలు ఇస్తారు. వాటితోనే వ్యవహరిస్తారు. వాటిని సమాజం కూడా ఆంగీకరిస్తుంది. ఆమోదిస్తుంది. తప్పే బట్టదు. తప్పుబట్టి, విమర్శించాల్సిన సందర్భాలలో కూడా మాకెందుకులే అని ఉదాసీనంగా ఉండిపోయి, నోరు మూసుకుంటుంది. ఇదీ అనాదిగా జరిగే వింత తతంగం.
-
- ఇక్కడ చెప్పాల్సింది...సార్ధక నామధేయుడు దిల్‌రాజు గురించే. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఆప్పుడప్పుడే ఆయన సినీ పరిశ్రమలోకి పైలాపచ్చీసు కుర్రాడిలా బొమ్మల చొక్కా వేసుకుని, టైట్ జీన్ పేంట్లు వేసుకుని కుర్రకారు మోడల్‌కి ఒక మోడర్న్ నమూనాలా, దాదాపుగా హీరో వేషాల కోసం తిరుగుతున్న ఓ రిచ్బాయ్లా పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు-ఆయన తీసిన దిల్ సినిమా పెద్ద హిట్ అయికూర్చుని, ఆయన పేరుకి ముందు దిల్ అని తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సీతారామశాస్త్రిలా! అయితే చూడ్డానికి ఎప్పుడూ హుషారుగా, హుందాగా, మాంచి జోరున్న కుర్రాడిలా పరిగెడుతూ, చాలా స్టైలిష్‌గా దిల్ లాంటి భారీ విజయాన్ని కొట్టేయగానే పరిశ్రమ కూడా ఎక్కడా అన్యధా భావించలేదు.. పైగా దిల్‌రాజు పేరు బాగా ముమ్మరంగా ఎంజాయ్ చేసింది. పిలుచుకోవడానికి కూడా ఈజీగా, ట్రెండీగా ఉండడంతో ఇంక ఆబాలగోపాలానికి దిల్‌రాజు శాశ్వతమైపోయారు. ఇప్పటికీ ఆయన రెడ్డి అనీ అనేకమందికి తెలియదు. ఏదో ఇటీవల భీమ్లానాయక్ రిలీజ్ ముందు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో ఏపి టిక్కెట్ల వివాదంపైన ప్రభుత్వంపైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ మీరు మీరు రెడ్లే కదా....వెళ్ళి మాట్లాడొచ్చుకదా అని సభా ముఖంగా మాట్లాడినప్పుడు చాలా మందికి ఓహో దిల్‌రాజు రెడ్డి సామాజిక వర్గమా అని ముక్కు మీద వేలేసుకున్నారు. అంతవరకూ ఆయన జస్ట్ దిల్‌రాజు మాత్రమే.
-
- ఇదంతా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే...ఆయనెలా దిల్‌రాజు అన్న పేరుకు ఔచిత్యాన్ని కట్టబెట్టారో అన్న పాయంట్కి మాత్రమే. సినిమా పరిశ్రమలో అత్యంత ప్రధానమైన, అత్యంత కీలకమై విభాగం సినిమా జర్నలిజం. పత్రికల ద్వారా సినిమా వార్తలను రాసి, సినిమాలకు ఎనలేని గ్రామర్నీ, గ్లామర్నీ తెచ్చిపెట్టి, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడకి రెక్కలు కట్టుకుని వాలిపోయి, తాము ఓ పక్క నలిగిపోతున్నా, సినిమా వాళ్ళ గొప్పతనాలను తమ గొప్పతనాలుగానే ఫీలైపోయి, అందమైన, చిత్రవిచిత్రమైన అలంకారాలతో, ఉపమానాలతో వర్ణించి వర్ణించి అలసిసొలసి పోతూంటారు. ఓ పక్కన రాజకీయాలను దుయ్యబడుతూ, వాళ్ళే రాజ్యాంగ నిర్మాతలులాగా, వాళ్లే స్వాతంత్ర్య సమరయోధులులాగా, వాళ్ళే ఈ దేశానికి పంచశీల భోదించినట్టు, వాళ్ళే ఆదేశసూత్రాలను కట్టబెట్టినట్టు వ్యవహరించే డైలీ జర్నలిస్టులు సినిమా జర్నలిజాన్ని ఆశ్రయించి, జీవిస్తున్న సదరు సినీ జర్నలిస్టులను తేలికభావంతో, హేళనగా చూస్తున్నా....కాలర్ ఎగరేసుకుని చిరంజీవిగారి చుట్టూరానో, మరో అగ్రనిర్మాత పక్కనో చులాగ్గా తిరిగేస్తూండే ఈ, మా సినిమా జర్నలిస్టులు ఆ మహా జర్నలిస్టుల కన్నా బాగా చదువుకున్నా సరే చిన్నచూపు చూసేందుకు తరతరాలుగా అలవాటు పడిపోయిన నేపథ్యంలో కొన్ని పరిణామాలు సినిమా జర్నలిష్టులకు ఆసరాగా, బాసటగా నిలబడినప్పుడు కాస్తంత ఊరటగా, మరో కొంత ఆత్మగౌరవ సూచికగా అనిపించడమన్నది సర్వసహజమైన విషయం. పైగా ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ సినిచరిత్రలో సినిమా జర్నలిజం అన్నది 24 క్రాఫ్టులలో చోటు, స్థానం సంపాదించుకోలేకపోయింది. ఎవ్వడికీ సంబంధించని ఆమాంబాపతుగాళ్ళు అనమాట సినిమా జర్నలిస్టులు.
-
- వాళ్ళని కూడా గౌరవించి, ఆదరించి, ఆయా కుటుంబాల క్షేమానికి, సంక్షేమానికి తనదైన అమృతహస్తాన్ని అందించడానికి బేషరతుగా ముందుకొచ్చిన దిల్‌రాజు గురించి నాలుగు పొడిమాటలు రాయడానికి చెయ్యారాలేదు. ఆయనంత పెద్ద మనసుతో వ్యవహరించి, సినిమా జర్నలిష్టుల కోసం, వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా హెల్త్ కార్డుల ఏర్పాటుకు తనదైన ఆర్ధిక సహకారాన్ని ఆత్మీయంగా ప్రకటించిన దిల్‌రాజు....మరి దిల్లున్న రాజుగానే అనిపించింది. యాభై ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల కుటంబాలకు హెల్త్ కార్డులను ఏర్పాటు చేసే నిమిత్తం అయ్యే ఆర్థికసహకారాన్ని దిల్‌తో చేసిన దిల్‌రాజు అక్షరాల ఆ పేరుకు సార్తకతను తీసుకొచ్చారు అనిపించింది. అసోసియేషన్ ముఖ్యులు కొండేటి సురేస్, నారాయణ, ప్రభు, గిరిధర్, మల్లి తదితరులను పిలిచి మరీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దిల్‌రాజుకి మొత్తం అసోసియేషనే కాదు,పరిశ్రమలో ఎందరో అభినందనలు తెలియజేసిన ఆర్ద్రమైన సంఘటన ఇది. మళ్ళీ మరోసారి అంటాను. దిల్‌రాజు దిల్ ఉన్నరాజే. " Written By : Nagendra Kumar"

Ehatv
Next Story