తెలుగు సినీ జగత్తును తన మాటల మాయాజాలంతో తనచుట్టూ పరిభ్రమించేలా చేసుకున్న పింగళి నాగేంద్రరావు(Pingali Nagendra Rao)ను ఇవాళ తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఇవాళ ఆ మహారచయిత వర్ధంతి. శృంగార, హస్య, బీభత్స క్రోధాది నవ్య నవరసాగేంద్రరావు అని ఆయనను ఎందుకంటారో ఆయన కలం సృష్టించిన మాటలు, పాటలు చూస్తే అర్థమవుతుంది. ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయంటూ ఎన్నో కొత్త మాటలను సృష్టించారాయ. వాటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. పాళితో వెటకారాలు, చమత్కారాలు నూరారు. పదబంధాలతో ఆడుకున్నారు. వాక్యాలతో పాడుకున్నారు. […]

తెలుగు సినీ జగత్తును తన మాటల మాయాజాలంతో తనచుట్టూ పరిభ్రమించేలా చేసుకున్న పింగళి నాగేంద్రరావు(Pingali Nagendra Rao)ను ఇవాళ తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఇవాళ ఆ మహారచయిత వర్ధంతి. శృంగార, హస్య, బీభత్స క్రోధాది నవ్య నవరసాగేంద్రరావు అని ఆయనను ఎందుకంటారో ఆయన కలం సృష్టించిన మాటలు, పాటలు చూస్తే అర్థమవుతుంది. ఎవరు పుట్టించకుండా మాటలెలా పుడతాయంటూ ఎన్నో కొత్త మాటలను సృష్టించారాయ. వాటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు. పాళితో వెటకారాలు, చమత్కారాలు నూరారు. పదబంధాలతో ఆడుకున్నారు. వాక్యాలతో పాడుకున్నారు. ఇంకా చాలా చాలా చేశారు. మనం చేసేది జనం చూడటం కాదు- జనం కోరేది మనం చేయాలన్న సూత్రానికి కట్టుబడ్డారు. ఘాటు ప్రేమలు, కన్నెకాటులు, వీరతాళ్లు, ఆలమలాలు, సత్యపీఠాలు, ప్రియదర్శినిలు..ఇలా ఎన్ని చమక్కులు చెప్పాలి? పాతాళభైరవి సినిమా పింగళి ప్రతిభావ్యుత్పత్తును అమాంతం బయటకు తీసుకొచ్చింది. డైలాగులంటే ఇలా ఉండాలని అని ప్రేక్షకులు అనుకునేలా చేసింది. సాహసం శాయరా ఢింబకా, నరుడా ఏమీ నీ కోరిక, మహా జనానికి మరదలు పిల్ల, బొడ్డు దేవర, నిజం చెప్పమంటారా-అబద్ధం చెప్పమంటారా, మోసం గురూ, డింగరీ, ఢింబకా, నాకేసి చూడవే బుల్‌బుల్‌, మరీ మనకు అడ్డేమిరా.. మీ గడ్డమే గురూ , తప్పు తప్పు ఇవన్నీ పాతాళభైరవిలో పింగళి సృష్టించిన పదాల గిమ్మిక్కులు. మాయాబజార్‌ సినిమాలో అయితే పింగళి విజృంభిచేశాడు. అదే మన తక్షణ కర్తవ్యం, ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి వుండనే వుంది, ప్రతాపవంతులకు ఎక్కడున్నా కుశలమే, రసపట్టులో తర్కం కూడదు, మీరు ధర్మాత్ములు కాదని తేలినా అన్నగారితో ప్రమాదమేనే, మీ శాస్త్రాలు సామాన్యుల కోసం కౌరవుల వంటి అసాధారణ అపూర్వ జాతకుల కోసం కాదు, వివాహ కార్యక్రమానికి అతి ముఖ్యమైన చిట్ట చివరి క్రియ ఇది-అంటే అంత్యక్రియ, గోంగూర-శాకాంబరిదేవి ప్రసాదం. ఇలా డైలాగులే కాదు ఆయన సృష్టించిన పాత్రల పేర్లు కూడా గమ్మత్తుగా ఉంటాయి. సదాజప, నేపాళ మాంత్రికుడు, తోటరాముడు, రాజుగారి బామ్మర్ది, నిక్షేపరాయుడు, ఆటకోటి దయ్యాలు, ఏకాశ, రెండు చింతలు, త్రిశోకానందుడు, బాదరాయణ ప్రగ్గడా.. చదువుతుంటే వింతగా అనిపించడం లేదూ!? ఇందుకే కదా ఆయనను కొత్త పదాలకు నిత్య కంబళీ అని అన్నది!
పింగళికి సంస్కృతాంధ్ర భాషల్లో మాంచి పట్టుంది.

సినిమాలకు రాకముందు ఆయన అనేక నాటకాలు రాశారు. 1901, డిసెంబర్ 29న బొబ్బిలి దగ్గర రాజాం గ్రామంలో పింగళి జన్మించారు. పింగళి అమ్మగారు లక్ష్మమ్మ కవయిత్రి. చిన్నప్పుడే పింగళికి భారత, భాగవత రామాయణాలను పాట రూపంలో పరిచయం చేసిందామె! పింగళి వంశం పూర్వీకులు మహారాష్ట్రలోని పింగళ గ్రామానికి చెందిన వారు. 14 శతాబ్దంలో కృష్ణా తీర ప్రాంతానికి వలసవచ్చారు. గోల్కొండ ప్రభువు తానీషా దగ్గర మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలు పింగళి వంశం వారే! నాగేంద్రరావు తండ్రిగారు గోపాలకృష్ణయ్యకు యార్లగడ్డలో కరణీకం దొరకడంతో నాగేంద్రరావు బాల్యము, విద్యాభ్యాసము బందరులోనే సాగింది. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు భోగరాజు పట్టాభిసీతారామయ్య, ముట్నూరు కృష్ణారావు వంటి ప్రముఖుల ఆశీస్సులు లభించాయి. వారి ప్రోద్బలంతోనే రచనా వ్యాసాంగం మొదలుపెట్టారు. 1917లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లమో సంపాదించారు . మచిలీపట్నంలోనే కొంతకాలం టీచర్‌గా పని చేశాక..ఖరగ్‌పూర్‌ రైల్వే వర్క్‌షాపులో అప్రెంటెస్‌గా చేరారు. ప్రసిద్ధ యోగ వ్యాయామ మాస్టారు బులుసు రమాజోగారావు ఉపన్యాసాలకు ఉత్తేజితుడై ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి పడేసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. థియోసాఫికల్‌ సొసైటీలో సభ్యత్వం తీసుకున్నారు. ఉత్తర భారతమంతా తిరిగారు. చివరకు సబర్మతీ ఆశ్రమం చేరుకున్నారు. ఆ సమయంలోనే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తర్వాత శారదలో సబ్‌ ఎడిటర్‌గా చేరారు. ఆ పత్రిక నిలిచిపోవడంతో ప్రఖ్యాత రంగస్థల నట దర్శకులు డి.వి.సుబ్బారావుగారి ఇండియన్‌ డ్రమెటిక్‌ కంపెనీలో చేరి 1946 వరకు సెక్రటరీగా పని చేశారు. ఇదిలావుంటే 1941లో భలేపెళ్లి-తారుమారు చిత్రాలకు పని చేసే అవకాశం వచ్చింది. అయితే రెండో ప్రపంచయుద్ధం కారణంగా పింగళి మళ్లీ బందరు చేరుకున్నారు . 1946లో డాక్టర్‌ దుర్గా నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావులు పింగళిని పిలిపించారు. వారికి తన వింధ్యరాణి నాటకాన్ని సినిమా రచనగా అందించారు. కానీ వింధ్యరాణి చిత్రం ఫెయిలయింది. పింగళి పూర్తిగా నిరాశ చెందారు. మరోసారి బందరుకొచ్చేశారు. అదే సమయంలో మిత్రుడు కమలాకర కామేశ్వరరావు పింగళికి ధైర్యం చెప్పి వాహినీకి పరిచయం చేశారు. వారి కోరిక మీద షేక్‌స్పియర్‌ కింగ్‌లియర్‌ నాటకాన్ని తెలుగైజ్‌ చేసి గుణసుందరి కథ రాశాడు. అంతే పింగళి మళ్లీ వెనక్కీ తిరిగి చూడలేదు. వాహినీ నుంచి విడివడిన విజయా సంస్థకు ఆస్థాన కవిగా రాణించారు. ఆరో దశకంలో కొన్ని ఇతర సంస్థల చిత్రాలకు మాటలు పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు కథ మాటలు మాత్రమే రాశారు. నాగసుందరి కథ సినిమాకు స్క్రిప్టు రాశాక నిర్మాణం ఆగిపోయింది. తన చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులకు లోనయ్యారు. విజయా సంస్థలో ఉద్యోగం పోయాక పింగళి కాలు చేయి ఆడలేదు. క్షయ, ఉబ్బస వ్యాధులు పట్టి పీడించాయి. తన ప్రియ నేస్తం విజయా సంస్థ పెద్ద దిక్కు కె.వి.రెడ్డి చనిపోయాక మరింత వేదనకు లోనయ్యారు. 1971 మే ఆరున పింగళి దివంగతులయ్యారు. ఎన్‌.టి. రామారావు నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన చాణక్య చంద్రగుప్త మాటల రచయితగా పింగళి చివరిచిత్రం. పింగళి చనిపోయాక ఆరేళ్లకు ఈ సినిమా వచ్చింది.

ఆయన పాటల్లో ఆహాలు, ఓహోలు చాలా ఉంటాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్‌ జరుగుతున్న సమయమది. అన్ని మంచి శకునములే పాటకు బాణీ కడుతున్నారు పెండ్యాల నాగేశ్వరరావు. మనసున మంగళ వాద్యములు మ్రోగెలే అని రాశారు పింగళి. తాళమేమో కుదరడం లేదు. తెగ శ్రమ పడుతున్నారు పెండ్యాల. 'ఎందుకు నాగేశ్వరరావు అవస్థ? మనసున మంగళ వాద్యమాహా మ్రోగెలే అని ఆహాని మధ్యలో పడేయ్‌.. తాళం చచ్చినట్టు కుదురుతుంది' అని చాలా సింపుల్‌గా తేల్చిపారేశారు పింగళి. ఓసారి రేలంగి పింగళిని అడిగారు 'కవిగారు ! మీరు బ్రహ్మచారి. శృంగార రసం ఎరుగని వారు. మరి శృంగారపు పాటలు, సన్నివేశాలు అంత గొప్పగా ఎలా రాయగల్గుతున్నారు? ' అని. అందుకు పింగళి ' చూడు రేలంగి. శృంగారం రాయడానికి అనుభవం అక్కర్లేదు. యుద్ధపు దృశ్యాలు రాయాలంటే యుద్ధాలు చేయాలా ఏమిటీ? నువ్వు రేలంగివి, నేను పింగళిని. అంటే కవిని.. రవిగాంచనివి కవిగాంచును. రేలంగి గాంచనివి పింగళి గాంచును. అదీ తేడా' అని చమత్కారంగా జవాబిచ్చారు పింగళి. పాటలు రాయడంలో కూడా పింగళి ధురంధరుడే. చందమామ చల్లగా, మత్తు మందు చల్లగా వంటి చిన్న చిన్న తమాషాలతో శ్రవణేంద్రీయాలకు హాయి పుట్టించడం ఆయనకు మాత్రమే తెలిసిన కళ. పెళ్లి చేసి చూడు సినిమాలో జోగారావు, సావిత్రి మధ్య ఓ డ్రీమ్‌ సాంగ్‌ వుంది. జోగారావేమో అర్జునుడు.. సావిత్రేమో ఊర్వశి. అందులో అర్జునుడంటాడు 'చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణీ' అని. అంటే కో ఆపరేటివ్‌ విధానంలో ఊర్వశి తన ప్రేమను పంచుతుందన్నమాట అదే పాటలో 'యుగయుగాలుగా జగజగాలుగా' అంటారు. జగజగాలుగా అనే పదం లేదు. అది పింగళి సృష్టే. తప్పు కదండి అంటే 'ఔచిత్య భంగం కాకుండా ఓ పదం వేస్తే బాగుంటుందనుకున్నప్పుడు వేసేయడమే. ఆలోచన అక్కర్లేదు' అనేవారు పింగళి నవ్వుతూ. ఈ పాటలోనే 'ఊగించిన ఉర్రూగించిన' అని వాడారు. 'తప్పు అని కాకపోయినా అవసరం అనుకుంటే హ్రస్వీకరించి అర్ధమయ్యేట్లుగా మాటని వాడుకోవడంలో తప్పులేదు. నా ఉద్దేశంలో భావం భాషకీ బందీ అయిపోకూడదు' అని వాదించేవారు. పాతాళభైరవిలో 'ఎంత ఘాటు ప్రేమయో' అన్నందుకు భాషా పండితులు నానా యాగీ చేశారు. దుష్ట సమాసం అనీ, భావ ప్రకటన కూడా సరిగాదనీ విమర్శించారు. దీనికీ జవాబిచ్చాడు పింగళి. 'హీరో తోటరాముడు మోటువాడు. మరి వాడి ప్రేమ ఘాటుగా ఉండక. నీటుగా వుంటుందేమిటీ' అని ఎదురు ప్రశ్నించారు. 'పైగా తోట రాముడి ప్రేమ యువరాణికి ఘాటుగా కనిపించింది కాబట్టే అని పాడుకుంది. సమాసాలు కూడా మడి కట్టుకుని పేర్చుకోనక్కర్లేదు. గర్భగుడి వంటి మాటలు ఎన్నో వాడుకల్లోనూ రాతల్లోనూ వస్తున్నాయి' అంటూ పండితుల నోళ్లు మూయించారు. అదీ ఆయన పాండిత్యం వల్ల వచ్చిన మొండితనం. ఆ మొండితనం తెచ్చిన ధైర్యం. గుండమ్మ కథలో 'ప్రేమ యాత్రలకు బృందావనము' అన్న పాటుంది. అందులో జగమునే ఊటీ శాయగా అంటాడు. అంటే జగాన్ని చల్లబర్చడం అన్నమాట. ఈ సినిమాలోనే 'కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా-కానరాని కోయిలలు మనకు జోలపాడగా' అని రాశారు. యుగళంలో చేసిన చమత్కారమిది. కోయిల ఒకరిని మేలుకొలుపుతుందట! ఇంకొకరిని జోలపాడి బజ్జోమంటుందట! బ్రహ్మదేవుడిని హొంతకారి అంటే మల్లయుద్ధ ప్రవీణుడిగా చెప్పింది పింగళే! చిటితాళం వేసి చిట్టంటులు చేస్తే సిగ్గు కీలలు సడలిపోతాయట! కీళ్లలో సిగ్గు కీలు ఒకటుంటుందని, అది సడిలిపోతుందని చాలా గమ్మత్తుగా చెప్పారు. శాస్ర్తమెప్పుడు నిష్కర్షగా కర్కశంగా చెబుతుందట! అందులో సారాన్ని మాత్రమే గ్రహించాలట! మాయాబజార్‌లో అన్న మాట ఇది! మాయాబజార్‌ అంటే గుర్తుకొచ్చింది.

పింగళి సాహిత్యంలో ఓ గొప్ప విశేషం వుంటుంది. అదేమిటంటే ఓ పాత్రతో భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలకు సంబంధించి క్లుప్తంగా ఒక్క మాట చెప్పించడం. మాయాబజార్‌లో సుభద్ర, అభిమన్యులు ఘటోత్కచుని ఆశ్రమంవైపుగా వెళుతున్నప్పుడు అక్కడ ఘటోత్కచుని మాయాజాలంతో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు రథచోదకుడు అభిమన్యుడితో వెనుదిరిగిపోదామా అంటాడు. దానికి అభిమన్యుడు వెనక్కి తిరగడం మనకు తెలియని విద్య అంటాడే తప్ప వీరుడు వెనక్కి తిరగడు అని అనడు. సుభద్ర గర్భంలో వున్నప్పుడే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే చెప్పడం. కృష్ణుని మాయవల్ల వెనుతిరిగి రావడం చెప్పకపోవడం మనకు తెలిసిందే. అంటే తల్లి గర్భంలో వున్నప్పుడే అభిమన్యుడికి ముందుకు పోవడమే తెలుసు కానీ వెనుతిరగడం తెలియదని పింగళి ఒక్క ముక్కలో చెప్పేశారన్నమాట! ఒకటా రెండా వందలు వందల మాటలు పుట్టించాడు. ఆ మాటలను ఆ పాటలను నెమరేసుకుంటే తప్ప చెప్పుకుంటే తనవితీరదు. అయినా ఆ మాటల మరాఠీ గురించి మాటల్లో చెప్పడానికి మనమెంతవారం? తెలుగు సినీ జగత్తులో సినిమాలు, ఆ సినిమాలకు మాటలు ఉన్నంత కాలం ఆయన చిరంజీవి!

Updated On 6 May 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story