ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి.
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని, మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు.
చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ అలరించనున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్‌లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. భారీ మరియు సోలో విడుదల కావడంతో.. ఇండియా, ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కల్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
