ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) గురించి ఆయన అమ్మగారు అంజనాదేవి(Anjana devi) ఇప్పటి వరకు ప్రజలకు తెలియని బోల్డన్నీ విషయాలు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) గురించి ఆయన అమ్మగారు అంజనాదేవి(Anjana devi) ఇప్పటి వరకు ప్రజలకు తెలియని బోల్డన్నీ విషయాలు చెప్పారు. దీక్షలు తీసుకోవడం పవన్‌కు చిన్నప్పుట్నుంచే అలవాటన్నారు. ఎంతో దీక్షగా అయ్యప్ప మాల వేసుకునేవాడని చెప్పారు. ' అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్న అని ఓసారి అడిగితే నా కోసం అయ్యప్ప మాల(Ayyappa Mala) వేసుకున్నాడు. 40 రజుల తర్వాత దర్శనం చేసుకుని వచ్చాం' అని అంజనాదేవి తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్‌ ఎంతో కష్టపడ్డాడని, ఎంత కష్టపడ్డాడో భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడని, ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని పవన్‌ మాతృమూర్తి ఆనందంతో చెప్పారు. పాలిటిక్స్‌లో(politics) పవన్‌ కష్టపడుతుంటే మాతృహృదయం తల్లడిల్లిపోయిందన్నారు. 'షూటింగులు చేసి వచ్చి సోఫాల మీద పడుకుని నిద్రపోయేవాడు. గదిలోనే పడుకోవాలి అని ఎప్పుడూ లేదు. కష్టపడతాడు. ఎంత కష్టపడినా ఇంత కష్టపడ్డాను అని ఏనాడు చెప్పేవాడు కాదు. బిడ్డ అంత కష్టపడుతున్నాడే అని నాకు మాత్రం బాధగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఏమీ అడిగేవాడు కాదు. చిన్నప్పుడు కామ్ గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. భోజనానికి రమ్మని పిలిచినా వచ్చే వాడు కాదు. అంతా వచ్చిన తర్వాత ఆలస్యంగా వచ్చేవాడు. ఇది కావాలి.. అది కావాలి అని అడిగేవాడు కాదు' అని వివరించారు. 'మేము ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లాము. అప్పటికి కచ్చితంగా మా అబ్బాయికి ఆరో నెల వచ్చింది. ఆరో నెల వచ్చింది కదా ఇక్కడే అన్నప్రాసన చేసేద్దామని నాకు మనసులో అనిపించింది. శ్రీ వెంకట్రావు గారు పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. అంతకంటే అదృష్టం ఏముందని ఆయన అన్నారు. అన్నప్రాసన చేస్తే పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు' అని అంజనాదేవి పవన్‌ బాల్య స్మృతులను నెమరేసుకున్నారు. 'కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికీ ఏదో చేస్తాడు అని అప్పుడే అనుకున్నాను. కత్తిపట్టుకున్నాడు ఏదో చేస్తాడనుకున్నా' అని తెలిపారు.

'పుస్తకాలు చదివే అలవాటు స్కూలులో ఎక్కువ లేదు. 10వ తరగతికి వచ్చేసరికి వాళ్లన్నయ్య క్లాస్మేట్ కి బుక్ లైబ్రరీ ఉంటే అక్కడికి వెళ్లి ఎక్కువ చదువుకునేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చదువుకోవడానికి అనేవాడు అంతే. అలా పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. ఇప్పటికి కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు ఇంట్లో పెట్టుకుని చదువుతున్నాడు. వాళ్ల నాన్న గారు పుస్తకాలు చదివేవారు. వాళ్ల నాన్న అలవాట్లే వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో చూస్తే ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదివే ఇన్ని ఆలోచనలు వచ్చాయేమో అనుకునేదాన్ని' అని అంజనాదేవి చెప్పుకొచ్చారు. పవన్‌ చిన్నప్పుడు వాళ్ల పెద్ద అన్నయ్యే (చిరంజీవి)బాగా దగ్గర తీసేవాడు. చిన్నవాడు కదా వాళ్లన్నయ్య ఎత్తుకుని ఫోటోలు తీసుకోవడం లాంటివి చేసేవాడు. తమ్ముడిని చాలా బాగా చూసుకునేవాడు. రెండో ఆయనకు ప్రేమ ఉన్నా మామూలుగానే ఉండేవాడు. ఎక్కువ చేరదీసింది మాత్రం పెద్ద కొడుకే. ఆయనతోనే ఎక్కువ ఉండేవాడు. ఇప్పటికీ వాళ్లన్నయ్య, వదినతోనే ఉంటాడు. మేము నెల్లూరులో ఉండేవాళ్లం. మాకు ఎక్కువగా ట్రాన్స్ ఫర్లు అయ్యేవి. పిల్లల చదువులు సరిగా ఉండవని కళ్యాణ్ బాబుని తీసుకువెళ్లి చదివిస్తాను అని చెప్పి మద్రాసు తీసుకువెళ్లిపోయాడు' అని పవన్‌ అంటే చిరంజీవికి ఎంతటి ప్రేమో చెప్పారు.

'మా అబ్బాయిపై వాళ్ల నాన్న గారి ప్రభావమే ఎక్కువగా ఉండేది. ఆయన కూడా కల్యాణ్‌ బాబులాగే దానధర్మాలు చేసి ఎదుటివారికి సహాయం చేసే వారు. అదే గుణం పవన్‌కు వచ్చింది. ముగ్గురికీ ఆ గుణం ఉంది. పవన్ కి కొంచం ఎక్కువ. సినిమాల్లో చేసేప్పుడు కూడా అందరికీ సాయం చేసేవాడు' అంటూ పవన్‌ వ్యక్తిత్వం గురించి తెలిపారు. నా బిడ్డ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నానని తల్లి మనసు చాటుకున్నారు అంజనా దేవి


Updated On 3 Oct 2024 10:35 AM GMT
Eha Tv

Eha Tv

Next Story