మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ‌ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఆయ‌న‌కు అభిమానులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెష్ చెబుతున్నారు

మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ‌ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఆయ‌న‌కు అభిమానులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు విషెష్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఒక ప్ర‌క‌ట‌నలో శుభాకాంక్షలు తెలియజేశారు. తన దృష్టిలో అన్నయ్య చిరంజీవి ఆపద్బాంధవుడు అని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడాన్ని తాను చూశానని.. అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు.

పవన్ కల్యాణ్ లేఖ‌లో.. నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు. అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందచేసి, విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవిగారు ఆశీర్వదించారు. ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం, నైతిక మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞుణ్ని. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ని మనసారా కోరుకుంటున్నాను.

ఇదిలివుంటే.. పుట్టినరోజు సంద‌ర్భంగా చిరంజీవి దంప‌తులు తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లారు. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story