కొన్ని పరాజయాలు చెందిన సినిమాలు ఉంటే ఉండవచ్చు కానీ నటుడిగా ఆయన అప్పుడూ ఇప్పుడూ విజేతనే! నటుడిగా అగ్రస్థానంలో వెలుగొందుతున్న కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలిచిన చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలను గెల్చుకుంది.

ఆగస్టు 22.. తెలుగునాట ఈ రోజు కోసం ఎదురుచూసే వారు చాలా మందే ఉంటారు. ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజునే తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకున్న మెగాస్టార్‌ చిరంజీవి(mega star chiranjeevi) పుట్టింది. చిరంజీవి ఇష్టాఇష్టాలపైనా, వ్యక్తిగత భావాలపైనా, ఆయన వ్యక్తిత్వంపైనా భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చేమోగానీ నటుడిగా ఆయన ఎదిగిన తీరు, ఒక్కో మెట్టునే అధిరోహిస్తూ మెగాస్టార్‌ రేంజ్‌కు చేరుకున్న తీరును మాత్రం ప్రతి ఒక్కరు మెచ్చుకునే తీరతారు! సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్‌(NTR) తర్వాత అంతటి ఆదరణ పొందిన నటుడెవరైనా ఉన్నారంటే అది చిరంజీవి మాత్రమే! పరిశ్రమలో ఆయన స్థాయి వేరు. పల్లవంలా సినీ రంగంలో అడుగుపెట్టి చిరకాలంలోనే శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమయ్యారు చిరంజీవి.

స్వయంకృషితోనే ఎదిగారు. ఆరంభంలో ఆయనకు ఎవరి అండదండలు లేవు. కష్టాన్ని నమ్ముకున్నారు. చిరంజీవి వచ్చిన తర్వాత తెలుగు సినిమా వేగం పుంజుకుంది. యాక్షన్‌లో, ఫైటింగ్‌లో, డాన్స్‌లో ఆయన కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రేక్షకులు ఆయనలోని చురుకుదనానికి అబ్బురపడ్డారు. డాన్స్‌లకు జేజేలు పలికారు. యాక్షన్‌కు చప్పట్లు కొట్టారు. ఇప్పుడున్న హీరోలందరికీ చిరంజీవినే మార్గదర్శకుడు. చిరంజీనిని తెరమీద చూసి ఆయనంతటి నటుడవ్వాలని కలలు కన్నవారు ఎందరో! చిరంజీవి ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో నటించారు. అన్ని సినిమాలు విజయవంతం కాలేదు. కానీ చిరంజీవి మాత్రం విజేతనే! ఒకప్పుడు ఆయన కవర్‌పేజీతో ఏదైనా మాగజైన్‌ వస్తే దానికి రెట్టింపు సేల్స్‌ ఉండేవి.

చిరంజీవిక సంబంధించిన వ్యాసం వచ్చినా అంతే! చిరంజీవికి రికార్డులు క్రియేట్ చేయడం వచ్చు. వాటిని తనే బ్రేక్‌ చేయడమూ వచ్చు. మాస్‌ హీరోగా చిరంజీవిపై ముద్రపడితే పడవచ్చు కానీ, ఆయనకు క్లాస్‌ అభిమానులు కూడా లెక్కకు మించి ఉన్నారు. అందుకే ఆయన కోట్లాది మందికి ఆరాధ్య నటుడు కాగలిగారు. ఆయన కెమెరా ముందు నిలబడిన మొదటి సినిమా పునాదిరాళ్లు. కానీ మొదట విడుదలయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు. క్రాంతి కుమార్‌ దీనికి నిర్మాత. వాసు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు కానీ చిరంజీవిని చూసినవారు మాత్రం ఎవరీ కుర్రాడు? మేకప్‌ లేకపోయినా బాగున్నాడే అని అనుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి కళ్లలో ఉన్న పవర్‌ను చాలా మంది అప్పుడే గమనించారు.

తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మన వూరి పాండవులులో చిరంజీవికి చిన్న పాత్ర దొరికింది. పాత్ర చిన్నదే అయినా సినిమా చూసి బయటకు వచ్చిన వారికి చిరంజీవినే గుర్తుకొచ్చారు. మనవూరి పాండవులు చిరంజీవికి మొదటి హిట్‌ సినిమా! 1979లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు చిరంజీవి. తాయరమ్మ బంగారయ్య, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, కొత్త అల్లుడు, ఐ లవ్‌ యూ, ఇది కథకాదు, శ్రీరామబంటు, కోతలరాయుడు వంటి సినిమాల్లో నటించాడు. సోలో హీరోగా కోతలరాయుడు చిరంజీవికి మొదటి శతదినోత్సవ చిత్రం. పున్నమినాగు చిరంజీవిలోని నటుడిని వెలుగులోకి తెచ్చింది.

మొగుడు కావాలి సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఈ మధ్యకాలంలో హీరో కృష్ణతో కొత్త పేట రౌడి, తోడు దొంగలు వంటి సినిమాల్లో, ఎన్టీఆర్‌తో తిరుగులేని మనిషిలో, శోభన్‌బాబుతో చండీప్రియ, మోసగాడు సినిమాలలో నటించారు. మాస్‌ హీరోగా చిరంజీవికి ఊరికిచ్చిన మాట మొదటి మెట్టు అయితే ఆ తర్వాత చట్టానికి కళ్లులేవుచిత్రంతో పూర్తి మాస్‌ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించారు.

ఇది పలు కేంద్రాలలో శతదినోవ్సవాన్ని జరుపుకుంది. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్‌ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో శుభలేఖ అనే సినిమాను నటించారు చిరంజీవి. ఈ రెండు సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్‌ చేసుకున్నారాయన! శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అంటే 1983లో ఇండస్ట్రీలో ఓ సంచలనం మొదలయ్యింది. అప్పుడే ఎన్టీఆర్‌ సినిమాల నుంచి నిష్ర్కమించి రాజకీయాల్లోకి వచ్చారు. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి స్టార్‌ అయ్యారు.

అది కూడా ఖైదీ సినిమాతో!కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయ్యారు. కమర్షియల్‌ సినిమాలకు సరికొత్త అర్థాన్ని చెప్పిందా సినిమా. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్‌ శాంతి థియేటర్లో వంద రోజులకు పైగా ఆడింది. ఓవర్‌నైట్‌ చిరంజీవి స్టారయ్యారు. చిరంజీవి కాల్షీట్ల కోసం నిర్మాతలు పడిగాపులు కాసే రోజులొచ్చాయి. ఇక తర్వాతందా చరిత్రనే! చిరంజీవి ఖాతాలో శతదినోత్సవాలు, సిల్వర్‌జూబ్లీలు, గోల్డెన్‌ జూబ్లీలు చాలా వచ్చి చేరాయి. సినిమాకు కోటి రూపాయల పారితోషికం తీసుకునే మొట్టమొదటి నటుడయ్యారు చిరంజీవి.

కొన్ని పరాజయాలు చెందిన సినిమాలు ఉంటే ఉండవచ్చు కానీ నటుడిగా ఆయన అప్పుడూ ఇప్పుడూ విజేతనే! నటుడిగా అగ్రస్థానంలో వెలుగొందుతున్న కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. తిరుపతి నుంచి గెలిచిన చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలను గెల్చుకుంది.
2011 ఆగష్టులో కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది.

ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన చిరంజీవి తర్వాత తన అభిమానుల కోసం 2017లో మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకున్నారు. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ముందున్న ఇమేజ్‌ ఉండదని చాలా మంది అన్నారు. ఖైదీ నంబర్‌ 150తో వారికి తగిన సమాధానం చెప్పారు చిరంజీవి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అప్పటి వరకు ఉన్న నాన్‌ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజ‌కీయాల్లో చిరంజీవి ఓడిపోవ‌చ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే! తెలుగు సినిమాలో చిరంజీవి స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. చిరంజీవి ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని సూపర్‌హిట్‌ సినిమాలను అందించాలని ఈహా కోరుకుంటోంది. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.

Updated On 22 Aug 2023 10:10 AM GMT
Ehatv

Ehatv

Next Story