సినీ నటి సాయిపల్లవి(Sai pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సినీ నటి సాయిపల్లవి(Sai pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళ భాషల్లో కూడా ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులున్నారు. చేసింది 15 సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్ ఆమెకు ఉంది. ఇప్పుడు సాయిపల్లవి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా(Socila media) అయ్యారు. అందుకు కారణం సాయిపల్లవిని బాయ్‌కాట్(Boycott) చేయాలని ఒకటే రచ్చ జరుగుతుండటం. ఈ మధ్య అయినదానికి కాని దానికి బాయ్‌కాట్ అంటూ హ్యాష్‌ట్యాగ్ తగిలిస్తూ ట్రోల్(Troll) చేయడం పరిపాటిగా మారింది. సాయి పల్లవిని ఎందుకు బాయ్‌కాట్ చేయాలి? అసలు ఆమెను ఎలా బాయ్‌కాట్ చేస్తారు? 'భారత సైన్యంపై(Indian army) సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై ఆమె తప్పకుండా క్షమాపణలు(apology) చెప్పి తీరాల్సిందే' అని తన్మయ్ కులకర్ణి(Thanmay kulkarni) అనే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేస్తున్నాడు. అసలు సాయిపల్లవి ఏం చెప్పిందో సదరు నెటిజన్‌కు అర్థం అయ్యిందో లేదో. ఈ మాటే గాయని చిన్మయి శ్రీపాద(chinamayi sripada) కూడా ఎక్స్ వేదికగా చెప్పారు. సాయిపల్లవి ఏం చెప్పిందో చాలా మందికి అర్థమైందని తాను అనుకోవడం లేదని ఆమె అన్నారు. అప్పుడెప్పుడో, విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో సాయిపల్లవి మాట్లాడుతూ 'పాకిస్తానీలకు భారత సైన్యం టెర్రరిస్టుల్లాగా, భారతీయులకు పాక్ సైన్యం టెర్రరిస్టుల్లాగా కనిపిస్తుంది' అని చెప్పారు. ఆ ముక్కను పట్టుకుని ఇప్పుడు బాయ్‌కాట్‌కు పిలుపునిస్తున్నారు.
శివ కార్తీకేయన్- సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ నెల 31వ తేదీన విడుదల అవుతున్నది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా సాయి పల్లవిపై ట్రోలింగ్ జరుగుతోంది. బాయ్‌కాట్ సాయిపల్లవి అనే హ్యాష్‌ట్యాగ్‌ను కొందరు నెటిజన్లు ‘ఎక్స్’లో ట్రెండ్ చేస్తున్నారు. సాయి పల్లవి మాటలు చూస్తుంటే ఆమె జకీర్ నాయక్ మాటలకు ప్రభావితమైనట్లుగా అర్థమవుతోంది. ఆమె నటించిన సినిమాలు చూడొద్దంటూ అంటూ ఓ నెటిజన్ అంటున్నాడు. అదే ఇంటర్వ్యూలో సాయిపల్లవి మరో మాట అన్నారు.' కశ్మీరీ పండిట్లపై జరిగిన హింసకు, కరోనా సమయంలో వాహనంలో ఆవును తీసుకెళ్తున్న ముస్లిం డ్రైవర్‌పై జరిగిన హింసకు తేడా ఏముంది” అని వ్యాఖ్యానించారు. అప్పుడు ఈ వ్యాఖ్యలపై కూడా కొందరు రుసరుసలాడారు. ఇప్పుడు కూడా మండిపడుతున్నారు. 'హిందుత్వానికి, భారత సైన్యానికి సాయి పల్లవి వ్యతిరేకి. ఆమె నటించిన సినిమాను బహిష్కరించేందుకు ప్రయత్నిస్తాం” అని హిందు ఐటీ సెల్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ వేసింది. ఆవుల స్మగ్లింగ్, కశ్మీరీ పండిట్లపై జరిగిన అఘాయిత్యం ఒక్కటే అంటున్న ఈ హీరోయిన్ బాలీవుడ్‌లో ‘సీత’ పాత్రలో నటిస్తోంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. బాయ్‌కాట్ సాయిపల్లవి అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నవారు ఆమె మొత్తం ఇంటర్వ్యూను చూసి ఉంటారా? అన్న డౌట్ వస్తున్నది. 30 సెకన్లు లేదా ఒక నిమిషం నిడివి ఉన్న వీడియో చూసి నిర్దిష్టమైన అభిప్రాయానికి రావొద్దు. ఆ మాటలకు సంబంధించిన పూర్తి వీడియో చూసిన తరువాతే ఓ అభిప్రాయానికి రావాలి అన్నది చాలా మంది అభిప్రాయం. మణిరత్నం వంటి గొప్ప డైరెక్టరే తాను సాయిపల్లవి అభిమానినని, ఎప్పటికైనా ఆమెతో వర్క్ చేయాలని ఉందని చెప్పారు. అంత గొప్ప డైరెక్టరే కితాబు ఇచ్చిన తర్వాత ఇలాంటి పనికిమాలిన బాయ్‌కాట్ ట్యాగ్స్ ఆమె కెరీర్‌ను కొంచెం కూడా చెడగొట్టలేవు. ఆమె ఇమేజ్‌కు ఎలాంటి నష్టమూ తేలేదు. పైగా వెయ్యి మందిలో ఒకరిద్దరు సాయిపల్లవి సినిమా చూడకపోయినంత మాత్రాన కలిగే నష్టం కూడా లేదు.