✕
Natural Star Nani : మూడు సినిమాల తర్వాత మళ్ళీ మరో మాస్ సినిమాతో వస్తా!
By EhatvPublished on 4 April 2023 2:28 AM GMT
దసరా సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో వీర విహారం చేస్తోంది. వంద కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు తీస్తోంది. నాని చిత్రాలన్నిటిలోనూ దసరా ఓపెనింగ్స్ కలెక్షన్లే ఎక్కువ.

x
Natural Star Nani :
-
- దసరా సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో వీర విహారం చేస్తోంది. వంద కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు తీస్తోంది. నాని చిత్రాలన్నిటిలోనూ దసరా ఓపెనింగ్స్ కలెక్షన్లే ఎక్కువ. ఇన్ని కలెక్షన్లను రాబట్టడంతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. ఈ సందర్భంగా నాని తెలుగు మీడియాతో కొంత సేపు ముచ్చటించారు. నాని నటించిన చిత్రాల్లాగే నాని సమాధానాలు, సంజాయిషీలు కూడా చాలా విభిన్నంగా ఉండటం విశేషంగా చెప్పాలి.
-
- క్లైమాక్సులో బాగా ఎంజాయ్ చేశాను. అదీ బోలెడంత కష్టంతోనే :- సినిమా మొత్తం భారీ సన్నివేశాలు, చాలా ఎమోషనల్‌గా నడిచే దసరా చిత్రంలో ఏ సన్నివేశాలు మీరు బాగా ఎంజాయ్ చేశారన్న ప్రశ్నకు సమాధానంగా నాని మాట్లాడుతూ ఏ సీను ఎంజాయ్ చెయ్యలేదు అని ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం క్లైమాక్సు భాగంలో మాత్రం తాను ప్రతీక్షణం సంతృప్తిగా ఫీలయ్యానని చెప్పారు. అయితే దసరా చిత్రీకరణ సమయంలో అంతా కష్టాన్నే అనుభవించానని, మట్టి, దుమ్ము, బురదలోనే మొత్తం షూటింగ్ జరిగిన కారణంగా ముక్కులోకి ఆ ధూళి, మొఖం నిండా మట్టి....ఇలా ప్రతీ సీనులో నటించేటప్పుడు ఎక్కువగా కష్టాన్నే అనుభవించానని, దాదాపు ఏడాదిన్నర పాటు ఇదే వాతావరణంలో గడపవలసి వచ్చిందని, చివరకే సినిమా విజయవంతమైన తర్వాత కష్టం మొత్తాన్ని మరచిపోయానని నాని చెప్పారు. కానీ, దసరా చిత్రం ఏదో విజయవంతమైపోయింది కదా అని తాను సంతృప్తి పడిపోనని, తదుపరి చిత్రాలపైనే తన దృష్టి అంతా పెట్టి, మళ్ళీ కష్టపడడానికే సిద్ధపడుతున్నానన్నారు. తానొక్కడినే కాదు, మొత్తం యూనిట్ ఈ చిత్రం విజయాన్ని ఒక బేడ్జ్గా చేసుకున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు నాని.
-
- రిలీజ్‌కు ముందే హిట్ ఫీలింగ్ వచ్చింది:- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి చెబుతూ ఇదే గదిలో(మీడియా ప్రెస్ మీట్ జరిగిన) శ్రీకాంత్ చెప్పిన దసరా కథ విన్నానని, మొత్తం కథంతా విని చాలా ఇంప్రెస్ అయిపోయి రూం బైటకు వచ్చి నా మేనేజర్ వెంకట్‌కి వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పానని నాని స్పష్టం చేశారు. “చాలా గొప్పగా చెప్పాడు. ఆ సౌండే కొత్తగా అనిపించింది. మా వెంకట్ వెంటనే చెప్పాను శ్రీకాంత్‌కి పెద్ద టెక్నీషియన్ప్ని ఇద్దాం అని. ఎక్కడా కొత్త దర్శకుడు అన్న ఫీలే రాకూడదన్నది నా ఉద్దేశ్యం. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని ముందే చెప్పాను. రిలీజ్‌కి ముందే ఇది పెద్ద హిట్ అవుతుందన్న ఫీలింగ్ వచ్చింది.” అని నాని చెప్పారు.
-
- నేనేం అమితాబ్ బచ్చన్ కాదు కదా:- దసరా చిత్రం మిగతా భాషలలో విడుదల చేసే విషయంలో తన ఆలోచనలను నాని విప్పి చెప్పారు.“ ఫ్రెండ్ షిప్, లవ్, సెంటిమెంట్ అన్ని చోట్లా కామన్‌గా ఉండే ఎలిమెంట్స్. అయితే మన కల్చర్కుండే ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్. మనం దసరా అంటాం, నార్త్‌లో దష్హరా అంటారు. ఇప్పుడు వాళ్ళకి మన చిత్రం ద్వారా మన దసరా అంటాం అని తెలుస్తుంది కదా. ఇదే నా అభిప్రాయం. నేను పూర్తిగా హైదరాబాద్ మనిషినే అయినా ఇక్కడ అంటే తెలంగాణ ప్రాంతంలోని ఎన్నో విశేషాలను దసరా చిత్రం సందర్భంగా తెలుసుకోగలిగాను. బతుకమ్మ ఎందుకు, ఎలా అనే విధానాలు, వివరాలు నాకర్ధమయ్యేందుకు పెద్ద అవకాశం దొరికింది. ఇటువంటి ప్రత్యేకతలు ఇతర భాషలవారు కూడా తెల్సుకుంటారు కదా. ఆ విధంగా దసరా విజయం నాకెంతో గొప్ప ఫీలింగ్‌నిచ్చింది. అలాగని ఇంక దసరా చిత్రాన్నే పొద్దస్తమానం పట్టుకు కూర్చునే మనస్తత్వం కాదు నాది. వెంటనే దులిపేసుకుంటాను. నేను చేస్తున్న తర్వాతి చిత్రంలో ఆరేళ్ళ పాపకి ఫాదర్‌గా నటిస్తున్నాను. ఆ చిత్రం మీదనే కంప్లీట్‌గా వర్క్ చేస్తున్నా’’ అని చెప్పారు నాని. తెలుగులో ఆడుతున్నంత బాగా హిందీలో ఆడుతున్నట్టు లేదు అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకి నాని సమాధానమిస్తూ నేనేమైనా అమితాబ్ బచ్చన్నా హిందీలో కూడా కుమ్మెయ్యడానికి అని చమత్కరించారు.
-
- సంతోష్ నారాయణ మథ్యలో పేచీ పెట్టాడు:- దసరా వర్క్ జరుగుతున్న్ టైంలో దొర్లిన ఓ సంఘటన గురించి కూడా నాని చాలా అసక్తికరంగా చెప్పారు. దసరా చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన సంతోష్ నారాయణకి దసరా చిత్రంలో సూరి పాత్ర హత్యకు గురైన తర్వాత, వెన్నెల పాత్రను ధరణి పాత్ర హఠాత్తుగా తాళి కట్టడం పట్ల సంతోష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు నాని వివరించారు. సినిమా ద్వారా ఏం నీతిని మనం చెబుతున్నాం నాకిష్టం లేదు, రీరికార్డింగ్ చెయ్యనని మొరాయించారని నాని చెప్పారు. తర్వాత సీనులో ధరణి పాత్ర వెన్నెలతో మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితుడిగా వెన్నెలకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోయానని, ఆవేశం ఆపుకోలేక తాళి కట్టానని ధరణి పాత్ర చెప్పిన మాటలు విని అప్పుడు సంతోష్ సంతోషించి, అందులో ఉన్న ఔన్నత్యాన్ని మెచ్చుకుంటూ రీరికార్డింగ్ని కొనసాగించారని నాని ఆ సంఘటనని నెమరువేసుకున్నారు. అలాగే కీర్తి సురేష్‌కి కథ చెప్పమని దర్శకుడు శ్రీకాంత్‌ని పంపినప్పుడు ఆమె కథ విని తనకి నచ్చలేదు, చెయ్యనని చెబితే బావుణ్ణని శ్రీకాంత్ ఫీలయ్యాడని కూడ నాని చెప్పారు. ‘’ శ్రీకాంత్‌కి ఏ కోశాన కీర్తి సురేష్‌ని హీరోయిన్గా పెట్టడం ఇష్టం లేదు. కథ విని నాకు నచ్చలేదని చెబితే చాలు అనుకున్నాడు. కీర్తి కథ బావుంది అని చెప్పగానే శ్రీకాంత్‌కి షాక్. మళ్ళా కూడా లావు అవమంటే లావు కాలేదు అని కీర్తి మీద కంప్లైంట్ చెబుతుండేవాడు శ్రీకాంత్. ఇప్పుడు సినిమా రిలీజై ఇంత విజయం సాధించాక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్‌ని తప్పితే మరెవ్వరినీ ఊహించుకోలేకపోతున్నానని అంటున్నాడు.” అని నాని చెప్పడం చాలా అసక్తిగా అనిపించింది.
-
- ఆ సంతృప్తి చాలు నాకు:- హీరోగా తెలుగుతెరకు నాని పరిచయమై ఈ సంవత్సరంతో పదిహేనేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా పదిమంది కొత్త దర్శకులకు అవకాశం కల్పించిన ప్రయాణాన్ని పాత్రికేయులు గుర్తు చేయగా తానేమీ పనిగట్టుకుని వారిక అవకాశం కల్పించాలని పూనుకోలేదని, వాళ్ళు చెప్పిన కథలను ఇప్పుడు దసరాలాగే వదులుకోలేకపోయానని నాని స్పష్టం చేశారు. ‘’ మొదటనుంచి కథలకే నేను ప్రాధాన్యతనిచ్చాను. ఎన్నో కథలు వింటాం. కానీ అన్నీ మనసును హత్తుకోలేవు. లేదా అవి ఎంత బావున్నానాకు సూటు కాకపోవడం చేత చెయ్యలేకపోయాను. ఇప్పుడీ పదిమంది దర్శకులు కూడా వాళ్ళ వాళ్ళ కథలతో నన్ను ఆరెస్ట్ చేశారు. అందుకే ఆ సినమాలు వాళ్ళు కొత్తవాళ్ళయినా సరే చేశాను. ఆ ప్రత్యేకతను ఫాలో అవుతూ తప్పోఒప్పో చేసుకుంటూ వెళ్ళాను. ఈ రోజున నేను చేసిని చిత్రాలకు ఓవర్సీస్ మంచి ఫాలోయింగ్ ఉండటానికి అదే కారణం. ఈ సినిమలన్నీ పక్కన బెడితే నేను ఆ అనే సినిమాని నిర్మించాను. నాని తీసిన సినిమా ఇది, తప్పక బావుంటుందని అందరూ సినిమాని ఎంజాయ్ చేశారు. అది చాలు కదా’’ అని నాని పాజిటివ్‌గా ఫీలవుతూ చెప్పారు.
-
- కొడుకు జున్ను బాధ:- తనకొడుకు జున్నూ తన గెటప్‌ని, గెడ్డాలు, పెద్ద జుత్తూ అన్నిటినీ చూసి చాలా విచిత్రంగా ఫీలయ్యేవాడని, సినిమాకి వచ్చి కూడా అందరూ పేపర్లు ధియేటర్లో ఎగరేస్తుంటే పేపర్లు పాడైపోతున్నాయని తెగ బాధపడిపోయాడని, సినిమా చూడనివ్వరా బాబు అని తను బ్రతిమాలుకోవలసివచ్చిందని నాని తెలియజేశారు. తర్వాత సినిమా చూశాక తానెందుకు గెడ్డాలు, జత్తూ పెంచుకున్నానో అర్ధం చేసుకున్నాడని నాని చెప్పారు. విభిన్నమైన కథలతో తాను చేసే ప్రయోగాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, కొత్త దర్శకుడా సీనియరా అనే పాయంట్కి ప్రాముఖ్యతనివ్వనని, ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడంలోనే తన దృష్టి ఉంటుందని నాని చెబుతూ మళ్ళీ మరో మూడు సినిమాల తర్వాత మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని నాని క్లియర్ చేశారు. దసరా చిత్రం సాధించిన సంచలన విజయం తర్వాత బిఫోర్ దసరా, ఆఫ్టర్ దసరా అంటారని పాత్రికేయులు అంటుంటే ప్రతీ చిత్రానికి ఇలా అంటుంటే ఎంతో బావుంటుందని నాని సమావేశాన్ని హేపీ మూడ్‌లో ముగించారు... " Written By : Nagendra Kumar "

Ehatv
Next Story