ఆరో దశకం ఆరంభం. పిల్ల తెమ్మరగా సాగిపోతున్న హిందీ సినీ సంగీతంలోకి పాతికేళ్లు కూడా దాటని ఓ యువకుడు ప్రవేశించాడు. వస్తూనే అలజడి సృష్టించాడు.
ఆరో దశకం ఆరంభం. పిల్ల తెమ్మరగా సాగిపోతున్న హిందీ సినీ సంగీతంలోకి పాతికేళ్లు కూడా దాటని ఓ యువకుడు ప్రవేశించాడు. వస్తూనే అలజడి సృష్టించాడు. సంప్రదాయపు సంకెళ్లను తెంచాడు. పాటను పరుగులు పెట్టించాడు. వెస్ర్టన్ మ్యూజిక్‌కు సంప్రదాయ సంగీతపు మధురిమలు జోడించాడు. ఆ కొత్తదనానికి కుర్రకారు మంత్రముగ్ధులయ్యింది. అతను స్వరపరిచిన పాటలకు ఊగిపోయింది. మత్తుగా గమ్మత్తుగా వున్న సంగీతానికి పడి చచ్చిపోయింది. ఆ స్వరకర్త ఎవరో కాదు, ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా మర్చిపోవడం సాధ్యపడని రాహుల్‌దేవ్ బర్మన్(Rahul Dev Burman). అభిమానులంతా ప్రేమగా పంచమ్‌దాగా పిలుచుకునే ఆ సంగీత దర్శకుడి జయంతి ఇవాళ.
బాలీవుడ్ పాటలపై పంచమ్‌దా గాఢమైన ముద్ర వేశారు. దాన్ని అనుసరించాలని, అనుకరించాలని ఎంతో మంది ప్రయత్నించారు కాని సక్సెస్ కాలేకపోయారు. ఆర్డీ స్టయిల్‌ను పట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఎన్నెన్నో కొత్త వాయిద్యాలను, ధ్వనులను, నడకల్లో విరుపులనూ ప్రవేశపెట్టాడు ఆర్డీ. పాతవాటితో మొహంమొత్తిన సినీ సంగీతాభిమానులకు అవన్నీ గొప్పగా అనిపించాయి.. ఆనందాన్ని ఇచ్చాయి.. ఇవే అనతి కాలంలోనే ఆయన్ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ను చేశాయి. సచిన్‌దేవ్ బర్మన్ కొడుకు కావడం వల్లే సంగీతం డిఫాల్ట్‌గా వచ్చేసింది... ఎంతగా అంటే తొమ్మిదేళ్ల వయసులోనే పాటను కంపోజ్ చేసేటంతగా. ప్యాసా సినిమాలో బాగా పాపులరైన సర్ జో తేరా చక్రాయె పాటను పిల్లకుంకగా ఉన్నప్పుడు ఆర్డీ ట్యూన్ చేసిందే! బాగుంది కదా అనేసి సచిన్‌దేవ్ ఆ సౌండ్‌ట్రాక్‌ను యాజిటీస్‌గా వాడేశారు. అదలా ఉంచితే, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర శాస్త్రీయ సంగీతాన్నినేర్చుకున్న రాహుల్ మౌత్ ఆర్గాన్ వాయించడంలో ఘటికుడు.. తండ్రి సంగీతాన్ని అందించిన కొన్ని సినిమాలకు వాయించాడు కూడా. రాహుల్‌లో బోలెడంత టాలెంట్ ఉంది. కానీ ఏం లాభం? అవకాశాలు వస్తేగా..! గురుదత్ తన రాజ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు కానీ అది సగంలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మెహమూద్ తన చోటే నవాబ్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులేమీ రాలేదు. కొంత కాలం తండ్రి దగ్గరే అసిస్టెంట్‌గా కొనసాగాడు. మళ్లీ మెహమూదే భూత్‌బంగ్లా సినిమాతో రెండో అవకాశం కల్పించాడు. అందులోని జాగో సోనేవాలో పాట పెద్ద హిట్టయింది.. ఆర్డీ అంటే ఎవరూ అని ఆరా తీయించింది. తీస్రీమంజిల్ సినిమాతో ఆర్‌డి బాలీవుడ్‌లో కాంక్రీట్ వేసుకోగలిగాడు..
చిన్నప్పుడు రాహుల్ ఏడుపు అచ్చంగా పంచమ స్వరంలా వుండేదట! అలాగే వినిపించేదట! అందుకే ఆయన్ను పంచమ్‌దా అనేది.. నిజానికి ఈ పేరే ఎక్కువ పాపులరైంది కూడా. మీరు గమనించారో లేదో కానీ ఆర్‌డి పాటల్లో సౌండ్ కంటే సోలే ఎక్కువగా వుంటుంది... అది ఫాస్ట్ బీటైనా, క్లాసికల్ సాంగైనా, ఫోక్ అయినా వినసొంపుగా వుండేది అందుకే ఎప్పుడైనా మీరు పంచమ్‌దా పాటను హమ్ చేసుకుంటూ వెళ్లండి. ఆటోమాటిక్‌గా పాట మొత్తం మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. జ్ఞాపకాల మేళాను వెంటేసుకొస్తుంది..
సచిన్‌దేవ్ బర్మన్ కుమారుడే అయినా ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ పెద్దగా లేదు. కుర్రకారుకేం కావాలో, వారు కోరుకుంటున్నదేమిటో ఆర్‌డికి బాగా తెలుసు! యువతకు కావాల్సిందేమిటో అదే అందించాడు.. ఆర్‌డి తొలి సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. ఎవరన్నా కాదన్నా రాజేశ్ ఖన్నా సూపర్‌స్టార్‌డమ్‌ను నిలబెట్టింది కూడా పంచమ్‌దా పాటలే! మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్, ఆశాభోంస్లేలతో ఆర్డీ చేయని ప్రయోగం లేదు. ఆయన ఏ పాటను ఉదహరించినా ఇంకో పాటకు అన్యాయం చేసినట్టు అవుతుంది. పంచమ్‌దాలో ఓ అద్భుతమైన గాయకుడున్నాడు.. ఎలాంటి భావాన్ని అయినా పలికించగల గళమది. తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళో సంగీతమంటే విపరీతమైన అభిమానమో తెలియదు కానీ పంచమ్ దా పాడిన అన్ని పాటలు వినసొంపుగా, చెవులకు ఇంపుగా వుంటాయి. అంతేనా పియాతో అబ్తో ఆజా పాటలో ఆర్డీ పెట్టిన కేకలను పక్కన పెట్టి పాటను ఓసారి వినిచూడండి...అస్సలు బాగోదు.. రీమిక్స్‌లు, దానికి మిక్సింగులు. ఇలా ఈ పాట ఇంకో యాభై ఏళ్ల తర్వాత కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఆంధ్రపత్రిక ఎడిటోరియల్‌ను కూడా అందమైన పాటగా తీర్చదిద్దగలవాడట మన మామ మహదేవన్. ఆర్డీ బర్మన్ కూడా అలాంటివాడే. ఏ హిందీ పేపర్ న్యూస్‌నో మరో పసందైన సెంటెన్స్‌లనో పంచమ్‌దాకు ఇస్తే అద్భుతమైన పాటగా మలచేవాడు.. గుల్జార్ తీసిన ఇజాజత్‌లో మేరా కుచ్ సామాన్ పాట అలాంటిదే! కేవలం పదాలే వుంటాయి. అవే పదాలు లక్షలాది మంది పెదాలపై నర్తించాయి. నటించిన అనురాధ పటేల్‌కు ఫ్యాన్ మెయిల్ పెరిగింది. పాడిన ఆశాకు, రాసిన గుల్జార్‌కు అవార్డులను తెచ్చిపెట్టింది...
దాదాపు రెండు దశాబ్దాల పాటు పంచమ్‌దా మ్యూజిక్ ఫీల్డ్‌ను ఏలాడు.. ఆర్‌డి కోసం బడా బడా నిర్మాణ సంస్థలన్నీ కాచుకుని వుండేవి. స్టార్లు, సూపర్‌స్టార్లు ఎదురుచూసేవారు. షోలే, షాలీమార్, బర్నింగ్ ట్రయిన్ వంటి భారీ సినిమాలే కాదు... చిన్న సినిమాలకు కూడా అదే శ్రద్ధతో సంగీతాన్ని అందించేవాడు. ఆర్డీ పాటలన్నీ హిట్ కావడానికి ఇదే కారణం. ఓ గొప్ప వింతేమిటంటే... ఆర్డీ బర్మన్‌కు ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు కానీ... ఆయన పాటలతో ప్రత్యేకంగా తీసిన డాక్యుమెంటరీలకు నేషనల్ అవార్డులు రావడం. సెమీ క్లాసికల్..సెమీ ఫిలాసఫికల్ టచ్ వున్న సాంగ్స్ అంటే రాహుల్‌కు చాలా ఇష్టం.
రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో చెదిరిపోని ముద్రను వేసిన ఆర్డీకి ఎనిమిదో దశకం మధ్య నుంచి కష్టాలు మొదలయ్యాయి.. అవకాశాలు రావడం తగ్గాయి.. అప్పటికే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీలహరీలు దూసుకుపోసాగారు..పెద్ద నిర్మాతలు మొహం చాటేయసాగారు. రామ్‌లఖన్ చిత్రానికి ఛాన్సిస్తానన్న సుభాష్ ఘాయ్ కూడా హ్యాండిచ్చాడు. పంచమ్‌దాకు ఊహించని పెద్ద షాక్. అదే గుండెపోటుకు దారి తీసింది. చివరి రోజుల్లో ఆర్డీ చాలా కష్టపడ్డాడు.. ఓ పక్క షుగర్ మరో పక్క గుండెజబ్బు అతడిని కుంగదీశాయి. అవకాశాలు లేకపోవడం చికాకును పెంచాయి. దాంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరి దశల్లో సంగీతాన్ని అందించిన 1942 ఎ లవ్ స్టోరీ పాటలను ఎవరైనా మర్చిపోగలరా? ఆయన చనిపోయాక చాలా కాలం తర్వాత కేవలం ఆయన పాటలతోనే దిల్ విల్ ప్యార్ ప్యార్ సినిమా వచ్చింది.. ఆ క్రెడిట్ ఒక్క బర్మన్‌కే దక్కుతుంది. పంచమ్‌దా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే... తెలుగులో చిన్నికృష్ణుడు, అంతం సినిమాలకు సంగీతాన్ని అందించాడు. మరే ఇతర సంగీత దర్శకులకు లేని వైవిధ్యం..నవ్యత పంచమ్‌దాలో వుంది.. ఇప్పటికీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఏదో రకంగా ఆర్డీని తల్చుకుంటూనే వున్నారు.. పంచమ్‌దాపై ఆర్‌డి బర్మన్-ది మ్యాన్-ది మ్యూజిక్ బయోగ్రఫీ అనే పుస్తకం వస్తే ఒక్క నెలలోనే మూడు వేల కాపీలు అమ్ముడయ్యాయట! పుస్తకానికే అంత డిమాండ్ వుంటే పాటల సీడీలకు ఎంతుండాలి? తరాలు మారినా...ఆర్‌డి పాట మాత్రం నిలిచే వుంటుంది. యూత్‌కి ఆయన పాటలే దిక్కు-మొక్కు. ఆర్డీ బర్మన్ ఫరేవర్!ఎన్నేళ్లయినా, ఎన్నాళ్లయినా మర్చిపోవడం సాధ్యపడని సంగీతం ఆయనది!