మిథున్ చక్రవర్తి (73) ని కోల్‌కతాలోని అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ అత్యవసర విభాగానికి ఉదయం 9.40 గంటలకు తీసుకువచ్చారు
బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే! ఆయన శనివారం నాడు కుప్పకూలడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మొదట హార్ట్ స్ట్రోక్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇషెమిక్ బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమార్తె నమిశి చక్రవర్తి వెల్లడించారు. ఐసీయూ నుంచి క్యాబిన్‌కు మార్చారని తెలిపారు. శాస్త్రి అనే సినిమాలో జోతిష్యుడి పాత్రలో ఆయన నటిస్తున్నారు. కోల్‌కతాలో శనివారం షూటింగ్ సందర్భంగా ఆయన అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. మాటలో తడబాటు, చేయిలో కదలిక తగ్గడంతో వెంటనే ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎమ్మారై సహా పలు ఇతర పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చినట్టు నిర్ధారించారు. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడితే ఇషెమిక్ స్ర్టోక్ అంటారు. 87 శాతం స్ట్రోక్ కేసులకు ఇదే కారణం. ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. డిస్కో కింగ్ గా బాలీవుడ్ లో భారీ పాపులారిటీని దక్కించుకున్న మిథున్ చక్రవర్తి.. దక్షిణాదిన కూడా పలు సినిమాలలో నటించారు.
ఆసుపత్రి వైద్యులు చెప్పింది ఇదే:
ప్రస్తుతం మిథున్ చక్రవర్తి పూర్తిగా స్పృహలోనే ఉన్నారు. అపోలో హాస్పిటల్స్ నుండి వచ్చిన అధికారిక ప్రకటనలో కూడా ఇదే చెప్పింది. మిథున్ చక్రవర్తి (73) ని కోల్‌కతాలోని అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ అత్యవసర విభాగానికి ఉదయం 9.40 గంటలకు తీసుకువచ్చారు. మెదడుకు సంబంధించి MRIతో సహా అవసరమైన పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మెదడుకు సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ (స్ట్రోక్) ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఆయన ఆహారాన్ని కూడా తీసుకున్నారని వైద్యులు తెలిపారు.