ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ప్రేమ విషయంపై చిరంజీవికి యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు సంధించారు
డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్‌నెస్ రాదు.. తక్కువ బడ్జెట్‌లో కూడా సినిమా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో దర్శకులు ఆలోచించాలని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శక్తి ప్రతాప్ సింగ్‌ని మన యంగ్ డైరెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకోవాలి.. నేను 'టాప్‌గన్' మూవీ చూసినప్పుడు ఇంత బాగా మనం చేయగలమా? అనిపించింది. ఆ విజువల్స్‌కి ఆశ్చర్యపోయాను. నేడు 'ఆపరేషన్ వాలెంటైన్' రూపంలో మనవాళ్లు కూడా చాలా సులభంగా తెరకెక్కించారంటే ప్రతిభ ఎవడి సొత్తు కాదని చిరంజీవి అన్నారు.
ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ ప్రేమ విషయంపై చిరంజీవికి యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు సంధించారు. వరుణ్ తన ప్రేమ గురించి తమకు లీక్ ఇవ్వలేదని... మీకేమైనా తెలుసా? అని ప్రశ్నించారు. చిరంజీవి మాట్లాడుతూ వరుణ్ తనతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటాడని, వాళ్ల నాన్నకు కూడా చెప్పనివి తనతో పంచుకుంటాడని చిరంజీవి చెప్పారు. తానే ఇన్ స్పిరేషన్ అంటుంటాడని... కానీ, ప్రేమ విషయాన్ని మాత్రం తనతో దాచాడని తెలిపారు. ఇదే తనకు కోపంగా ఉందని అన్నారు. పెదనాన్న అంటే తనకు భయంతో కూడిన గౌరవమని.. తన ప్రేమ విషయాన్ని అందరి కంటే ముందు పెదనాన్నకే చెప్పానని వరుణ్ వివరించాడు.