శంకర్‌రెడ్డి పూర్తి పేరు అల్లారెడ్డి శంకర్‌రెడ్డి (Shankarreddy). ఆయన తెలుగింటి మహబూబ్‌ఖాన్‌. ఇవాళ మనం చూస్తున్న మల్టీ క్రోర్‌ ప్రాజెక్టులకు అయిదో దశకంలోనే అంకురార్పణ చేసిన సాహసి. 1956లో ఆయన చరణదాసి అనే సినిమా తీశారు.

శంకర్‌రెడ్డి పూర్తి పేరు అల్లారెడ్డి శంకర్‌రెడ్డి (Shankarreddy). ఆయన తెలుగింటి మహబూబ్‌ఖాన్‌. ఇవాళ మనం చూస్తున్న మల్టీ క్రోర్‌ ప్రాజెక్టులకు అయిదో దశకంలోనే అంకురార్పణ చేసిన సాహసి. 1956లో ఆయన చరణదాసి అనే సినిమా తీశారు. ఎన్‌.టి.రామారావు(ntr), అక్కినేని నాగేశ్వరరావు(anr), అంజలీదేవి, సావిత్రి(savitri), రేలంగి(relangi) వంటి మహామహులు ఇందులో నటించారు. భారీ ఎత్తున తీసిన ఈ సినిమా విజయవంతమయ్యింది. అప్పటికే హిందీలో రంగుల సినిమా వచ్చింది. మహబూబ్‌ఖాన్‌ మొదటిసారిగా టెక్నికలర్‌లో ఆన్‌(aan) అనే సినిమా తీశారు. ఇది సంచలన విజయం సాధించింది. సినిమా విజయానికి కథతో పాటు సాంకేతిక హంగులు కూడా దోహదం చేస్తాయన్న విషయాన్ని శంకర్‌రెడ్డి తెలుసుకున్నారు. దక్షిణభారతంలో తొలి వర్ణ చిత్రం మోడరన్‌ థియేటర్స్ వారి ఆలీబాబా నలభై దొంగలు. తీసింది టి.ఆర్‌.సుందరం. హీరోహీరోయిన్లు ఎం.జి.రామచంద్రన్‌(mgr), భానుమతి(bhanumathi). తమిళంలో తీసిన ఈ సినిమాను కొద్దిగా తెలుగులో కూడా తీశారు. పారాడబ్బింగ్‌ చేసి విడుదల చేశారు.

తెలుగులో పారా డబ్బింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సినిమా ఇది. 1955లో ఈ సినిమా వచ్చింది. తెలుగులో కూడా సినిమా హిట్టయ్యింది. తెలుగులో తొలిసారిగా రంగుల సినిమాను తానే తీయాలని శంకర్‌రెడ్డి గట్టిగా అనుకున్నారు. అప్పటికి ఈస్ట్‌మన్‌ కంపెనీ ఇండియాకు రాలేదు. గేవార్ట్‌ కంపెనీ అనే సంస్థ ఫిలింను సరఫరా చేసేది. దాన్నే గేవా కలర్‌ అనేవాళ్లు. అలీబాబా 40 దొంగలు సినిమాను గేవా కలర్‌లోనే తీశారు. తెలుగులో భారీ ఎత్తున రంగుల సినిమా తీయాలనుకున్న శంకర్‌రెడ్డికి పౌరాణిక కథను ఎంచుకున్నారు. అలా లవకుశ సినిమా పురుడుపోసుకుంది. లవకుశను భారీ ఎత్తున గేవాకలర్‌లో తీశారు. ఆయనపై కాసుల వర్షం కురిసింది. లవకుశ సినిమాతో డబ్బులు బాగా సంపాదించిన శంకర్‌రెడ్డి ఫక్తు జానపద సినిమాకు శ్రీకారం చుట్టారు. అదే రహస్యం . వేదాంతం రాఘవయ్య దర్శకుడు. ఇది కూడా రంగుల్లో తీశారు. లవకుశ సినిమాకు చక్కటి నిర్ణయాలు తీసుకున్న శంకర్‌రెడ్డి రహస్యం సినిమాకొచ్చేసరికి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. అసలు నాగేశ్వరరావును హీరోగా తీసుకోవడమే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఆ రోజుల్లో జానపద హీరో అంటే ఎన్టీఆరే! రహస్యం సినిమా నాటికి దక్షిణాదిన రంగుల సినిమాలు జోరందుకున్నాయి. తెలుగులో అమరశిల్పి జక్కన, తేనెమనసులు వచ్చాయి.

మద్రాసులో జెమిని కలర్‌లాబ్‌, బెంగళూరులో విక్రమ్‌ కలర్‌లాబ్‌లు వచ్చాయి. రహస్యం సినిమా నాటికే నాగేశ్వరరావు హైదరాబాద్‌(hyderabad)కు వచ్చేశారు. కాబట్టి రహస్యం సినిమా నిర్మాణం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. అమీర్‌పేట (ameerpet)సారథీ స్టూడియోస్‌తో పాటు జహనుమాలో సదరన్‌ మూవీటోన్‌ అనే స్టూడియో ఉండేది. హర్‌నాథ్‌ చివరిసారిగా హీరోగా నటించిన నిజం చెబితే నమ్మరు సినిమాను తీసింది ఈ స్టూడియో యాజమాన్యమే! శంకర్‌రెడ్డి తన రహస్యం సినిమా కోసం సదరన్‌ మూవీటోన్‌ స్టూడియోను లీజ్‌కు తీసుకున్నారు. దానిని లలితా శివజ్యోతి స్టూడియోస్‌ అని పేరు పెట్టారు. ఎఎన్‌ఆర్‌తో పాటు ఎస్వీ రంగారావు(sv rangarao), గుమ్మడి, అంజలీదేవి, బి.సరోజాదేవి, కృష్ణకుమారి, రాజనాల వంటి అగ్రనటులంతా నటించారు. అయినా సినిమా ఘోరంగా దెబ్బతింది. వేదాంతం రాఘవయ్య దర్శకుడు కాబట్టి గిరిజాకళ్యాణం అద్భుతంగా రూపుదిద్దుకుంది. రహస్యం సినిమా హిట్టయి ఉంటే శంకర్‌రెడ్డి మరిన్ని అద్భుతాలు సృష్టించేవారేమో! రహస్యంతో బాగా నష్టపోయిన శంకర్‌రెడ్డి చాలా కాలం పరిశ్రమకు దూరంగా ఉన్నారు. 11 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్బలంతో సతీసావిత్రి అనే సినిమా తీశారు. 1978లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, వాణిశ్రీ, కృష్ణంరాజు (krishnam raju)నటించారు. అప్పటికే పౌరాణికాల మీద ప్రేక్షకులకు ఆసక్తిపోయింది. సతీ సావిత్రి కూడా విజయం సాధించలేకపోయింది. తెలుగు సినిమాకు రంగుల హంగులు తీసుకొచ్చిన ఘనత మాత్రం శంకర్‌రెడ్డికే దక్కుతుంది. అలా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు.

Updated On 28 March 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story