ఆయన పేరు అక్కినేటి లక్ష్మీ వర ప్రసాద్‌. అందరికీ సుపరిచతమైన పేరు ఎల్వీ ప్రసాదు. దశ తిరిగాక లక్కినేని వర ప్రసాదు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీకి నిజంగానే ఆయనో వర ప్రసాదం. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను కొన్నింటిని నెమరేసుకుందాం! ఇప్పుడాయన వుంటే 115 వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేవారు. చలన చిత్ర పరిశ్రమ పండుగ చేసుకునేది. ఆయన లేకపోతేనేం జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. నందమూరి బాలకృష్ణకు ఎల్‌.వి.ప్రసాద్‌-ఆకృతి పురస్కారాన్ని కూడా […]

ఆయన పేరు అక్కినేటి లక్ష్మీ వర ప్రసాద్‌. అందరికీ సుపరిచతమైన పేరు ఎల్వీ ప్రసాదు. దశ తిరిగాక లక్కినేని వర ప్రసాదు. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ర్టీకి నిజంగానే ఆయనో వర ప్రసాదం. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను కొన్నింటిని నెమరేసుకుందాం! ఇప్పుడాయన వుంటే 115 వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేవారు. చలన చిత్ర పరిశ్రమ పండుగ చేసుకునేది. ఆయన లేకపోతేనేం జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. నందమూరి బాలకృష్ణకు ఎల్‌.వి.ప్రసాద్‌-ఆకృతి పురస్కారాన్ని కూడా అందించారు. సరే.. ఇప్పుడు ఎల్వీ ప్రసాద్‌ గురించి తెలుసుకుందాం!

అక్కినేని శ్రీరాములు..బసవమ్మ దంపతులకు ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు అనే చిన్న పల్లెటూరులో రెండో కొడుకుగా జన్మించారు ఎల్వీ ప్రసాద్‌. తెలివైన వాడే కానీ... చదువు మీద అంతగా ఇంట్రస్ట్‌ వుండేది కాదు. ఎప్పుడు చూసినా నాటకాలు.. టూరింగ్‌ టాకీసులు..వీటిపైనే ఆసక్తి వుండేది. గారాల బిడ్డ కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏమీ అనేవారు కాదు. స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లో ప్రసాదు వేషం కట్టి తీరాల్సిందే. లేకపోతే నాటకం రక్తి కట్టేది కాదు. పదిహేడేళ్ల వయసులోనే మేనమామ కుమార్తె సౌందర్య మనోహరమ్మనిచ్చి కట్టబెట్టారు తల్లిదండ్రులు. సంవత్సరాలు తిరక్కముందే ఓ పాప కూడా పుట్టింది. శ్రీరాములు చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి చివరికి దివాళా తీసే పరిస్థితి వచ్చింది. ఇంట్లో కష్టాలు తీర్చాలంటే తానో గొప్ప నటుడవ్వడమే ఉత్తమమైన మార్గమనుకున్నాడు. అంతే.. ఇంట్లో వాళ్లకు చెప్పాపెట్టకుండా జేబులో ఓ వంద రూపాయలేసుకుని బొంబాయ్‌కి పారిపోయాడు. 1930, జనవరి ఒకటిన దాదర్‌ స్టేషన్‌లో దిగాడు. ఎందుకంటే కోహినూర్‌ ఫిల్మ్‌ స్టూడియో అక్కడే వుంది కాబట్టి... ఆ స్టూడియో గురించి విన్నవాడు కాబట్టి..

కలలు కనడం ఈజీనే! కానీ వాటిని సాకారం చేసుకోవడమే కష్టమైన పని. ఇది ప్రసాద్‌కు మాబాగా తెలిసొచ్చింది. కమ్యునికేషనే పెద్ద అవరోధం అయింది. తనకొచ్చే తెలుగుతో ఎంతమందిని ఆకట్టుకోగలడనీ! వచ్చిరాని ఇంగ్లీషులో సినిమాల్లో పనిచేయాలనే కోరికను వెలిబుచ్చినా పట్టించుకునేవారెవరనీ! స్టూడియో చుట్టూ తిరుగుతూ గోడ సందుల్లోంచి గంటల తరబడి ఆ రంగుల ప్రపంచంకేసి చూస్తూ నిలుచునేవాడు. కోహినూర్‌ స్టూడియో ఎదురుగా ఓ టైలర్‌ షాపుండేది. అక్కడికి కొంత మంది సినిమా తారలు వచ్చి వెళుతుండేవారు. వాళ్లను తదేకంగా చూస్తూ కొంతకాలం గడిపేశాడు. ప్రతి రోజు స్టూడియోకు మిస్సు కాకుండా వచ్చి వెళుతున్న ప్రసాద్‌ను చూసి ముచ్చటపడ్డాడా టైలర్‌ షాపు యజమాని. సినిమా పట్ల ప్రసాద్‌కున్న ప్రగాఢమైన కోరికను, చిత్తశుద్ధిని గమనించాడు. ఇదిలావుంటే తనుంటున్న హోటల్‌ గదిలో దొంగ పడి వున్న కాస్త సొమ్మును కూడా ఎత్తుకెళ్లాడు. ఆ దొంగగారు కాస్త మానవత్వం వున్నవాడల్లే వుంది. మొత్తం సొమ్మును ఎత్తుకెళ్లకుండా కొంత వదిలిపెట్టాడు. పైగా ఆ డబ్బుతో రైలు టికెట్‌ కొనుక్కొని ఇంటికి తిరిగెళ్లిపొమ్మని ఓ ఉత్తరం కూడా రాసిపెట్టాడు. దొంగగారి సలహా వింటే కథ మరోలా వుండేది. మనవాడు మహా స్ర్టాంగ్‌ కదా! ఇంటికెందుకు వెళతాడు? లాడ్జీ ఖాళీ చేసి ట్రంకుపెట్టె పట్టుకుని మళ్లీ స్టూడియో ముందుకే వచ్చేశాడు. ప్రసాద్‌ను చూసి టైలర్‌ షాపు ఓనర్‌కు జాలేసింది. సినిమా అవకాశం దొరికేంత వరకు తన దగ్గరే పని చేస్తూ ఇక్కడే తలదాచుకోమన్నాడు. కొన్నాళ్లకు వీనస్‌ ఫిలిం కంపెనీలో ఓ చిన్ని ఉద్యోగం దొరికింది. ఫిలిం కంపెనీలో ఉద్యోగమని సంబరపడ్డాడు కానీ.. వాళ్లు సినిమా తీస్తేగా...పైగా జీతం విషయంలో కూడా మొండిచేయి చూపించిందా కంపెనీ..అప్పుడే ధీరాలాల్‌ అనే పంజాబీ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆయన సాయంతోనే చిన్న చితకా ఉద్యోగాలు చేస్తూ కడుపునింపుకోసాగాడు. ఆ టైమ్‌లోనే ఇండియా పిక్చర్స్‌ సంస్థలో మరో చిన్న ఉద్యోగం దొరికింది. అక్కడ పని చేస్తున్నప్పుడే స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అనే సినిమాలో ఓ చిన్నపాటి వేషమిచ్చి ప్రోత్సహించాడు దర్శకుడు అక్తర్‌ నవాజ్‌. కారణాలేమిటో తెలియవు కానీ.. ఆ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇదిలావుంటే ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీలో పని చేస్తున్న ధీరాలాల్‌ సోదరి మోతీ సాయంతో తొలి భారతీయ టాకీ ఆలం అరాలో ఓ చిన్ని పాత్రను పోసించాడు. ఆ సినిమాల్లో నటించినందుకు ప్రసాద్‌కు దొరికిన పారితోషికం సరిగ్గా ముప్పయ్‌ రూపాయలు.

ఈ సినిమాకు పని చేస్తున్న రోజుల్లోనే హెచ్‌. ఎం. రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ప్రసాద్‌కు మరిన్ని సినిమా అవకాశాలు లభించాయి. హెచ్‌ ఎం రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి తమిళ టాకీ కాళిదాసులోనూ ప్రసాద్‌ నటించాడు. తర్వాత రెడ్డిగారి దర్శకత్వంలోనే వచ్చిన తొలి తెలుగు టాకీలో భక్త ప్రహ్లాదలోనూ చిన్న పాత్ర పోషించాడు ప్రసాద్‌. ఇలా భారతీయ సినిమాలో మొదటి మూడు టాకీల్లో నటించిన ఏకైక వ్యక్తి ప్రసాదే! ఇలా సినిమాల్లో కాస్త స్థిరపడిన తర్వాత ఇంటి మీద గాలి మళ్లింది. ఇంటికొస్తున్నట్టు ఓ టెలిగ్రామ్‌ కొట్టాడు. అప్పటి వరకూ ప్రసాద్‌ చనిపోయి వుంటాడనుకున్న ఇంట్లోవాళ్లు... ప్రసాద్‌ రాకతో తెగ సంబరపడ్డారు. పెద్ద పండుగ చేసుకున్నారు. విషాదమేమింటే..ప్రసాద్‌ బొంబాయిలో వున్నప్పుడే ఆయన చిన్నారి కూతురు చనిపోవడం. సరే కొంత కాలం సొంతవూరిలో గడిపేసిన ప్రసాద్‌.. తన భార్యతో కలిసి మళ్లీ బొంబాయికి చేరుకున్నాడు. అక్కడే ఇద్దరు కుమారులు ఆనంద్‌, రమేష్‌ పుట్టారు. అప్పుడే అలీషా దర్శకత్వంలో వచ్చిన కమర్‌ అల్‌ జమన్‌ సినిమాకు అసిస్టెంట్‌గా చేరాడు ప్రసాద్‌. హాజరుపట్టిలో పేరు రాయడానికి కుదరకపోవడంతో ఆ సినిమాకు పని చేసే క్లర్కు అక్కినేన లక్ష్మీ వరప్రసాద్‌ను కాస్త ఎల్వీ ప్రసాద్‌ను చేశాడు. అప్పట్నుంచి ఆయనకు అదే పేరు స్థిరపడింది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఇంపీరియల్‌ స్టూడియో కొంత మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. ప్రసాద్‌ మళ్లీ నిరుద్యోగయ్యాడు. ఎనిమిదేళ్లపాటు చిన్నచితక పాత్రలువేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. చివరికి విసుగొచ్చి సొంతూరుకెళ్లిపోదామనుకున్నాడు. ఎలాగోఅలాగు డబ్బు పోగేసి సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టేసుకుందామనుకున్నాడు. పాపం ఇది కూడా వర్కవుట్‌ అవ్వలే! నిరాశ నిస్పృహలో వున్న తరుణంలో హెచ్‌ ఎం రెడ్డి నుంచి ఓ టెలిగ్రామ్‌ వచ్చింది. రోహిణి పిక్చర్స్‌ పతాకంపై తీస్తున్న గృహలక్ష్మిలో పనిచేయడం కోసం పంపిన ఆహ్వానమది. వెంటనే ప్రసాద్‌ మద్రాస్‌ రైలెక్కాడు. అదే ప్రసాద్‌ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ, ఘరానా దొంగ వంటి చిత్రాలకు పని చేసినా... మళ్లీ బ్రేక్‌.. ఈసారి రెండో ప్రపంచ యుద్ధం. యుద్ధం కారణంగా ఏర్పడిన మాంద్యంతో సినిమా నిర్మాణాలు చాలా మట్టుకు ఆగిపోయాయి. హెచ్‌ ఎం రెడ్డి కుటుంబ సమేతంగా పూణెకెళ్లిపోయాడు. ప్రసాదేమో సొంతూరికి చేరుకున్నాడు. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ప్రసాద్‌ వేరే ఉద్యోగమేంచేస్తాడు?

తంత్ర సుబ్రహ్మణ్యం తను తీయబోయే కష్ట జీవి సినిమా కోసం ప్రసాద్‌ను పిలిపించుకున్నాడు. ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌ కమ్‌ అసిస్టెండ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను అప్పగించాడు. మూడు రీళ్లయ్యాక సినిమా ఆగిపోయింది. ఈ సమయంలో ప్రసాద్‌ కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పని చేశాడు. పృథ్వి థియేటర్స్‌లో చేరి పృథ్విరాజ్‌ కపూర్‌, రాజ్‌కపూర్‌ వంటివారితో పరిచయం పెంచుకున్నాడు. 1943లో గృహప్రవేశం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసే ఛాన్సు వచ్చింది. కొన్ని కారణాల వల్ల హీరోగా కూడా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కె ఎస్‌ ప్రకాశరావు ద్రోహి వచ్చింది. ఇది దర్శకుడిగా ప్రసాద్‌కు మంచి పేరు తెచ్చింది. పల్నాటి యుద్ధాన్ని సగం తీశాక రామబ్రహ్మం చనిపోతే.. దాన్ని పూర్తి చేసే బాధ్యతను ప్రసాద్‌ తీసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ప్రసాద్‌కు వెనక్కి తిరిగి చూడలేదు. మనదేశంతో జగద్విఖ్యాతి గడించాడు. ఈ సినిమాతోనే ఎన్టీయార్‌ తెరమీదకొచ్చాడు.

తెలుగులో తొలి అభ్యుదయ చిత్రాన్ని తీసిన ఘనత కూడా ఎల్వీ ప్రసాద్‌దే. విజయా ప్రొడక్షన్స్‌ మొదట సినిమా షావుకారులో ప్రసాద్‌ కనబర్చిన దర్శకత్వ ప్రతిభ అద్వితీయం. ఈ సినిమాతోనే ఎన్టీయార్‌ ఫుల్‌ ఫ్లెడ్జ్‌ హీరో అయ్యాడు. ఇందులో నటించిన జానకి ఇంటిపేరు కాస్తా షావుకారు అయింది. 1950లోనే సంసారం వచ్చింది. ఎన్టీయార్‌, ఎఎన్నార్‌లు కలిసి నటించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన మనోహర కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతోనే శివాజీ గణేషన్‌ స్టారయ్యాడు. పెళ్లి చేసి చూడు, అప్పు చేసి పప్పుకూడు, మిస్సమ్మ సినిమాలను ఎవరైనా మర్చిపోగలరా? నిర్మాతగా ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. యోగానంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఇలవేలుపు ఓ ట్రెంట్‌ సెట్టర్‌. అప్పటి వరకు హీరోహీరోయిన్లుగా నటించిన అంజలీ, అక్కినేని తల్లికొడుకుల్లా నటించడం సాహసమే కదూ! కొన్నాళ్ల తర్వాత దీన్నే ప్రసాద్‌ స్వీయ దర్శకత్వంలో హిందీలో తీశాడు. హిందీలో రాజ్‌కపూర్‌, మీనా కుమారి నటించారు. తర్వాత భార్య భర్తలను హమ్‌రాహీగా, సంతానం సినిమాను బేటీబేటాగా, మూగమనసులును మిలన్‌గా, బతుకుతెరువును జీనేకీ రాహ్‌గా తీశారు. అన్నీ ఘన విజయాలే! హిందీలో తీసిన ఖిలోనా ముంబాయిలోని డ్రీమ్‌లాండ్‌ థియేటర్‌లో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. విశేషమేమింటే ఒకప్పుడు ఇదే థియేటర్‌లో ప్రసాద్‌ టికెట్‌ కలెక్టర్‌గా పని చేయడం. తెలుగు సినిమాను హిందీలో నిర్మించేటప్పుడు ప్రసాద్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు. అయితే పెళ్లి చేసి చూడును షాదీకే బాద్‌గా తీస్తున్నప్పుడు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. హిందీలో ఎన్టీయార్‌, జి.వరలక్ష్మి పాత్రలను జితేంద్ర, రాఖీ వేశారు. జోగారావు, సావిత్రి పాత్రలను పెయింటల్‌, నాజ్‌ వేశారు. తెలుగులో కుందూ పాత్రను హిందీలో బాగా తగ్గించేశాడు. ఎస్వీయార్‌ వేసిన దూపాటి వియ్యన్న వేషాన్ని మాత్రంశతృఘ్నసిన్హా కిచ్చాడు. సినిమా అక్కడే సగం దెబ్బతింది. అప్పట్లో దేశమంతా శతృఘ్న హవా నడుస్తోంది. అతనితో వయసు మళ్లిన పాత్ర వేయిస్తే అది సినిమాకు ఆకర్షణ అవుతుందనుకున్నాడు కానీ.. అది కాస్త దారుణంగా బెడిసికొట్టింది. సినిమా పోయింది.

ఎల్వీ ప్రసాద్‌ చివరి సారిగా తెరమీద కనిపించిన సినిమా అమావాస్య చంద్రుడు.
ప్రసాద్‌ స్టూడియోలు... ల్యాబులు, థియేటర్లు, ఐ హాస్పిటల్స్‌ ఎన్నో నిర్మించారు. సామాజిక సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుండేవాడు. జీవితకాలంలో ఎన్నో పదవులను అలంకరించారు. అవార్డులకైతే లెక్కేలేదు. ఎనభైరెండులో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కె అవార్డు వరించింది. రెండువేల ఆరులో ప్రసాద్‌ జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఓ స్టాంపును కూడా విడుదల చేసింది. భారతీయ చలన చిత్ర సీమకు ఎనలేని సేవలందించిన ఎల్వీ ప్రసాద్‌ తెర స్మరణీయుడే కాదు.. చిర స్మరణీయుడు కూడా.

Updated On 7 Feb 2023 8:29 AM GMT
Ehatv

Ehatv

Next Story