మన దేశంలో మొట్టమొదటి లవకుశ సినిమా తీసింది బెంగాల్ భాషలో. కలకత్తకు చెందిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ ఈ సినిమాను నిర్మించింది. దేవకీబోస్ దీనికి దర్శకుడు. రాముడిగా పృథ్వీరాజ్ కపూర్ నటించారు. ఒక రంగస్థల నాటకం ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ నాటకం తెలుగులో కూడా ప్రసిద్ధి పొందింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని గమనించిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ లవకుశను తెలుగులో కూడా తీయాలని సంకల్పించింది. దర్శకుడు సి.పుల్లయ్యను సంప్రదించింది. పుల్లయ్య అంగీకారం తెలిపారు. రచనాభారాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతానికి అప్పగించారు. శ్రీరామచంద్రుడిని 'పుంసాల మోహన రూపాయ' అని అంటారు. అంటే పురుషులను సైతం మోహింపచేసే మోహనరూపం అని అర్థం. ఈ శ్లోకాన్ని అప్పుడెప్పుడో చదివిన పుల్లయ్య రాముడిలో కాస్త ఆడతనం ఉంటుందని గ్రహించారు. అందుకే రాముడి పాత్రను రంగస్థలం మీద స్త్రీ పాత్రలు ధరించేవారికి ఇద్దామనుకున్నారు. ఆ రోజుల్లో రాధాకృష్ణ నాటకంలో రాధ పాత్రను పారుపల్లి సుబ్బారావు అనే నటుడు వేసేవారు. పారుపల్లి సుబ్బారావు ఫోటోలు తీయించిన పుల్లయ్య ఆయన పోలికలు ఉన్న నటులను లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల పాత్రలకు ఎంపిక చేశారు. ఆ సినిమా చూసిన వారికి ఈ నలుగురూ నిజంగానే అన్నదమ్ములని అనుకున్నారు. ఒకే తల్లి కడుపున పుట్టినవారేమోనని అనిపించేట్టుగా పుల్లయ్య తీర్చిదిద్దారు. 1934లో ఈ సినిమా విడుదలయ్యింది. తెలుగునాట ఇది బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది.
ఇది జరిగి 24 ఏళ్ల తర్వాత లలితా శివజ్యోతి ఫిలింస్ అధినేత శంకర్‌రెడ్డికి లవకుశను మరోసారి తెలుగువారికి అందించాలనుకున్నారు. తొలి లవకుశ దర్శకుడు సి.పుల్లయ్యకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. సదాశివబ్రహ్మాన్ని రచయితగా తీసుకున్నారు పుల్లయ్య. ఘంటసాలను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తయిన తర్వాత పాటలకు బాణీలు కట్టే పని మొదలయ్యింది. సముద్రాల రాఘవాచార్య, సదాశివబ్రహ్మం పాటలు రాశారు. రామన్న రాముడు కోదండరాముడు, ఏ నిమిషానికి ఏమి జరుగునో, అశ్వమేథ యాగానికి జయము జయము పాటలను కొసరాజు రాఘవయ్య రాశారు. జానపదాలే కాదు పౌరాణికాలు కూడా కొసరాజు అద్భుతంగా రాయగలరని రుజువు చేసిన సినిమా ఇది! కంకంటి పాపరాజు, దువ్వూరి రామిరెడ్డి పద్యాలను కూడా ఇందులో వాడుకున్నారు. పాటలు, పద్యాలకు ఘంటసాల మాస్టారు అద్భుతంగా బాణీలు కట్టారు. సమయం దొరికినప్పుడల్లా చిత్తూరు నాగయ్య ఆఫీసుకు వచ్చి పాటలు వినేవారు. సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని అప్పుడే నాగయ్య జోస్యం చెప్పారు. నాగయ్య మాటలు శంకరరెడ్డికి జీవన్టోన్ టానిక్‌లా పని చేసింది. సినిమాను రంగుల్లో తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నారాయన!
1958 మార్చి నెలలో మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో లవకుశ సినిమా షూటింగ్ మొదలయ్యింది. నందమూరి తారక రామారావు పూజాదికాలు నిర్వర్తించారు. తర్వాత శ్రీరామచంద్రుడిగా అలంకరించుకుని వచ్చారు. ఆ దివ్యమోహనరూపాన్ని చూసిన వారు తన్మయం చెందారు. మొదటి సన్నివేశానికి విజయాధినేత నాగిరెడ్డి క్లాప్ కొట్టారు. ఆ తర్వాత రామదర్బారు సన్నివేశాలు కొన్నింటిని తీశారు. ఆ తర్వాత రామవరంలోని ఎం.జి.రామచంద్రన్ ఇంటి ఎదురుగా ఉన్న తోటల్లో వాల్మీకి ఆశ్రమం సెట్ వేశారు. ఈ తోట కూడా ఎమ్జీఆర్దే! లవకుశ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో మొదలుపెట్టారు. తొలి లవకుశ సినిమాకు ఈ లవకుశ సినిమాకు స్క్రిప్ట్ పరంగా పెద్ద తేడా లేదు. కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేశారంతే! ఎన్టీఆర్, అంజలీదేవి, కన్నాంబ, నాగయ్య రెండు భాషల్లోనూ వేశారు. తమిళంలో పద్యాలు ఉండవు కాబట్టి ఆ ప్లేస్‌లో వచనాన్ని జోడించారు. తెలుగులో లవుడుగా సీనియర్ ఏ.వి.సుబ్బారావు కుమారుడు నాగరాజు వేస్తే, కుశుడుగా సుబ్రహ్మణ్యం వేశారు. తమిళంలో మాత్రం లవకుశులుగా అక్కడి వారే నటించారు. లవుడుగా వేసింది మాత్రం అమ్మాయి. ఆర్టిస్టుల డేట్ల సమస్యల కారణంగా రెండు వెర్షన్లూ ఒకేసారి తీయడం వీలుపడలేదు. మొదట్లో సినిమా నిర్మాణం ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగింది. భారీ చిత్రం కావడంతో క్రమంగా ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. నిర్మాత చేతిలో ఉన్న డబ్బంతా కరిగిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. అప్పటికి ఎనిమిది వేల అడుగుల ఎడిటెడ్ ఫిలిం తయారయ్యింది. ఇంకా పన్నెండు వేల అడుగుల సినిమా మిగిలిపోయింది. వాల్మీకి ఆశ్రమంలోని సన్నివేశాలు, పాటలు, పద్యాలను చిత్రీకరించారు. అయోధ్యనగరంలో తీయాల్సిన సన్నివేశాలు, క్లయిమాక్స్ మాత్రం మిగిలాయి.
సినిమా మధ్యలో ఆగిపోవడంతో శంకర్‌రెడ్డి కుంగిపోయారు. లవకుశ సినిమాపై మాత్రం నమ్మకం సడలలేదు. ఎలాగైనా సరే సినిమా పూర్తవుతుందన్న విశ్వాసం. 1958 చివర్లో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఆర్ధికంగా ఆదుకోమని తెలిసినవారందరినీ అడిగారు. మిత్రులు వజీర్ చంద్ జబక్, చిట్టూరి గాంధీ నైతిక బలాన్ని అందించారు. చమ్రియా ఫిలింస్ అధినేత సుందర్‌లాల్ నహతా ఆర్ధికపరమైన సాయాన్ని అందించడాని ముందుకొచ్చారు. స్టూడియో వసతులు నాగిరెడ్డి సమకూర్చారు. వీరిందరి అండదండలతో 1962 ఆరంభానికి షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. అంతా సజావుగా సాగిపోతున్న తరుణంలో మరో అవాంతరం.. దర్శకుడు పుల్లయ్య అనారోగ్యంబారిన పడ్డారు. షూటింగ్‌కు రావడం ఆయనకు చేతకాలేదు. శరీరం సహకరించలేదు. మరి మిగతా సినిమా ఎవరు పూర్తి చేస్తారు? పుల్లయ్య కుమారుడు సి.ఎస్.రావు ఇందుకు సమర్థుడేనని సుందర్‌లాల్ నహతా అన్నారు. కాకపోతే సి.ఎస్.రావుకు మాత్రం బి.ఎన్.రెడ్డి అయితేనే సినిమాకు న్యాయం జరుగుతుందని అనిపించింది. అందుకు కారణం తిన్నంగాచార్య రచన కుందమాలను వెండితెరకుఎక్కించాలన్నది బి.ఎన్.రెడ్డి ఆకాంక్ష. కాంచనసీత పేరుతో సినిమా తీయడానికి కసరత్తులు కూడా చేశారు. అందుకే లవకుశ మిగతా సినిమాను బి.ఎన్.రెడ్డితో తీయిస్తే శ్రేయస్కరమని భావించి నేరుగా ఆయనను కలిశారు సి.ఎస్.రావు. కానీ బి.ఎన్. అందుకు ఒప్పుకోలేదు. లవకుశ సినిమా మీ తండ్రిగారి సొత్తు. అప్పుడు ఇప్పుడూ అది ఆయన సంపదే! అది మీకే చెందాలి. నువ్వే పూర్తి చెయ్యి. చేయగలవు కూడా అని సి.ఎస్.రావును ఆశీర్వదించి పంపించారు. పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు సి.ఎస్.లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దర్శకత్వ బాధ్యతను తీసుకున్నారు. మధ్యమధ్యలో పుల్లయ్య వచ్చి సినిమా పురోగతి కనుక్కునేవారు. సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఏమైనా సందేహాలు ఉంటే తీర్చేవారు.
సినిమా నిర్మాణం ఆలస్యం కావడంతో శంకర్‌రెడ్డి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినిమా చిత్రీకరణకు నాలుగేళ్ల అంతరం పెద్దల మీద పెద్దగా ప్రభావం చూపలేదు కానీ లవకుశుల మీద మాత్రం వయసు ప్రభావం చూపించింది. తమిళంలో లవుడు వేషం వేసింది అమ్మాయి. ఆశ్రమ సన్నివేశాలలో లవకుశులకు చిన్నపాటి వస్త్రం వంటిది తప్ప పైన ఆచ్ఛాదన వంటిదేమీ ఉండదు. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేనాటికి ఆ అమ్మాయిలో యవ్వన ఛాయలు కనిపించాయి. ఆ సమస్యను జింక చర్మతో పరిష్కరించారు. తెలుగులో ఇలాంటి సమస్య రాలేదు కానీ పిల్లలు చాలా ఎత్తు ఎదిగారు. సినిమా ఆసాంతం ఓ మధుర కావ్యంలా ఉండటంతో ప్రేక్షకులు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. సినిమా ఎక్కవ భాగం షూటింగ్ వాహినీ స్టూడియో జరిగింది. వాల్మీకి ఆశ్రమ సన్నివేశాలు రామవరంలో తీశారు. సీతాదేవిని లక్ష్మణుడు అడవుల్లో దించే సన్నివేశం, అప్పుడు తెరవెనుక వచ్చే ఏ నిమిషానికి ఏమి జరుగునో పాటను, కొన్ని యుద్ధ సన్నివేశాలను గిండీ అడవుల్లో తీశారు.
1958లో మొదలైన లవకుశ చిత్ర నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టింది. చివరకు 1963 మార్చి 29న విడుదలయ్యింది. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజలైతే బళ్లు కట్టుకుని పట్టణాలకు వచ్చి సినిమా చూసి వెళ్లారు. ఏ, బీ, సీ సెంటర్ వంటి తేడాలేమీ లేకుండా అన్ని చోట్లా సినిమా తెగ ఆడేసింది. 62 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 18 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. 75 వారాలు ఆడి వజ్రోత్సవం చేసుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా లవకుశనే! ఈ 60 ఏళ్లలో సినిమా ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. టీవీ ఛానెల్స్‌లో వస్తే రెప్పవార్చకుండా చూస్తున్నారు. సినిమా మార్చిలో విడుదలైతే ఏప్రిల్‌లో తెనాలి అన్నపూర్ణ పబ్లిషర్స్ వెండితెర నవలగా తీసుకొచ్చారు. బొల్లిముంత శివరామకృష్ణ రచించిన ఈ నవల కూడా అమ్మకాలలో రికార్డు సృష్టించింది. తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చినా, ఎవరెన్ని గొప్పలు చెప్పుకున్నా లవకుశకు మించిన సినిమా మరోటి లేదు. లవకుశకు సాటి లవకుశనే!