Jani Master : మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు.. జానీ మాస్టర్‌పై రేప్ కేసు
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ (21) రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూట్ సమయంలో.. నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. బాధితురాలు నార్సింగి నివాసి అయినందున తదుపరి విచారణ నిమిత్తం కేసును రాయదుర్గం పోలీసులు నార్సింగి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల ఎపీ ఎన్నికల వేళ జనసేనలో చేరిన జానీ మాస్టర్‌పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2019లో కూడా జానీ మాస్టర్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డ్యాన్సర్ సతీష్ తనపై 2019లో వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.