రంగమార్తాండ సినిమా గురించి రాసేముందు ఆ చిత్రదర్శకుడు క్రిష్ణవంశీ గురించి చెప్పాలి. దర్శకుడిగా ఇతగాడికి మొదటినుంచి ఉన్న మా చెడ్డఅలవాటు.....ఒక్కసారి సినిమాకి వెళ్ళి, ధియేటర్లో కూర్చున్న తర్వాత తలుపులు మూసేస్తే పూర్తిగా మనందరం క్రిష్ణవంశీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం.

రంగమార్తాండ సినిమా గురించి రాసేముందు ఆ చిత్రదర్శకుడు క్రిష్ణవంశీ గురించి చెప్పాలి. దర్శకుడిగా ఇతగాడికి మొదటినుంచి ఉన్న మా చెడ్డఅలవాటు.....ఒక్కసారి సినిమాకి వెళ్ళి, ధియేటర్లో కూర్చున్న తర్వాత తలుపులు మూసేస్తే పూర్తిగా మనందరం క్రిష్ణవంశీ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం. ప్రేక్షకలోకంపైన తనదైన ప్రభుత్వాన్ని అమాంతం ప్రకటిస్తాడు ఈ దర్శకుడు. నేల టిక్కెట్టు నుంచి బాక్స్ టిక్కెట్లు వరకూ కూడా ప్రతీ ఒక్కరినీ శాశిస్తాడు. ఇంక మనదన్నది ఏదీ అక్కడ ఉండదు. ఆయన ఆలోచనలను మనకి ఇంట్రావీనస్ ఇంజక్షన్లా ఎక్కిస్తాడు. వెంటనే వంశీ దారిలోకి మనం అప్రయత్నంగా మళ్ళిపోతాం. వంశీ చెప్పిందీ, చూపించిందే తదేకంగా వింటాం. చూస్తాం. ఎందుకు వింటాం...ఎందుకు చూస్తాం..మనం వెర్రివాళ్ళేం కాదు కదా. ఎందుకూ అంటే దర్శకుడిగా వంశీ ఆలోచనలు, కల్పనాశక్తి అంత గాఢంగా, గాంభీర్యంగా తెరమీద పాత్రల రూపంలో రూపుదిద్దుకుని, నిర్దిష్టంగా తను అమర్చే కెమెరా యాంగిల్స్, తెరమీద రీల్ రోలింగ్ స్పీడులో పరిగెత్తే ఫ్రేంల కలగలుపులో కథలోని భావావేశం, పాత్రల అభివ్యక్తీకరణ...వీటన్నిటితో మనం ఒప్పందం పడిపోతాం. అంగీకార ముద్రలో చిట్టచివరి ప్రేం వరకూ కూర్చూనే అసంకల్పిత ప్రతీకార చర్యలా పరిగెడుతూ, పరిగెడుడూ అలసిపోయిన క్షణంలో సినిమా అయిపోతుంది. ఇప్పడు నేను చెప్పినదానిలో అసలు మనది అనేది ఏదైనా ఉందా? దర్శకుడు ఎలా చెబితే అలా వినడం తప్పితే. అంటే అంత గొప్పగా సినిమాని Telling Impactతో చెప్పే దర్శకులు ఎవరూ నన్నడిగితే ఠక్కుమని నేను కూడా చెప్పలేను. తడుముకుంటే రెండుమూడు పేర్లు చెప్పగలనేమో. నాలుగోపేరు అనుమానమే. అదీ దర్శకుడు వంశీ ప్రత్యేకత. సార్ధకత అని కూడా అనొచ్చు అనిపిస్తుంది.

ఇప్పుడు రంగమార్తాండ సినమా డురించి చెప్పాలంటే....ఇది పూర్తిగా పిల్లల చిత్రం. ఎదిగిన పిల్లల చిత్రం. ఎదిగిన పిల్లల ముందు ఒడిలి, ఒదిగిపోయిన తల్లిదండ్రుల చిత్రం. కథాగమనం ప్రారంభమైనప్పడు తండ్రి రంగమార్తాండ రాఘవరావు ప్రపంచప్రఖ్యాత రంగస్థల నటుడు. కిరీటాలు, భుజకీర్తులు, స్వర్ణకంకణాలు, బిరుదులు, సన్మానాలు, పొగడ్తలలో మునిగితేలుతున్న సుప్రసిద్ద రంగస్థల నటుడు. అంటే స్టేజ్ వరకూ మెగాస్టార్ చిరంజీవి అనమాట సింపుల్ మాటలో చెప్పాలంటే. భార్య పేరు రాజుగారు....రాఘవరావుగారి ధర్మపత్ని...సినిమా మొత్తంలో రాఘవరావుగారు భార్య అలాగే సంభోదిస్తాడు. బర్త జీవితమే తన జీవితమనుకుని సంసారంలో పండిపోయిన ఒక పూజాఫలం. ఇద్దరు పిల్లలు. ఆడామగా. అబ్బాయికి ఫెళ్ళయింది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. రాఘవరావుగారు కష్టపడి ఇటుకఇటుక పేర్చి బ్రహ్మాండమైన సెంటర్లో కట్టుకున్న ఇల్లు. రాఘవరావుగారి దంపతుల రాజసానికి ఏ ఢోకా లేదు మొదట్లో. అంతవరకూ బాగానే ఉంది. ఈయనేమో నటుడు కదా...భావావేశం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు తగ్గించుకోవాలని అందులో మొదటి అడుగుగా తన ఇల్లు మనవరాలిమీద ప్రేమతో కోడలిపేర మీద రాసిపారేస్తాడు రాఘవరావు. ఇదే సినిమాకి వీరమలుపు.
ఇక్కడ నుంచి నేను చెప్పను. అక్కడ నుంచి ప్రతీమలుపూ గుండెల్ని పిండి పిప్పి చేస్తాయి. ఎందుకిలా జరుగుతోందని తెరమీదకి దండెత్తి అందరినీ ఉతికిపారేద్దామన్నంత ఎమోషన్కి లోనై, ప్రేక్షకుడు భీబత్సమైపోతాడు. ఇల్లు చేతిలో నుంచి జారిపోయిన తర్వాత ఆ అమాయక దంపతుల అగచాట్ల పరంపరతో గుండె బద్దలైపోతుంది. ప్రేఓకులమని మరచిపోయి ఆ అరాచకాన్ని ఎలా అపాలో తెలయిని నిస్పహాయస్థితి. ఇదొక ఎత్తు. రాఘవరావుగారి కూతురుకి పెళ్ళి అయింది కథాక్రమంలో. అల్లుడు కొడుకు కన్నా నయం. అభిరుచి గల కళాకారుడు. తండ్రి మనసుతో భార్యను సాకే మనసున్నవాడు. కానీ అక్కడ కూడా రాఘవరావుగారి దంపతులు ఎదురుదెబ్బే తిన్నారు. అదీ అత్యంత సహజంగా. దిక్కుమొక్కూ లేని తలిదండ్రుల వ్యక్తిత్వాలు ఎలా మంటగలసిపోతాయో చూస్తుంటే గుండె చెరువైపోతుంది. ఎంత నెత్తిబాదుకుని, మనకి సంబంధం లేకపోయినా కన్నీటి పర్యంతమైపోతాం. అర్ధరాత్రి దంపతులిద్దరూ దొంగ అని ముద్ర వేయించుకుని, దొంగతనంగా ఇల్లు వదలిపారిపోతుంటే మనకీ వాళ్ళతో పాటు సీట్లు వదిలేసి వెళ్ళిపోవాలనిపించేంత దయనీయంగా ఉంటుందా సన్నివేశం. అయినా ఏం చెయ్యలేం. ఫ్రేక్షకులుగా మనమూ దౌర్బల్య పాత్రలుగా ఉండిపోయే దిక్కుమాలిన స్థితి.

తీరా వాళ్ళు బైటకు వెళ్ళి, అర్ధరాత్రి వేళ, దారీతెన్నూ లేని త్రోవలో బస్ వాడు దించేసినచోట దిగిపోయి, ఆ ఒంటరి నిశీధే మహా స్వర్గంలా భావించి, చిట్టచివర చెట్టునీడలో అంతటి రంగమార్తాండుడు కూడా రక్త సంబంధమనే కారాఘారం నుంచి విముక్తి పొందిన ఖైదీలా భార్యను సముదాయిస్తూ, తెల్లవారితే సొంతఊరు దారి పడదామని కలతో పడుక్కుంటారు. కానీ ఇక్కడే విధివైపరీత్యం కోరలు సాచింది. తెలల్లవారింది. కానీ రాఘవరావుగారి జీవితమే అంధకారబంధురమైపోయింది. నిధ్రపోయిన సతీమణి దీర్ఘనిద్రలోకి జారిపోయి, మరలిరాని లోకాలకు మరలిపోయింది. రాఘవరావుగారు ఒక్కసారిగా చితికిపోయాడు. తర్వత సన్నివేశాలు ముందుకు సడుస్తున్నకొద్దీ మనసుని దారుణంగా గాయపరుస్తూ, మానవజీవితం కొన్నివేళల్లో ఇంత దుర్భరంగా ఉంటుందా అనే భయం కలగకమానదు.

ఈ కథా....కథనం ఒకెత్తు. ఇంక నటీనటుల గురించి చెప్పాలంటే ఒక మాటలోనో పూటలోనో చెప్పడం దుర్లభం. నిజంగా పరిపుష్టమైన పాత్ర గానీ దొరికిందంటే ప్రకాష్ రాజ్ అనే నటుడికి అదొక పెద్ద ప్లేగ్రౌండ్. అందుకే ఈ రాఘవరావు అనే పాత్రని ఫుట్ బాల్ ఆడేశాడు అవలీలగా. పాత్రను పోషించే నటుడి సామర్ధం పాత్ర పండడంలో ప్రాణం పాత్రను పోషిస్తుంది. ప్రకాష్ రాజ్ తన ప్రతిభని ఏమంత శ్రమపడకుండా, ఆ పాత్రని ఇంతకుముందు ఓ లక్షసార్లు పోషించినంత సునాయాసంగా చేసి, మాకెవ్వరికీ ఊపిరాడకుండా చేశాడు ఆద్యంతం. సాధారణంగా ప్రకాష్ రాజ్ నటనని చూసి చూసి ఆయన ముఖకవళికలకి, హావభావవిన్యాసానికి బాగా అలవాటు పడినవాళ్ళకే ఈ రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ పెరఫారమెన్స్ చూసి నివ్వెరపోవాల్సివచ్చింది. కేవలం కమర్షియల్ చిత్రాలలోనే కాదు, ఇటువంటి రసాత్మక చిత్రాలలో కూడా ప్రకాష్ రాజ్ ప్రకాశించతలడని చాలా నేర్పుతో, ఒడుపుతో ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. నరవింహ చిత్రంలో పాత్ర, బాహుబలి చిత్రంలో పాత్రలు చేసి తెరకే గంభీరత్వాన్ని ఆపాదించిన రమ్మక్రిష్ణ రంగమార్తాండలో అంత మౌనంగా, బాధను మోస్తూ, అనక్షణం బరువుగా కనిపించిండం ఆమెకు ఎలా సాధ్యపడిందా అనే అయోమయం ఆవరిస్తుంది. అంత నిశ్శబ్దంగా కదులుతూ కూడా తన పాత్రను ప్రకాష్ రాజ్ నటవైదుష్యానికి ధీటుగా పండించగలగడం నిజంగా ఒక ఫీట్ ఆమె కెరీర్లో. బ్రహ్మానందం గురించి చెప్పేముందు బ్రహ్మానందం ఇంతవరకూ చేసిన పాత్రలను నెమరువేసుకుంటే...దర్శకుడిగా వంశీకి గానీ, నటుడిగా లబ్దప్రతిష్టుడైన బ్రహ్మానందానికి గానీ పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని కూడా బ్రహ్మీ బద్దలు కోట్టారు. కామెడీ చేసే నటుటు, పైగా బాగా ప్రజాబాహుళ్యంలో నాటుకుపోయినవారు హఠాత్తుగా ఇటువంటి మెలోడ్రామా పాత్రలను చేయడమంటే ఎంతోకొంత నటన పట్ల సీరియస్ కమిట్మెంట్ బహుదా అవసరం. అంత దీక్ష ఉంది కాబట్టే బ్రహ్మానందం అనే నటుడు అజరామరమైన సుదీర్థకాల నటజీవితాన్న ప్రోది చేసుకోగలిగారు అనిపించింది. సరే అనసూయ ఏం చేసినా ఈరోజున చెల్లుతోంది. అది అనసూయ స్టార్ డమ్ ప్రతిపలించే ప్రత్యేకకోణం.

మొదటే దర్శకుడు క్రిష్ణవంశీ వ్యవహారం తేల్చిచెప్పాను. ప్రతీ పాత్ర వెనుక పక్కన ఈ గడుసు దర్శకుడు కనీకనిపించకుండా నక్కుతూనే సినిమా మొత్తం కొనసాగాడు. ఏ పాత్రనీ సుళువుగా వదలిపెట్టే ఖాతరు లేని దర్శకుడు కాకపోబట్టే మైల్ స్ఠోన్ చిత్రాలకు రూపకల్పన చేయగలిగాడు. అడపాదడపా సినిమాలు చేస్తున్నా కూడా ప్రేక్షకలోకం వంశీని మరచిపోలేరు. రంగమార్తాండ చిత్రం చూశాక మానవసమాజం ఎన్నటికీ మరచిపోలేదు. వంశీ మరపుకి రాడు.

Updated On 14 March 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story