పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా చూసినవారు ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)ని అంత తొందరగా మర్చిపోలేరు. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనను కనబర్చారు. తమిళ, మలయాళ భాషలలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే!

Aishwarya Lekshmi
పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమా చూసినవారు ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)ని అంత తొందరగా మర్చిపోలేరు. అదొక్కటే కాదు ఎన్నో సినిమాల్లో ఆమె అద్భుతమైన నటనను కనబర్చారు. తమిళ, మలయాళ భాషలలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే! ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా కింగ్ ఆఫ్ కోథా(King Of Kotha)తో ప్రేక్షకులకు ముందుకు రానున్నారు. దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య లక్ష్మి విలేకరులతో ముచ్చటించారు. ‘‘నా సినీ ప్రయాణం మొదలైన తొలి రోజుల నుంచీ మలయాళంలో నటిస్తున్నాను. దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండింది. మధ్యలో కొన్నిసార్లు ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇప్పటికీ ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. భారీ స్థాయిలో రూపొందిన సినిమా ఇది. దర్శకుడు అభిలాష్ జోషి ఈ సినిమా స్థాయి గురించి చెప్పినప్పుడే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. భారీ సెట్స్, నిండైన సన్నివేశాలతో అచ్చమైన తెలుగు సినిమాలా రూపొందించారు. ఇందులో నేను కీలకమైన పాత్రలో కనిపిస్తా. పొన్నియిన్ సెల్వన్‌లో నేను సినిమా మొత్తం కనిపించను. కానీ ఆ పాత్ర గుర్తుండిపోతుంది. అలా కథలో ప్రాధాన్యం ఉంటూ, కథకి ఓ పరిపూర్ణతని తీసుకొచ్చే పాత్రనే ఇందులోనూ పోషించాను. నా పాత్ర పేరు తార. ఇదొక కల్పిత కథ. కోథా అంటే ఓ ప్రత్యేకమైన టౌన్. యథార్థ పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దుల్కర్ సల్మాన్ ఇందులో రాజు పాత్రలో కనిపిస్తారు. దుల్కర్‌కు , నాకూ మధ్య అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథ ఉంటుంది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో సవాల్‌గా భావించి నటించాను. దర్శకుడు మట్టి కుస్తీ సమయంలో నాకు ఈ కథ వినిపించారు. ప్రతి పాత్రకీ ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. దుల్కర్ సల్మాన్‌తో పనిచేయడం మంచి అనుభవం. తనతో మాట్లాడితే చాలు.. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం' అని ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. తనకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుందని, ఈ మధ్య తెలుగులో వచ్చిన సినిమాల్లో తనకు దసరా చాలా నచ్చిందని అన్నారు. అందులో కీర్తి సురేష్ పాత్ర ఇంకా ఇష్టమని, అలాంటి పాత్ర చేయాలని తనకు కూడా ఉందని ఐశ్వర్య లక్ష్మి అన్నారు. 'సమంత, సాయిపల్లవి నటన కూడా ఎంతో ఇష్టం. శ్రీలీల డ్యాన్స్‌ని ఆస్వాదిస్తా. స్టైల్‌తో కట్టిపడేసే అల్లు అర్జున్ తెలుగులో ఇష్టమైన హీరోల్లో ఒకరు. ప్రస్తుతానికి నేను తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి' అని ఐశ్వర్య లక్ష్మి వివరించారు.
