Mollywood : మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ప్రకంపనలు.. స్పందించిన గవర్నర్
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు ఘటనలు వెలుగు చూస్తున్నాయి
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఓ నివేదిక చెబుతోంది. దీనిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రకటన వెలువడింది.
మలయాళ పరిశ్రమలో లైంగిక దోపిడీకి గురవుతున్న మహిళలు ముందుకు వస్తే న్యాయపరమైన ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తానని.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై తనకు నమ్మకం ఉందని.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక దోపిడీని బట్టబయలు చేసిన హేమ కమిటీ నివేదికకు సంబంధించిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానమిచ్చారు. నివేదికలో వెల్లడైన విషయాలపై దర్యాప్తు జరిపించాలని కేరళలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
గవర్నర్ మాట్లాడుతూ.. ఎవరైనా ఫిర్యాదులతో వస్తే విచారణ వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి రికార్డులో చెప్పారని భావిస్తున్నాను. బాధితులు ముందుకు వచ్చి నేరస్థులపై ఫిర్యాదులు చేస్తే.. చట్టపరమైన ప్రక్రియ వేగంగా ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చేసిన వాగ్థానంపై నమ్మకముందని అన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మహిళల ఇంటర్వ్యూలు, ప్రకటనల కారణంగా సీనియర్ పోలీసు అధికారులతో సీఎం సమావేశమయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వాటిపై దర్యాప్తు చేసేందుకు ఐజీపీ జి స్పర్జన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులు తీవ్రంగా ఉన్నాయని గత వారం హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక సందర్భాలను కమిటీ వెల్లడించింది. దీని తర్వాత.. పరిశ్రమలో లైంగిక వేధింపులపై పలువురు మహిళలు కూడా ముందుకు వచ్చారు.