మళ్లీ మొదలైన హరి హర వీర మల్లు షూటింగ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan) అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు(Hari hara veeramallu) షూటింగ్ మళ్లీ మొదలయ్యింది. అనుకోని కారణాల వల్ల కొంతకాలంగా ఈ సినిమా ముందుకు కదల్లేదు. అయితే ఇప్పుడు చిత్ర బృందానికి హుషారు వచ్చేసింది. వరుస అప్‌డేట్లతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ కీలకమైన అప్‌డేట్‌ను చెప్పింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను(MOvie shooting) ఆగస్టు 14వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది. ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించారు. ఇందులో 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు భాగస్వాములయ్యారు. ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఒప్పుకున్న సినిమాలను త్వరిత గతిన పూర్తి చేయాలని అనుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు తగు సమయాన్ని కేటాయిస్తూనే సినిమాలు చేయాలన్నది పవన్ అభిలాష. మరికొద్ది రోజుల్లో హరి హర వీరమల్లు చిత్రీకరణలో పవన్ పాల్గొనబోతున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ ని ఒక అద్భుతమైన యోధుడిగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేలా ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించేందుకు గాను నిర్మాణ సంస్థ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. పవన్ తన నట జీవితంలో మొదటిసారిగా చారిత్రాత్మక యోధుడుగా కనిపించనున్నారు. త్వరలోనే 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'తో ప్రేక్షకులందరికీ ఒక సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న తర్వాత ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులతో పాటు, సినీ ప్రేమికులలో ఈ చిత్రంపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసింది. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.