✕
Centenary Birth Anniversary of Dev Anand : తొలి రొమాంటిక్ హీరో ఆయనే! తొలి ట్రెండ్ సెట్టర్ కూడా ఆయనే!
By EhatvPublished on 26 Sep 2023 4:21 AM GMT
ఈ సినిమాతోనే హాస్యనటుడు జానీవాకర్ కూడా పరిచయం అయ్యారు. అన్నట్టు ఈ సినిమాతోనే గీతారాయ్ గురుదత్ పరిచయం అయ్యారు. దేవానంద్‌కు కల్పనా కార్తీక్ పరిచయం అయ్యారు. తర్వాతి కాలంలో వారు దంపతులయ్యారు.

x
Centenary Birth Anniversary
-
- భారతీయ సినిమా చరిత్రను ఎవరైనా రాస్తే మాత్రం అందులో కచ్చితంగా దేవానంద్‌కు కొన్ని పేజీలు కేటాయించి తీరతారు! ఎందుకంటే దేవానంద్ లేకుండా సినిమా లేదు. తొలి ఫ్యాషన్ సింబల్ ఆయన!నటుడే కాదు, మంచి నిర్మాత, అంతకు మించి మంచి రచయిత, దర్శకుడు దేవానంద్. ఆరు దశాబ్దాల పాటు సినిమారంగంతో మమేకమయ్యారు. వంద సినిమాల్లో నటించారు. ఇవాళ ఆ రొమాంటిక్ హీరో శతజయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి కాసింత తెలుసుకుందాం! దేవానంద్ కంటే ముందు హీరోలున్నారు. ఆ తర్వాత కూడా హీరోలు వచ్చారు.
-
- కానీ దేవానంద్‌లా ఎవరూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయారు. ఆయన శైలిని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఆయన సినిమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయంటే అదే కారణం. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ శకర్గఢ్లో 1923లో జన్మించారు దేవానంద్. లాహోర్ కాలేజీలో ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టా పొందారు. తర్వాత రెండు మూడు ఉద్యోగాలు చేశారు కానీ అవి తనకు సరిపడవని గ్రహించారు. సినిమాలే తనకు మార్గమనుకున్నారు. వెంటనే ముంబాయికికి వచ్చారు. 1946లో హమ్ ఏక్ హై సినిమాలో మెరిశారు. ఆ తర్వాత రెండేళ్లకు జిద్దీ అనే సినిమా వచ్చింది. అది సూపర్ హిట్టయింది.
-
- అప్పట్నుంచి దేవానంద్ శకం మొదలయ్యింది. తనేమిటో రుజువు చేసుకోవడానికి సొంత నిర్మాణ సంస్థ ఉంటే బాగుందనుకున్న దేవానంద్ 1949లో నవకేతన్ అనే నిర్మాణ సంస్థను మొదలు పెట్టారు. బల్రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా బాజీ తీశారు. ఆ సినిమాకు దేవానంద్ ప్రియమిత్రుడు గురుదత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఉర్దూ కవి సాహిర్ లూధియాన్వీతో పాటలు రాయించుకున్నారు దేవానంద్. అలా సాహిర్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే హాస్యనటుడు జానీవాకర్ కూడా పరిచయం అయ్యారు. అన్నట్టు ఈ సినిమాతోనే గీతారాయ్ గురుదత్‌కు పరిచయం అయ్యారు
-
- దేవానంద్‌కు కల్పనా కార్తీక్ పరిచయం అయ్యారు. తర్వాతి కాలంలో వారు దంపతులయ్యారు. అదలా ఉంచితే నవకేతన్ బ్యానర్‌పై దేవానంద్ 35 సినిమాల వరకు నిర్మించారు. ఇందులో మాగ్జిమమ్ హిట్ సినిమాలే ఉన్నాయి. దేవానంద్ ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలరు. ఆయన సినిమాలే ఇందుకు నిదర్శనాలు. ఘర్ నంబర్ 44, నౌదో గ్యారా, బొంబాయి కా బాబు, కాలాబజార్, కాలాపానీ, పెయింగ్ గెస్ట్, జ్యువెల్ థీఫ్, సీఐడీ, హమ్‌దోనో, అమీర్ గరీబ్, జానీ మేరా నామ్, హరేరామ హరే కృష్ణ ఇలా ఎన్నో ఎన్నెన్నో.. చెప్పాలంటే ఆయన ప్రతీ సినిమా గురించి చెప్పుకోవాలి. ఇవన్నీ కాదు కానీ దేవానంద్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన సినిమా గైడ్.
-
- సోదరుడు విజయానంద్ దర్శకత్వం వహించారు. 1965లో విడుదలైన ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండియన్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. నిర్మాణ సమయంలోనే సినిమాపై నెగటివ్ ప్రచారం జరిగింది. దేవానంద్ ఇలాంటి సినిమా చేయడమేమిటని చాలామంది విమర్శించారు కూడా! సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ సినిమా విడుదలయ్యాక ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. ఆ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌తో పాటు అన్ని అవార్డులను గెల్చుకుంది.
-
- ఇండియా తరపున ఆస్కార్‌కు అధికారికంగా నామినేట్ అయ్యింది కూడా! ఇంకో విశేషమేమింటే ఈ సినిమా దూరదర్శన్‌లో మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు జనం టీవీ సెట్లకు అతుక్కుపోయారట! ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయట! మరో చిత్రమేమిటంటే సినిమా చూసి ఆర్.కె.నారాయణ్ పెదవి విరచడం! నా గైడ్‌ను మిస్‌గైడ్ చేశారంటూ వాపోయారాయన! ప్రేమ్‌పూజారి సినిమాతో దర్శకుడుగా మారిన దేవానంద్ కొన్ని విజయవంతమైన సినిమాలు రూపొందించారు. దేవానంద్‌కు 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి.

Ehatv
Next Story