కంగనా రనౌత్‌ మళ్లీ వేసేసింది!

బీజేపీ(BJP) అధిష్టానం పాటిలిక్స్‌ మాట్లాడవద్దన్నది కానీ సినిమాలు కాదుగా అని అనుకున్నారేమో ఎంపీ కంగనా రనౌత్‌(Kangana Ranauth).. లేటెస్ట్‌గా బాలీవుడ్‌ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టాలెంట్‌ ఉన్నవారికి అక్కడ ఎలాంటి గుర్తింపు లభించదట! ప్రోత్సహించేవారు కూడా ఉండరట! ఆమె కూడా అదే విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారట! ఇవన్నీ కంగనానే చెబుతూ బాలీవుడ్‌ తనను బహిష్కరించిందని వ్యాఖ్యానించారు. 'నా వరకూ నేను మంచి వ్యక్తిని. నా చుట్టూ ఉన్న వారితో మర్యాదపూర్వకంగా మసలుకుంటా. ఎన్నికల్లోనూ గెలిచా. ఇండస్ట్రీ నుంచి ఎంతో ప్రేమాభిమానాలు పొందా. దీన్ని బట్టి చూస్తే నాతో కొంతమందికి మాత్రమే సమస్య ఉంది. ఆ సమస్య నాలో ఉందా? లేదా వారిలో ఉందా? అనేది వారు కూడా ఒక్కసారి ఆలోచిస్తే మంచిది. నా దృష్టిలో బాలీవుడ్‌(Bollywood) ఒక నిస్సహాయ ప్రదేశం. ఈ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు మనకు ఎలాంటి సాయం చేయరు. టాలెంట్‌ని చూసి వారు అసూయపడతారు. ఎవరైనా టాలెంట్‌ ఉన్న వ్యక్తులు తమ దృష్టిలో పడితే వారి కెరీర్‌ నాశనం చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. పీఆర్‌లను పెట్టుకుని వారిపై ఉన్నవి లేనివి ప్రచారం చేయిస్తారు. ఇండస్ట్రీ వారిని బహిష్కరించేలా పరిస్థితులు సృష్టిస్తారు' అని కంగనా రనౌత్‌ ఆరోపించారు. కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story