దాదాపుగా ప్రేమకథలన్నీ(Love story) విషాదాంతాలే అవుతాయి! అంజు మహేంద్రు(Anju Mahendru) ప్రేమ కథ కూడా అంతే! సడన్‌గా ఈమె ఎందుకు గుర్తుకొచ్చిందంటే నిన్న ఆమె పుట్టిన రోజు కాబట్టి. ఈ తరం వారికి అంజు మహేంద్రు తెలియకపోవచ్చు కానీ ఓ తరం కుర్రకారు గుండెల్లో అలజడులు రేపిన అందాలతార అంజు మహేంద్రు. 1946, జనవరి 11వ తేదీన బాంబేలో జన్మించారు అంజు. ఈమె తల్లిగారు సుప్రసిద్ధ సంగీత దర్శకుడు మదన్మోహన్కు స్వయాన సోదరి. 13 ఏళ్ల ప్రాయంలోనే అంజు మోడలింగ్‌లో(Modelling) అడుగుపెట్టారు. అప్పుట్లో ఈమె అందము, అభినయము చూసిన రచయిత కైఫీ ఆజ్మీ(Kaifi Azmi) ఈమెను దర్శకుడు బాసు భట్టాచార్యకు(Basu Bhattacharya) పరిచయం చేశారు.
బాసు భట్టాచార్య తీసిన ఉస్కి కహాని(Uski Kahani) అనే సినిమాతో అంజు తెరంగ్రేటం చేశారు. బాసు భట్టాచార్యకు కూడా దర్శకుడిగా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత అంజుకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. జ్యుయెల్ థీఫ్, బంధన్, ఇంతకామ్, దస్తక్ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చాయి. తొమ్మిదో దశకంలో ఆమె టెలివిజన్‌కు ఫిష్ట్ అయ్యారు.అనూగూంజ్, స్వాభిమాన్, అస్తిత్వ, కహీతో హోగా వంటి సీరియల్స్‌లో అంజు మహేంద్రు ప్రముఖ పాత్రను పోషించారు. ఇటీవలి కాలంలో సాథియా, పేజ్-3, డర్టీ పిక్చర్లలో మెరిసారు. ఆరో దశకం మధ్యలో రాజేశ్‌ఖన్నాతో అంజుకు పరిచయమయ్యింది. రాజేశ్‌ఖన్నా మెరిసేటి కళ్లల్లో తన రూపాన్ని చూసుకున్నారు అంజు. రాజేశ్ ఖన్నా(Rajesh Khanna) కూడా అంతే! అంజు ముగ్దమోహన రూపం మోహంలో పడిపోయారు.
ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో కూరుకుపోయారు. కాకపోతే అంజు సినిమాల్లో నటించడాన్ని రాజేశ్‌ఖన్నా ఇష్టపడలేకపోయాడు. సినిమాలు, మోడలింగ్ వదిలిపెట్టమన్నాడు. అప్పటికే అంజు టాప్ మోడల్! సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అలాంటి దశలో రాజేశ్‌ఖన్నా ఆదేశాన్ని తిరస్కరించింది. 1969లో ఆరాధన సినిమా వచ్చింది. రాత్రికి రాత్రే రాజేశ్ ఖన్నా సూపర్‌స్టారయ్యాడు. ప్రజలు అతడిని అమితంగా ఆరాధించసాగారు. అమ్మాయిలైతే పడి చచ్చిపోయేవారు. రోజుకు అతడికి వేలాది ప్రేమలేఖలు వచ్చేవి. రాజేశ్‌ఖన్నా కారు మీద ఉన్న ధూళిని బొట్టుగా పెట్టుకుని మురిసిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. మునుపటి రాజేశ్‌ఖన్నా కాదిపుడు! అంజు మహేంద్రు కూడా అంతే! అహం ఇద్దరిమధ్య అంతరాన్ని పెంచింది.
ఆ తర్వాతి రెండేళ్లలో రాజేశ్‌ఖన్నా తిరుగులేని హీరో అయ్యాడు. వరుసగా 15 సిల్వర్‌జూబ్లీలు ఇచ్చాడు. అయినప్పటికీ రాజేశ్‌ఖన్నా అంజును కలిసే ప్రయత్నం చేసేవాడు. పెళ్లి చేసుకుందామని అడిగేవాడు. రాజేశ్ అభ్యర్థనను ఆమె కాదనేది. 1971 నాటికి ఇద్దరూ పూర్తిగా విడిపోయారు. అంజుతో కాదనుకున్న రాజేశ్‌ఖన్నా 17 ఏళ్ల వయసున్న డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకున్నాడు. డింపుల్‌కు కూడా పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదనే కండిషన్ పెట్టాడు. బాబీ వంటి సూపర్‌డూపర్ సినిమాలో నటించిన డింపుల్ ఆ తర్వాత ఎనిమిదో దశకం వరకు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. రాజేశ్‌ఖన్నాతో విడిపోయిన తర్వాత అంజు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్‌కు దగ్గరయ్యింది. ఓ పార్టీలో అంజును చూసిన సోబర్స్ మనసు పారేసుకున్నాడు.
తనకు తానుగా వెళ్లి అంజును పరిచయం చేసుకున్నాడు. పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళ్లేవారు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందంటుంటారు. ఎంగేజ్మెంట్ అయ్యాక సోబర్స్ వెస్టిండీస్‌కు వెళ్లిపోయాడు. అయినా ఇద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగేవి. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు సోబర్స్ అక్కడ కిర్బీ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. వీరి సంబంధం పెళ్లి వరకు వెళ్లింది. అంజుకు ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. ఐయామ్ సారీ అంజూ అంటూ సంభాషణ మొదలు పెట్టిన సోబర్స్ జీవితాంతం నువ్వు నాకు గుర్తిండిపోతావన్నాడు. అనివార్యకారణాల వల్లే తాను కిర్బీని పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నదని, తనను మన్నించమని వేడుకున్నాడు. దు:ఖాన్ని అదిమిపెట్టుకుంటూ నువ్వు పెళ్లి చేసుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని చెప్పింది అంజు.
ఆ తర్వాత అంజు మరో క్రికెట్ ఆటగాడు ఇంతియాజ్ అలీని ప్రేమించింది. ఈ ప్రేమబంధం కూడా కొంతకాలానికి బ్రేక్ అయ్యింది. తర్వాత అంజు పెళ్లికి దూరంగా ఉండిపోయింది. రాజేశ్‌ఖన్నాతో ఏర్పడిన మనస్పర్థలు 17 ఏళ్ల తర్వాత సమసిపోయాయి. డింపుల్‌కు దూరమైన రాజేశ్‌ఖన్నాకు అంజు దగ్గరయ్యింది. 1988 నాటికి రాజేశ్‌ఖన్నా సినీ కెరీక్ కూడా చరమాంకానికి చేరుకుంది.రాజేశ్‌ఖన్నా చనిపోయేంతవరకు అంజు అతడి దగ్గరే ఉంది. అతడి వైద్య అవసరాలన్నీ అంజునే తీర్చింది. ఆసుపత్రిలో అతడి పక్కనే ఉండింది. 2012లో రాజేశ్‌ఖన్నా చనిపోయేంత వరకు అతడి వెన్నింటి నిలిచింది అంజు. రాజేశ్ చివరి శ్వాస విడుస్తున్నప్పుడు అతడి చేతులను తాను పట్టుకునే ఉన్నానని, జీవితానికి ఇది చాలని తర్వాత ఎప్పుడో మహేశ్‌భట్‌కు చెప్పుకుని సంతోషపడిందట! ఓ అద్భుతమైన ప్రేమకథ ఇలా ఆనంద విషాదాల మధ్య ముగిసిపోయింది.