అన్ని మతాలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నాయని, ఈ సినిమా మతాల మధ్య గొడవలను సృష్టిస్తోందని
శివకార్తికేయన్ హీరోగా నటించిన 'అమరన్' సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ టీజర్ కారణంగా తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి, స్టీఫన్ రిక్టర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అశోక్ చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ కథ ఆధారంగా రూపొందించారు. అమరన్ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు. టీజర్‌లో కొన్ని వివాదాస్పద సన్నివేశాల కారణంగా శివకార్తికేయన్, కమల్ హాసన్ ఇద్దరూ విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ చిత్రం టీజర్‌లో కాశ్మీరీ ముస్లింలను చెడుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ టీజర్ విడుదలైనప్పటి నుండి తమిళగ మక్కల్ జననాయక కట్చి (టిఎంజెకె) సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కశ్మీరీ ముస్లింలపై అనవసరమైన వ్యతిరేకతను ప్రోత్సహిస్తోందని నిరసనకారులు ఆరోపిస్తూ ఉన్నారు. తమిళనాడులో అన్ని మతాలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నాయని, ఈ సినిమా మతాల మధ్య గొడవలను సృష్టిస్తోందని ఆ సంస్థ పేర్కొంది. శివకార్తికేయన్, కమల్‌హాసన్‌లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు శివకార్తికేయన్, కమల్‌హాసన్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరన్ టీజర్ ను ఇటీవలే చిత్ర నిర్మాతలు విడుదల చేసారు. విజువల్స్, సాంకేతిక విలువలకు బాగా ప్రశంసలు అందుకుంది. శివకార్తికేయన్ ఆర్మీ మేన్‌గా న్యాయం చేశాడని అభిమానులు చెబుతున్నారు.