జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో(Justice Hema committee report) సినిమా పరిశ్రమలో కలకలం రేగుతోంది.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌తో(Justice Hema committee report) సినిమా పరిశ్రమలో కలకలం రేగుతోంది. మలయాళ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఈ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు. ఇదే తరహా కమిటీని తమ ఇండస్ట్రీలో కూడా ఏర్పాటు చేయాలని తమిళ, కన్నడ, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్(Simran) దీనిపై స్పందించారు. తాను కూడా వేధింపుల బాధితురాలినేనని చెప్పారు. నార్త్ ఇండియాకు చెందిన సిమ్రాన్ తమిళ, తెలుగు భాషలలో నటించారు. ఎన్నో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఆ మధ్యన పేట అనే సినిమాలో రజనీకాంత్ సరసన నటించనున్నారు. ప్రస్తుతం మహిళా ఆర్టిస్టుల వేధింపుల వ్యవహారం పెద్ద చర్చకు దారి తీస్తున్నదని, తాను కూడా వేధింపులకు గురయ్యానని ఆమె చెప్పారు. ఒక మహిళపై లైంగిక వేధింపులో, లైంగిక దాడో జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణమన్నారు. ఆ సంఘటన గురించి వెంటనే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. మన చుట్టూ ఎం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుందన్నారు. సహనం పాటించి ఆలోచించి ఆ తరువాతనే రియాక్ట్ అవ్వగలమని, అందుకు సమయం తప్పనిసరిగా అవసరం సిమ్రాన్ తెలిపారు. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నానని, అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పలేనని పేర్కొన్నారు.