జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం సెల్యూలాయిడ్ లోకంలో ఒక సుందర స్వప్నం. భూలోకం, స్వర్గలోకం...రెంటినీ జతచేసి, ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్థులను చేసిన మహత్తర దృశ్యకావ్యం. కోటానుకోట్ల భారీ బడ్జెట్ వ్యయంతో, ఏ మాత్రం రిస్క్ భయం లేకుండా, విజయావాహినీ స్టూడియోలో కన్నుల పండుగ చేసే సెట్స్ నిర్మించి, కాల్పనిక జగత్తును కళ్ళ ముందు నిలబెట్టిన నిరుపమాన కళాఖండం జగదేకవీరుడు అతిలోకసుందరి. వైజయంతీ మూవీస్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి, ఆలిండియా నెంబర్‌వన్ శ్రీదేవి కాంబినేషన్‌లో ఆగ్రనిర్మాత అశ్వనీదత్ చలసాని నిర్మించిన ఉగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం పెనుతుఫానులో విడుదలైంది.
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం సెల్యూలాయిడ్ లోకంలో ఒక సుందర స్వప్నం. భూలోకం, స్వర్గలోకం...రెంటినీ జతచేసి, ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్థులను చేసిన మహత్తర దృశ్యకావ్యం. కోటానుకోట్ల భారీ బడ్జెట్ వ్యయంతో, ఏ మాత్రం రిస్క్ భయం లేకుండా, విజయావాహినీ స్టూడియోలో కన్నుల పండుగ చేసే సెట్స్ నిర్మించి, కాల్పనిక జగత్తును కళ్ళ ముందు నిలబెట్టిన నిరుపమాన కళాఖండం జగదేకవీరుడు అతిలోకసుందరి. వైజయంతీ మూవీస్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి, ఆలిండియా నెంబర్‌వన్ శ్రీదేవి కాంబినేషన్‌లో ఆగ్రనిర్మాత అశ్వనీదత్ చలసాని నిర్మించిన ఉగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం పెనుతుఫానులో విడుదలైంది. వర్షపునీటిలో ధియేటర్లకి ధియేటర్లు జలమయమైపోతున్న తరుణంలో కూడా కలెక్షన్ల పెనుతుఫానును సృష్టించిన తెలుగుసినిమా చరిత్రలో ఒకే ఒక్క చిత్రంగా తిరుగులేని రికార్డును నెలకొల్పిన చిత్రంగా సంచలనం సృష్టించింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం 1990, మే 9న విడుదలై నేటికి సరింగా 33 సంవత్సరాల జైత్రయాత్రను పూర్తిచేసుకుంది. ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన అద్భుతమైన బాణీలు, సినీసాహితీ సమరాంగణ సార్వభౌముడు వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలు ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూపి, ఊరూవాడా మారుమోగిపోయాయి.
తెరవెనుక కథ....
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో చిరస్మరణీయమైన ఒక అద్భుతమైన చిత్రం నిర్మించాలనే అశ్వనీదత్ సంకల్పమే జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి మొట్టమొదటి ఊపిరి. ఈ నేపథ్యంలో ఆయన కథ కోసం లాంతర్లు పట్టుకుని గాలిస్తున్న సమయంలో అలనాటి రచయిత శ్రీనివాస చక్రవర్తి చెప్పిన ఓ మూలకథకు మురిసిపోయిన అశ్వనీదత్ ఆ కథాంశంతోనే సినిమా తీయాలని నిర్ధారించుకున్నారు. అయితే దర్శకుడు ఎవరన్న చర్చ మొదలైంది. అశ్వనీదత్ మనసులో మాత్రం ఆయన ముద్దుగా బావా అని పిలచుకున్న రాఘవేంద్రరావే పీట వేసుకుని కూర్చున్నారు. కానీ, అప్పటికి వరస ఫ్లాపులతో అలసిపోయిన రాఘవేంద్రరావు పేరు చెబితే ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకు నీకు రిస్క్...పైగా భారీ బడ్జెట్ చిత్రమిది...మరొక డైరెక్టర్‌ని చూసుకో...అని చెప్పనివారు లేరు ఆరోజున. కానీ అశ్వనీదత్ మాత్రం రాఘవేంద్రరావే దర్శకుడని పట్టుబట్టి కూర్చున్నారు. అందరూ నిరుత్సాహపరుస్తున్నా సరే అయన నిర్ణయానికే కట్టుబడి నిలబడ్డారు. ఆయన నిర్ణయాన్ని బలపరిచింది ఒకే ఒక్క వ్యక్తి, ఆ వక్తి మరెవరో కాదు...మెగాస్టార్ చిరంజీవి. ఫ్లాపులొస్తే మాత్రం ప్రతిభను మరచిపోకూడదని ఇద్దరూ నిర్ణయించుకుని రాఘవేంద్రరావునే ఫైనలైజ్ చేశారు. కథా చర్చలు మొదలయ్యాయి.
కథాచర్చలలో ప్రముఖ రచయితలు సత్యానంద్, జంధ్యాల, యండమూరి వంటివారితో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం. వైజయంతీ మూవీస్ కార్యాలయంలోనే చర్చలు ఎడతెరిపి లేకుండా కొనసాగాయి. షూటింగ ముహూర్తం బెంగుళూరులో జరిగింది. ఫొటో స్టూడియోలో శ్రీదేవి, చిరంజీవి, కిడ్స్ పొటో తీయించుకున్న సన్నివేశం చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. తర్వాత పాటల కోసం విఉయావాహినీ స్టూడియోలో అందాలలో ఆహో మహోదయం పాటను బ్రహ్మాండమైన సెట్‌లో తీశారు. మన భారతంలో పాటను బొర్రా కేవ్స్‌లో చిత్రీకరించారు. ప్రియతమా...క్లైమాక్సులో పాటని కూడా విజయావాహినీలోనే సెట్ వేసి షూట్ చేశారు. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ఆ పాట, కైమాక్సు సాంగ్ అంటే ఇలా ఉండాలనే పడికట్టుని ఏర్పరిచిన పాట అది. దినక్కుతా పాట కూడా విజయావాహినీ లోనే జరగడం...ఆ పాట జరుగుతున్నప్పుడు మెగాస్టార్‌కి హై ఫీవర్. విజయా హస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ జరుగుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడిపోతోంది అనే కమిట్‌మెంట్‌తో మెగాస్టార్ ఫీవర్‌తోనే శ్రీదేవితో సాంగ్‌లో పాల్గొన్నారు. సెట్‌లోనే డాక్టర్ ఉంటూ ఆయనని కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తిగతమైన బాధ్యతను నిర్మాతగా అశ్వినీదత్ నిర్వర్తించారు. అమ్మనీ తీయని దెబ్బ పాట మైసూర్‌లో జస్ట్ టూ డేస్‌లో తీయడం విశేషంగా చెప్పాలి. అసలీ ట్యూన్‌కే ఎవ్వరూ ఓటు వేయలేదు. స్లోగా ఉందని అందరూ సొణుకున్నారు. కానీ అశ్వనీదత్ మాత్రం ఇదే ట్యూన్ సూపర్‌హిట్ అవుతుందని గట్టిగా నిలబడిపోయారు. నిజంగానే ఆ పాటే సినిమాకి ఆయువుపట్టుగా మారింది. అశ్వనీదత్ మ్యూజికల్ టేస్ట్‌కి తిరుగులేదని నిరూపణ అయిన సందర్భాలలో అమ్మనీ కమ్మనీ దెబ్బ పాట ఓ మచ్చుతునక.
కరెక్టుగా సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఓ పక్కన విడుదలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటిలా కాదు కదా...ఇప్పుడైతే కంప్యూటర్‌లలోనైనా ఫిల్మ్ డెలీవరీ చేసుకునేంత సౌలభ్యం వచ్చింది. అప్పుడు పరిస్థితి అది కాదు. ప్రింట్లు వెళ్ళాలి. రైలు మార్గాలు చెల్లాచెదురై, రైళ్ళు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎప్పుడు తుఫాను వెలుస్తుందో...ఎప్పుడు రాకపోకలు మొదలవుతాయో కూడా తెలియని సందిగ్ధత....క్షణక్షణం ఉత్కంఠభరితం. అశ్వనీదత్ మాత్రం అలాగే నిబ్బరంగా, మొండిధైర్యంతో నిలబడ్డారు. తన ప్రాడక్ట్ పైన ఎనలేని నమ్మకం ఆయనకి. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో ప్రింట్లు లేటుగానైనా సెంటర్లకి చేరుకున్నాయి. కుండపోత వర్షాలతో రోడ్లు కొట్టుకుపోయాయి. బ్రిడ్జిలు కూలిపోయాయి. మొదలు విరగి చెట్లు పడిపోయి దారులున్నీ ఆటంకమయమై, జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు వైర్లు తెగిపడి బైటకొస్తే ప్రాణానికే ప్రమాదం అన్నంత భయంకరమైన వాతావరణం అంతటా అలుముకుంది. అశ్వనీదత్ బెఉవాడలో సొంత ఇంటికి వెళ్ళారు. ఇంట్లో కరెంటు లేదు. ఇప్పటి సంచలన నిర్మాతలు స్వప్నాదత్, ప్రియాంక దత్ పసిపిల్లలు. ఇంట్లో చీకటి, అశ్వనీదత్ మనసులో చిమ్మచీకటి. ఎంతైనా మానవహృదయం కదా. కొంత నిస్తేజం ఆవరించింది. నిరాశ కమ్ముకుంది. ఆ తరుణంలో ఆయనకి ధైర్యం చెప్పింది...ఎవరో కాదు. సాక్షాత్తూ ఆయన తండ్రి చలసాని ధర్మరాజుగారు. ఫరవాలేదు..ధైర్యంగా ఉండు...విజయం సాధిస్తావు అన్న తండ్రి మాటలే అశ్వనీదత్‌కి ఆ క్షణంలో కొండంత అండ.
ఇక్కడే అసలు సినిమా మొదలైంది. వర్షం లేదు, గిర్షం లేదు...తుఫాను గిఫాను లెక్కలేదు. జనం ధియేటర్‌లలో కెరటాల్లా విరుచుకుపడ్డారు. ధియేటర్లు మోకాళ్ళ లోతు నీళ్ళతో నిండిపోతే కూడా జనం కాళ్ళు మీద పెట్టుకుని మరీ సినిమా చూడ్డానికి తెగపడ్డారు. కానీ ఇంకా ఎక్కడో బిత్తరపాటు. బెంగ. అదే సమయంలో పార్టీ ప్రచార సభలలో పాల్గోంటూ, ప్రయాణంలో ఉన్న విశ్వవిఖ్యాత నిటసార్వబౌముడు, నటరత్న ఎన్టీఆర్ అశ్వనీదత్, రాఘవేంద్రరావులకు తారసపడ్డారు. బ్రదర్ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కలవరపడకండి. బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది అని ధైర్యాన్ని నింపారు ఇద్దరిలో. ఆ అమోఘవచనుడి మాటలు పొల్లుపోలేదు. అదే త్రోవలో సైకిల్ పైన అరటిగెలలు మోసుకుపోతున్న ఓ రైతు కనబడి మన సినిమా సూపర్‌హిట్ అండీ అని అరుచుకుంటూ పక్కనుంచే వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలన్నీ ఇప్పటికీ అశ్వనీదత్ మనసులో నిత్యనూతనంగా మెరుస్తుంటాయి.
సినిమా కుమ్మేసింది. దుమ్ము లేపేసింది. రికార్డులు తారుమారయ్యాయి. వసూళ్ళ మోత మోగిపోయింది. సెంటర్ సెంటర్‌కీ రికార్డులే. ధియేటర్ ధియేటర్‌కి ఒక చరిత్రే. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌తో జనం ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తుఫాను తగ్గిపోయింది. కానీ వసూళ్ళ తుఫాను మాత్రం రెండువందల రోజులకు పైబడి బాదేసింది. వైజయంతీ మూవీస్ చరిత్రకెక్కింది. అశ్వనీదత్ కల కిరీటం పెట్టుకుంది. రాఘవేంద్రరావు జీవితం మహత్తరమైన మలుపు తిరిగిపోయింది. ఎందరు వద్దన్నా దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు ఇప్పటికీ ఆయన అశ్వనీదత్‌కి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఈ రోజుకి సరింగా 33 సంవత్సరాలు ఆ జగదేకవీరుడికి, అతిలోకసుందరికి. సృష్టించిన అశ్వనీదత్‌కీ, బ్యానర్‌కీ మణిమకుటంగా నాటికీ నేటికీ నిలిచి వెలుగుతోంది జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ అనుభవం. " Written By : నాగేంద్రకుమార్ "