Gadida Guddu Kankara Peesu : గాడిద గుడ్డు కంకర పీసు
ఎవరు పుట్టించకపోతే కొత్త పదాలు ఎలా పుడతాయి అనే వారు వేటూరి సుందరరామమూర్తి గారు.

ఎవరు పుట్టించకపోతే కొత్త పదాలు ఎలా పుడతాయి అనే వారు వేటూరి సుందరరామమూర్తి గారు. ఆయన పాటల్లో అడపాదడపా కొత్త మాటలు పుట్టించి వాడేవారు, యెంగోత్రి, ఖంగోత్రి, పాలస్త్రి ఇలాంటి పదాలు ఆ కోవకే చెందుతాయి. కాలప్రవాహంలో పాత మాటలు కనుమరుగై, కొత్త కొత్త మాటలు రావడం ఆ భాష బ్రతికి బట్ట కట్టడానికి ఉపయోగ పడతాయి. అయితే కొన్ని మాటలు, పదాలు ఆధునిక కాలానికి తగ్గట్టుగా పుట్టుకొస్తుంటాయి, మరికొన్నిటిని కావాలని సందర్భానికి తగ్గటుగ్గా పుట్టుకొస్తాయి. కొన్ని మాత్రం భాష అర్ధం కాకనో, పలకడం రాకనో పుట్టుకొస్తూ ఉంటాయి. అలనాటి కోవకి చెందిందే "గాడిద గుడ్డు కంకర పీసు" అనే పదం. అసలు గాడిద గుడ్డు పెడుతుందా? పెట్టదు కదా, మరి ఆ మాట ఎలా పుట్టింది, కంకర పీసు అంటే అర్ధం ఏంటి? అసలు ఈ పదం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది తెలుసుకుందాం.
భారతదేశం మీద జరిగిన అనేక విదేశీ దాడుల్లో, సంస్కృతి తో పాటు సాహిత్యం మీద కూడా చాలా ప్రభావం పడింది. తెలంగాణ మీద ఉర్దూ ప్రభావం ఉంటె, ఆంధ్ర పైన ఆంగ్లేయుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఒక సారి ఒక ఆంగ్లేయుడు god is good, concord the piece అన్నాడట, అంటే దేవుడు మంచి వాడు, శాంతిని జయించాడు అని అతని అర్ధం, ఇది అర్ధం కానీ తెలుగు వాడు god is good కి బదులు "గాడిద గుడ్డు" concord the piece కి బదులు "కంకర పీసు" అన్నాడట, అది ఆ నోటా ఆ నోటా విస్తారంగా ప్రచారం జరిగి "గాడిద గుడ్డు కంకర పీసు" గా ప్రజాదరణ పొందింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది అని వినికిడి.
మొత్తం మీద గాడిద గుడ్డు కంకర పీసువెనుక ఉన్న కథ ఇదండీ.
Written by Merusomayajula PhaniKumar
