సంక్రాంతి నాడు ఇంటింటా సంబర వాతావరణం నెలకొంటుంది. ముగ్గులు తీర్చిన వాకిళ్ల అందాలు వర్ణనాతీతం. పసుపు మిసమిసలతో గడపలు మెరిసిపోతాయి. పచ్చని తోరణాలతో గుమ్మాలు కళకళలాడతాయి. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు. వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఈ పండుగలో ఎక్కువగా ఆ సంబంధమైన విషయాలే కనిపిస్తుంటాయి. సంక్రాంతి పండుగకు పంట ఇంటికి రావడం, ధనధాన్యాలతో ఇళ్ళన్నీ కళకళలాడుతుండటం జరుగుతుంటుంది. పండుగపూట ఉదయాన్నే లేచి అందరూ తలారా స్నానాలుచేసి కొత్తబట్టలు తొడుక్కుంటారు. పిండివంటలు […]

సంక్రాంతి నాడు ఇంటింటా సంబర వాతావరణం నెలకొంటుంది. ముగ్గులు తీర్చిన వాకిళ్ల అందాలు వర్ణనాతీతం. పసుపు మిసమిసలతో గడపలు మెరిసిపోతాయి. పచ్చని తోరణాలతో గుమ్మాలు కళకళలాడతాయి. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు. వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఈ పండుగలో ఎక్కువగా ఆ సంబంధమైన విషయాలే కనిపిస్తుంటాయి. సంక్రాంతి పండుగకు పంట ఇంటికి రావడం, ధనధాన్యాలతో ఇళ్ళన్నీ కళకళలాడుతుండటం జరుగుతుంటుంది. పండుగపూట ఉదయాన్నే లేచి అందరూ తలారా స్నానాలుచేసి కొత్తబట్టలు తొడుక్కుంటారు. పిండివంటలు మామూలే. కొత్త అల్లుళ్ల సందడి సరేసరి. బావామరదళ్ల హాస్యోక్తులు, సరదాలకు లొటుండదు. ఈ కారణంగానే గ్రామాల్లో బావామరదళ్ల సయ్యాటలతో కూడిన జానపద గీతాలు వినిపిస్తాయి. సంక్రాంతి వేడుక అంటే సరదాల వేడుక అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలీ..?

కనుమ.. ఇది ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రీతిప్రాప్తమైన పండుగ... తమకు సహకరించిన గోవులను.. పశువులను.. వ్యవసాయపనిముట్లను.. భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు.. ఆవులు, పాడిగేదెలు, కోడెదూడలు, పెయ్యలు, ఎడ్లకు కుంకుమ బోట్లు పెట్టి భక్తిచాటుకుంటారు. కొన్ని చోట్ల తప్పెట్లు తాళాలతో వీటిని ఊరేగిస్తారు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోరు. సంక్రాంతి పండుగలో అంతర్లీనంగా శాస్ర్త...సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు..జొన్నలు.. సజ్జలు.. బియ్యం వంటి ధాన్యాలు.. బీర..పొట్ల.. చిక్కుడు.. గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్ధాలను వండి తినడం ఆరోగ్యకరం.. కొంత మంది ముక్కనుమ పండుగను కూడా జరుపుకుంటారు.. ఆ ఇలా ముడునాళ్లూ.. మురిపాలతో, ముచ్చట్లతో గడిచిపోతుంది. ప్రతిఇల్లూ ఆనందాల లోగిలిగా మారిపోతుంది.

జనవరి మాసంలో వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. మంచుకురిసే వేళలో శీతగాలులు గిలిగింతలు పెట్టే కాలంలో... సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పథంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సూర్యభగవానుని అనుగ్రహం పొందిన వారికి సిరిసంపదలకు, సుఖసంతోషాలకు లోటుండదని భక్తుల భావన. తెలుగు వారు అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో ఈ పండగని సంక్రాంతి అనే పిలుస్తారు. తమిళులు పొంగల్‌ అంటారు. మహారాష్ట్రులు, గుజరాతీలు మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యాలలో లోరీ అని వ్యవహరిస్తారు. ఈ పుణ్యదినాల్లో చేసే దానాలు ఎంతో శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. ధాన్యం, పళ్లు, బట్టలు, కాయగూరలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తే మంచిదంటారు. పితృలకు తర్పణలు ఇచ్చే ఆచారమూ వుంది.

సంక్రాంతినాడు పాలుపొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్లముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం. ఒక పద్దతి ప్రకారం పెట్టే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు దర్పణం. చుక్కల చుట్టూ వేసే అల్లికలు ఆకాశంలో కనిపించే మార్పులకు సంకేతం. ముగ్గు మధ్యలో కేంద్రంగా వుండే ముద్దు సూర్యుడి స్థానానికి సూచిక. పండగ ఆఖరి రోజున రథం ముగ్గు వేయడం ఆనవాయితీ..! ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లయిన గోపికలకు సంకేతం. మధ్యలో పెద్దే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవిగా భావిస్తారు.

గంగిరెద్దుల మేళానికి ఒక పరమార్ధముంది. శివగణంతో సహా ఆ పరమశివుడు సంక్రాంతి సంబరాలకు హాజరయినట్టుగా గంగిరెద్దుని పెద్దలు వివరిస్తారు. హరిని కీర్తించే భక్తులకు హరిదాసు రాక అనేది పరమ పవిత్ర కార్యంతో సమానం. హరిదాసుని వారు సాక్షాత్‌ శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా భావిస్తారు. హరిదాసు తల మీద గుమ్మడి కాయ ఆకారంలో వుండే రాగి అక్షయపాత్ర... గుండ్రటి భూమికి సంకేతం. దాన్ని తలపై పెట్టుకోవడం ద్వారా శ్రీహరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పడంగా పెద్దలు వివరిస్తారు. "హరిలో రంగ హరీ..." అంటూ కంచుగజ్జెలు ఘల్లుఘల్లున మోగిస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసులు ఇల్లిల్లూ తిరుగుతూ పర్వదిన శోభకే వన్నె తెస్తారు.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story