సంక్రాంతి అనేది ఉమ్మడి సంస్కృతికి నిదర్శనం. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండగ. కాలగమనానికి, సూర్యభగవానుడికి సంబంధించిన సంబరం. మధుర రసాలతో జీవితం రసమయం అయ్యే పండగ. తియ్యని చెరుకుగడలతో, పాలపొంగులతో వర్ధిల్లే పచ్చని వేడుక. వుందిలే మంచికాలం ముందుముందునా అని పాడుకోనక్కరలేదు. సంక్రాంతితో అది మన నట్టింటికి వచ్చేసినట్టే. ఇది ఇటీవలి భావన కాదు. అనాదిగా వస్తున్న నమ్మకం. మన దేశానికే పరిమితం కాదు. దేశదేశాల్లోనూ వున్నదే. సూర్యభగవానుడు ఎల్లెడలా అనాదిగా ఆరాధనీయుడు. మంచు ప్రదేశాల్లో వెచ్చిన […]

సంక్రాంతి అనేది ఉమ్మడి సంస్కృతికి నిదర్శనం. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండగ. కాలగమనానికి, సూర్యభగవానుడికి సంబంధించిన సంబరం. మధుర రసాలతో జీవితం రసమయం అయ్యే పండగ. తియ్యని చెరుకుగడలతో, పాలపొంగులతో వర్ధిల్లే పచ్చని వేడుక. వుందిలే మంచికాలం ముందుముందునా అని పాడుకోనక్కరలేదు. సంక్రాంతితో అది మన నట్టింటికి వచ్చేసినట్టే. ఇది ఇటీవలి భావన కాదు. అనాదిగా వస్తున్న నమ్మకం. మన దేశానికే పరిమితం కాదు. దేశదేశాల్లోనూ వున్నదే. సూర్యభగవానుడు ఎల్లెడలా అనాదిగా ఆరాధనీయుడు. మంచు ప్రదేశాల్లో వెచ్చిన కాంతులు విరజిమ్మే దేవుడు ప్రత్యక్ష దైవంతో సమానం కనుక- ఉత్తరాయణ పథంలో ఆయన ప్రవేశం వారికి కూడా పండగే. లాటిన్‌ అమెరికాలో పురాతత్వ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో ఆరు వేల ఏళ్ల క్రితమే మయ జాతీయులు సంక్రాంతి వంటి పండగని ఘనంగా జరుపుకునే వారని తెలిసింది. ఆచార వ్యవహారాలలో, పేర్లలో కొద్దిపాటి ప్రాంతీయ వ్యత్యాసాలతో దాదాపు దక్షిణాసియాలో అనేక దేశాల్లో ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తారు. నేపాల్‌లోని థారూ ప్రజలు ఈ పండగని మాఘీగా, ఇతరులు మాఘే సంక్రాంతిగా జరుపుకుంటారు. ధాయ్‌లాండ్‌లో జరిగే సోంగ్‌క్రాన్‌, లావోస్‌లో జరిగే పి మ లావో, మయన్మార్‌లో జరిగే థింగ్‌యాన్‌, కంబోడియాలో నిర్వహించే మోహ సంగ్‌క్రాన్‌ పండగ వంటివి సంక్రాంతి వేడుకలే. ఇక ఉత్తరభారతంలోని అస్సాంలో మాఘ్‌ బిహు లేదా భోగలీ బిహూ అని, కశ్మీర్‌లో శిశుర్‌ సంక్రాంత్‌ అని వ్యవహరిస్తారు. ఇక సంక్రాంతి పురాణ ప్రాశస్త్యం విషయానికి వస్తే సంక్రాంతి పర్వదినాలలో మహావిష్ణువు రాక్షసులని హతమార్చి, వాళ్ల శిరస్సులు మంధర పర్వతం కింద పాతిపెట్టి దేవతలకి సుఖసంతోషాలు సమకూర్చిపెట్టాడట. అందుకే ఈ పండుగని అశుభాలకి స్వస్తిగా, శుభాలకి స్వాగతంగా భక్తులు విశ్వసిస్తారు. భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసింది కూడా సంక్రాంతినాడేనట. అందుకే గంగ సముద్రంలో సంగమించే స్థలంలో మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పితృదేవతలకి తర్పణలిస్తారు.

సంక్రాంతి సమయంలో సూర్య భగవానుడిని ఆరాధించడం మన దేశపు అతి ప్రాచీన సంప్రదాయం. ఈ సందర్భంగా జరిగే వ్యవసాయ సంబంధిత సామాగ్రికి పూజలు చేయడం.. ఎడ్ల పందాలను నిర్వహించడం.. భోగిమంటలు వేయడం ఇలాంటివి ఇప్పటి రూపంలో కాకపోయినా అప్పట్నుంచే ప్రారంభమై ఆనవాయితీగా వస్తున్నాయి.. క్రమ క్రమంగా పంటలు చేతికొచ్చే పుష్యమాసంలో జరిగే ఉత్సవాల రూపాంతరమే సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికత, జీవన సార్థకత, శాంతిసౌఖ్యాలు, అఖండ ఐశ్వర్యాలకు ఆలవాలం మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మానవాళి అంతరాంతరాల్లో, అంతరాత్మ అనే ప్రమిదలో దీపంగా ప్రజ్వలించే రోజులు. సూర్యుడు వివేకానికీ, విజ్ఞానానికి ప్రతీక. మనిషిలో అంతర్జ్యోతిని వెలిగించుకుని అజ్ఞానాంధకారంలోంచి బయట పడాలన్నది ఈ పండగ ప్రధాన సందేశం అని వివేకానందుడు చెప్పాడు. సూర్యారాధన ఒక్క మన భారతావనిలోనే కాదు.. ప్రపంచమంతటా కనిపిస్తుంది.. మహోజ్వలంగా వెలుగొందిన అన్ని ప్రాచీన నాగరికతల్లోనూ సూర్యారాధన కనిపిస్తుంది.. అంతకు ముందు ఆదిమవాసులు సూర్యడిని గొప్ప వేటగాడి రూపంలో పూజించారు.. ఎన్నో దేశాలు.. రాజవంశాలు సూర్యడి పేరుతో అవతరించాయి.. శ్రీరామచంద్రుడు సూర్యవంశపు రాజే! ఈజిప్టు.. జపాన్‌...మెక్సికో.. పెరూ..మెసపోటేమియా మొదలైన దేశాలలో సూర్యుడిని భగవంతుడి స్వరూపంగా కొలుస్తారు.. మనక్కూడా ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడేగా! సంక్రాంతిని గ్రీకులు బేకస్‌ అని పిలుచుకుంటే రోమన్లు బ్యాకన్‌ అని అంటారు.

సంక్రాంతి ధర్మాలతో పాటు వైద్య ధర్మాలను కూడా మనకు బోధిస్తుంది. ధనుర్మాసంలో ఉదయాన్నే పొంగలి తినడం కూడా ఆరోగ్య సూత్రమే! చలికాలంలో చలికి శరీరంలోని చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. అంచేత శరీరంలోని వేడి బయటికి వెళ్లే మార్గం లేక జీర్ణ కోశాన్ని చేరుతుంది.ఫలితంగా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.. అంతేకాకుండా పగటి కంటే రాత్రి హెచ్చు కావడం వల్ల రాత్రి చేసిన భోజనం త్వరగా జీర్ణమైపోతుంది.. అందుకే ఉదయానికల్లా ఆకలి వేస్తుంది...అప్పుడు ఆహారం తీసుకోకపోతే రోగాలు రావడం ఖాయం.. అందుకే భక్తి పేరు చెప్పి ప్రసాదం పేరుతో ఉదయాన్నే పొంగలి పంపకం జరుగుతుంటుంది. భోగి రోజు నువ్వు పిండిని వంటికి పట్టించుకుని పిడుకల మంట దగ్గర శరీరాన్ని కాచుకుంటే చర్మం మెత్తదనం సంతరించుకుంటుంది. కఫం నశిస్తుంది.. గోధుమలు...మినుములు వంటి ధాన్యాలతో చేసిన వంటకాలను తినడం వల్ల వాతం హరించుకుపోతుంది. శరీరానికి బ్రహ్మతేజస్సు లభిస్తుంది..

Updated On 7 Feb 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story