సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ. పెద్దల పండుగ. పశువుల పండుగ...పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీరను కట్టుకుని, బంతి చేమంతులను జడలో తురుముకుని ..రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడని కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే […]

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ. పెద్దల పండుగ. పశువుల పండుగ...పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీరను కట్టుకుని, బంతి చేమంతులను జడలో తురుముకుని ..రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడని కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే మనిషి జీవితం బహు ముఖాలుగా, బహు విధాలుగా వికసించింది. అభ్యున్నతి దిశగా అడుగులు వేసింది. దీనంతటికి కారణం సూర్యుడు. సూర్య భగవానుడే మనకు జీవాధారం. సమస్త జీవరాశికి, వృక్షజాతి మనుగడకు ఆయనే కారణం. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటాం. ఏడాదిలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ నెలలో ప్రవేశించేది మకర రాశిలోకి. అందుకే ఇది మకర సంక్రాంతి అయ్యింది. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం ఉత్తరాయణానికి నాంది. ఇది పుణ్యప్రదం కూడా. అందుకే మకర సంక్రాంతి శుభవేడుకగా మారింది.

సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో ముందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది. సంక్రాంతి కాంతి నిచ్చే పండగ. అందాల పండగ. ఆనందాల పండగ. పతంగుల పండగ. ముగ్గుల పండగ. గొబ్బెమ్మల పంగడ. హరిదాసుల పండగ. గంగిరెద్దుల పండగ. పాటల పండగ. జానపదాల పండగ. జనపదాల పండగ. సర్వశుభాలను కలిగించే పండుగ. శోభాయమాన పండుగ. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. .ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణకథనం. వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈ రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడట. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది.

సంక్రాంతి వేడుక నిజంగా కనుల పండుగ. ఈ రోజుల్లో స్త్రీలు తెలవారుజామున లేచి వాకిళ్లలో ముగ్గులు పెడతారు. వాటి చుట్టూ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. వేకువజామున సాతాని జియ్యర్లు, జంగమదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. దీవెనలందిస్తారు. ఇలా పర్వదినాలన్నీ ఇలా సంబరాల పర్వంలా గడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నీలాకాశాన్ని పంతంగులు రంగుల హరివిల్లులా మార్చేస్తాయి. కనువిందుచేస్తాయి.

ఈ పండుగకి లక్ష్మీదేవికి సంబంధం వుందని ఒరిస్సా ప్రజల నమ్మకం. ఈ శుభదినాల్లో పేదలకు వరాలిస్తూ ఆమె దళితుల ఇళ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెని వెలివేశాడట. అయినా లక్ష్మిదేవి లెక్కచేయలేదు. ఈ మార్గశిర, పుష్యమాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు కురిపించిందట. అందువల్లనే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ముంగిలిలోనూ రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఆమె మెత్తని పాదాలు కందిపోకుండా వుండటానికి ఆవుపేడ ముద్దలపై తామరలు, గుమ్మడి పువ్వులు అమరుస్తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని పూజించటం కూడా ఆనవాయితీ. గొబ్బి లక్ష్మి అంటే భూమాతే! ఆమెను కొలిస్తే సస్యాలను ప్రసాదిస్తుందని జనుల విశ్వాసం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథనం. ఒక్కో విధానం. భోగి రోజున ఇళ్లముందు, కూడళ్లలోనూ భోగిమంటలు వేస్తారు. విరిగిన కొయ్యలు, పాత చెక్క సామాన్లు మంటల్లో వేస్తారు. చిన్నారులు భోగిదండలు వేసి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చలినుంచి తరిమేసి వెచ్చని గాలుల్ని ఆహ్వానిస్తారు. నవ్యతకు నాంది పలకడటానికి ఇది చక్కటి ప్రతీక. భోగి పండుగ నాడు సాయంత్రం చిన్న పిల్లలకు రేగుపళ్లు, చిల్లర నాణాలు, శనగలు, పువ్వులు వంటివన్నీ కలిపి భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు పిల్లలపై పోస్తే విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని ఓ నమ్మకం. భోగభాగ్యాలను స్వాగతించే ఆకాంక్షకి ఈ వేడుక అద్దంపడుతుంది. ఇదేరోజున వైష్ణవాలయాలలో గోదాదేవి కల్యాణం జరుగుతుంది.
ఊళ్లలో కోళ్ల పందాలు ఊపందుకుంటాయి. పొట్టేళ్ల పందాలు పోటాపోటీగా జరుగుతాయి.

Updated On 7 Feb 2023 8:32 AM GMT
Ehatv

Ehatv

Next Story