చోద్యం కాకపోతే గడ్డం(beard) పెళ్లికి అడ్డం పడటమేమిటి? ఎక్కడైనా జరుగుతుందా ఈ విడ్డూరం అని అనుకోకండి. తమిళనాడులోని(tamilnadu) కోయంబత్తూరు(Coimbatore) నగరంలో ఇదే జరిగింది. గడ్డమే ఓ పెళ్లిని అడ్డుకుంది. పాపం తన గడ్డం కారణంగా పెళ్లి ఆగిపోతుందని వరుడు కలలో కూడా అనుకుని ఉండడు. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడుకి మూడు ముళ్లు వేసే అదృష్టం లేకుండా చేశాడు వరుడి తండ్రి.
చోద్యం కాకపోతే గడ్డం(beard) పెళ్లికి అడ్డం పడటమేమిటి? ఎక్కడైనా జరుగుతుందా ఈ విడ్డూరం అని అనుకోకండి. తమిళనాడులోని(tamilnadu) కోయంబత్తూరు(Coimbatore) నగరంలో ఇదే జరిగింది. గడ్డమే ఓ పెళ్లిని అడ్డుకుంది. పాపం తన గడ్డం కారణంగా పెళ్లి ఆగిపోతుందని వరుడు కలలో కూడా అనుకుని ఉండడు. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ వరుడుకి మూడు ముళ్లు వేసే అదృష్టం లేకుండా చేశాడు వరుడి తండ్రి. అసలేం జరిగిందంటే కోయంబతూరు నగరంలోని సూలూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కూమారుడిని పెళ్లి ఏర్పాట్లు చేశాడు. మూడు నెలల కిందట పొల్లాచ్చికి చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. అప్పట్నుంచి రెండు కుటుంబాలవారు పెళ్లి పనుల్లో పడ్డారు. కాబోయే భార్యాభర్తలు కూడా రోజూ ఫోన్‌లో ముచ్చటించుకునేవారు. గడ్డం చేసుకునేంత తీరిక లేదో, లేకపోతే అదో ఫ్యాషనో తెలియదు కానీ వరుడెప్పుడూ గడ్డంతోనే కనిపించేవాడు.
పెళ్లినాటికి క్లీన్‌గా షేవ్ చేసుకోవాలని తండ్రి గట్టిగానే సూచించాడు. సోమవారం పెళ్లి కాబట్టి తండ్రి ఆదేశాల మేరకు వరుడు సెలూన్‌కు వెళ్లాడు. నీట్‌గా గడ్డం చేసుకుందామనుకున్నాడు. ఏమైందో ఏమో కానీ గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. కొడుకును అలా చూసిన తండ్రికి బాగా కోపం వచ్చేసింది. షేవింగ్ ఎందుకు చేసుకోలదని నిలదీశాడు. 'గడ్డంతోనే బాగుంటావు.. కాస్త ట్రీమ్ చేసుకుని పెళ్లి పీటలు ఎక్కితే చాలు' అని కాబోయే భార్య వరుడికి చెప్పిందట! పాపం ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడు..అది విని తండ్రికి ఇంకా కోపం వచ్చింది. 'ఠాట్.. ఇప్పుడే నా మాట వినకుండా అయ్యావు.. నా కంటే నీకు ఆమె ఎక్కువయ్యింది' అంటూ కొడుకును గట్టిగా తిట్టాడు. గడ్డం పూర్తిగా తీస్తేనే పెళ్లి, లేకపోతే లేదు అని చెప్పేశాడు. ఇదెక్కడి గోలరా భగవంతుడా అని తల పట్టుకున్నాడు వరుడు. కాబోయే భార్య మాట వినడమా? పెంచి పెద్దచేసిన తండ్రి మాట వినడమా? ఎటూ తేల్చుకోలేక తెగ వర్రీ అయ్యాడు వరుడు.
తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఈ ఒక్కసారికి ఒప్పేసుకో నాన్న అని బతిమాలాడు. తండ్రి ఇగో సంతృప్తి చెందలేదు. మాటంటే మాటే అనేశాడు. సోమవారం జరగాల్సిన తన కొడుకు పెళ్లి ఆగిపోయిందని, ఎవరూ రావాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో ప్రకటించేశాడు. ఇది కాస్తా వధువు కుటుంబానికి తెలిసిపోయింది. వారంతా పరుగు పరుగున వరుడి ఇంటికి వచ్చారు. వారిని కూర్చోబెట్టి జరిగిదంతా వివరించాడు వరుడి తండ్రి. పాపం వారు కూడా తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ రాతి గుండె అసలు కరగలేదు. ఓ మెట్టు దిగే ప్రయత్నం చేయలేదాయన! దాంతో పెళ్లి కాస్త ఆగిపోయింది. కాబోయే వియ్యంకుల వారిని మనసులోనే తిట్టుకుంటూ వెళ్లిపోయారు వధువు తరపు బంధువులు. తన కంపెనీలో పని చేసేవారు గడ్డం పెంచితేనే తాను ఊరుకోనని, అలాంటిది కొడుకు పెంచితే ఎలా ఊరుకుంటానని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తనను పలకరించడానికి వచ్చిన వారికి చెబుతున్నాడా పారిశ్రామికవేత్త!