Easterlink Hotel : చూట్టానికి పెద్ద హోటల్‌లా కనిపిస్తుంది కానీ.. ఒక్క గది కూడా ఉండదు
ఆస్ట్రేలియాలోని(Australia) మెల్‌బోర్న్(Melbourne) నగర శివారులో రోడ్డుకు ఆనుకునే ఓ పెద్ద భవంతి ఉంది.. అటుగా వెళుతున్న వాహనదారులకు అదో హోటల్‌లా అనిపిస్తుంది. అలాగే కనిపిస్తుంది కూడా! ఆ పెద్ద హోటల్‌లో బస చేద్దామనే కోరిక కలుగుతుంది. దాని గురించి నెట్‌లో వెతికితే ఎలాంటి సమాచారం దొరకదు.
ఆస్ట్రేలియాలోని(Australia) మెల్‌బోర్న్(Melbourne) నగర శివారులో రోడ్డుకు ఆనుకునే ఓ పెద్ద భవంతి ఉంది.. అటుగా వెళుతున్న వాహనదారులకు అదో హోటల్‌లా అనిపిస్తుంది. అలాగే కనిపిస్తుంది కూడా! ఆ పెద్ద హోటల్‌లో బస చేద్దామనే కోరిక కలుగుతుంది. దాని గురించి నెట్‌లో వెతికితే ఎలాంటి సమాచారం దొరకదు. పోనీ డైరెక్ట్‌గానే బుకింగ్ చేసుకుందామని దగ్గరకు వెళితే అసలా హోటల్‌కు ఎంట్రీనే ఉండదు. దూరం నుంచి చూస్తే పెద్దగా కనిపించే హోటల్ దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం చాలా చిన్నగా కనిపిస్తుంది. మనల్ని తికమక పెట్టేస్తుంది.
ఆ ఉత్తుత్తి హోటల్ పేరు ఈస్ట్ర్‌లింక్(Easterlink). దూరం నుంచి చూసే పర్యాటకులకు అది నిజమైన హోటల్‌లా గోచరిస్తుంది. రాత్రివేళలో అయితే గదులలో టూరిస్టులు బస చేస్తున్నారనడానికి నిదర్శనంగా అందులోని కొన్ని కిటికీల లైట్లు వెలుగుతూ ఉంటాయి. దగ్గరకు వెళ్లి చూస్తే మాత్రం భంగపాటు తప్పదు.
ఎందుకంటే అక్కడ బోర్డు తప్ప హోటల్ అంటూ ఏదీ లేదు. నాలుగు గోడల నిర్మాణం ఉంటుందంతే! లోపలికి వెళ్లడానికి మార్గం కూడా ఉండదు. పైన మాత్రం సౌర ఫలకాలను అమర్చారు. రాత్రిళ్లు ఆ దారి గుండా వెళ్లే వారికి అది హోటల్‌లా కనిపించడానికి ఉత్తుత్తి కిటికీల్లోని లైట్లను సౌర విద్యుత్ శక్తితో వెలిగిస్తారు. మన ఆనంద్‌సాయి వేసే సినిమా సెట్‌లాగే ఉంటుంది. కేవలం వినోదం కోసమే ఆ భవంతిని నిర్మించారు. చుట్టుపక్కల నిర్మాణాలేవీ లేకపోవడంతో ఆ హోటల్ అందరినీ ఆకర్షిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కట్టిన ఈ ఉత్తుత్తి హోటల్‌ను కెనడాకు చెందిన క్యామ్ మోర్టాన్(callum Morton) డిజైన్ చేశారు. దీనిని నిర్మించడానికి 1.2 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ఖర్చు అయ్యాయి. మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు ఏడు కోట్ల రూపాయలు. నిర్మాణంలో కాంక్రీట్, ఇనుము వినియోగించారు. ముందు భాగం ఆకర్షణగా ఉండటానికి గాజు గ్లాసులను అమర్చారు. 2007 నుంచి మోటార్ వే పై ప్రయాణించేవారిని బోల్తా కొట్టిస్తోంది ఈ హోటల్. దూరం నుంచి హోటల్‌ను చూస్తే ఒక్క గది దొరికితే చాలు .. కాసేపు విశ్రమించవచ్చని అనిపిస్తుందెవరికైనా! అన్నట్టు ఈ భవనం కేవలం 20 మీటర్ల ఎత్తు, 12 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల మందం మాత్రమే ఉంటుంది.