భారత దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
భారత దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా(Odisha), ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయం తెలంగాణ(Telangana)లో చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. హైదరాబాద్‌లో ఉదయం ఆఫీసుకు వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక భయపడిపోయారు. హైదరాబాద్‌లోనే కాదు, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్(ap)లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు.ఉదయం 7:27 గంటలకు తెలంగాణలోని ములుగులో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
ఇంతకు ముందు, అంటే 2024 మార్చి 14న ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా పేర్కొంది. ఇది రిక్టర్ స్కేలుపై 3.9 గా అప్పుడు చెప్పింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది. అలాగే 2022లో అక్టోబరు 12న రాత్రి ఆదిలాబాద్‌లో భూమి కంపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్లో భూమి షేక్ అవ్వడంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. ఉట్నూర్లోని, వజీర్ పురా, మోమిన్ పురా, ఫకిర్ గుట్టా ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. రాత్రి 11:12 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. 2022, జులై 13వ తేదీన నెల్లూరు, కడప జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5.20గంటలకు 3 సెకన్లపాటు భూమి కంపించింది. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చింది.
2021 అక్టోబర్‌లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం 6:49 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామగుండం, జగిత్యాల జిల్లాలలో ప్రకంపనలు వచ్చాయి. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 3 సెకన్లు భూమి కంపించింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా 2021, జులై 26వ తేదీన భూ కంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్, ఉప్పునూత మండలాల్లో ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. 2021 జులైలో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అర్థరాత్రి భూకంపనలు భయపెట్టాయి. అర్థరాత్రి వేళ జనం భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకన్ల పాటు భూమి కదిలింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడం ఏం జరుగుతోందో అర్థంకాక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.