ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సంభాల్ జిల్లాలో ఉన్న ఆలూ కోల్డ్‌స్టోరేజ్ పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. చాందౌసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్‌స్టోరేజ్ పై కప్పు కూలుతున్న సమయంలో లోపల ఆలూ బస్తాలను అన్‌లోడ్ చేస్తున్న పనివాళ్లు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సంభాల్ జిల్లాలో ఉన్న ఆలూ కోల్డ్‌స్టోరేజ్ పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. చాందౌసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరా రోడ్డులో ఉన్న ఈ కోల్డ్‌స్టోరేజ్ పై కప్పు కూలుతున్న సమయంలో లోపల ఆలూ బస్తాలను అన్‌లోడ్ చేస్తున్న పనివాళ్లు ఉన్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది 24 మందిని ఎలాగోలా ఆలూ బస్తాల నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇందులో 14 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులు ఉన్న ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి చికిత్స కోసం 50 వేల రూపాయలు వెంటనే మంజూరు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఓ కమిటీని వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న వారిలో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరు ప్రథమ చికిత్స తీసుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బంగాళదుంపలు నిల్వచేసే ఈ కోల్డ్ స్టోరేజ్‌ను మూడు నెలల కిందటే నిర్మించారట. ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు లేకుండానే దీనిని నిర్మించారని పోలీసులు అంటున్నారు. పైగా కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీకి మించి బంగాళదుంప బస్తాలు నిల్వ చేశారట! బహుశా ఇదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.