రాజకీయాల్లోకి రావడంపై అల్లు అర్జున్ క్లారిటీ..!

తెలుగురాష్ట్రాల్లో ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పుష్ప-2తో జాతీయవ్యాప్తంగా ఫేమస్ అయిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. ప్రత్యక్ష రాజకీయాలకు అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంది. కానీ అల్లు అర్జున్ మామ గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అవసరమైన సలహాలు, సూచనల కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో ఓ పారిశ్రామిక వేత్త కూడా పాల్గొన్నట్లు తెలిసింది. ఈ భేటీలో అల్లు అర్జున్‌కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేశారని సమాచారం. ఈ వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్ ఎగ్జిస్టింగ్ పార్టీలో చేరుతారా లేదా కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలు అని అల్లు అర్జున్ టీం కొట్టిపారేసింది. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. మీడియా మిత్రులు కూడా అధికారిక సమాచారం మేరకే వార్తలు రాయాలని కోరింది అల్లు అర్జున్ టీం.
