నిద్రపోండి... 10 లక్షల రూపాయల స్టైఫండ్ పొందండి..!
చాలా మందికి ఆఫీసుకు రాగానే ఆటోమాటిక్‌గా నిద్ర(sleep) ముంచుకొస్తుంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరీనూ! కాసేపు కునుకు తీస్తే బాగుండనిపిస్తుంటుంది. అలా చేస్తే ఉద్యోగం ఊడుతుంది కదా! నిద్రపోతున్నా జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉంటే బాగుంటుంది కదా ! హాయిగా నిద్రపోయినా జీతం ఇచ్చే జాబ్ ఒకటి ఉంది. అలాంటి జాబ్‌ను వేక్‌ఫిట్(Wakefit) సంస్థ ఆఫర్ చేస్తోంది. ఏం చేయనక్కర్లేదు. రోజుకు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోతే చాలు.. ఏడాదికి 10 లక్షల రూపాయల వరకు స్టయిఫండ్ ఇస్తామని అంటోందా ప్రముఖ మ్యాట్రెస్(Wakefit Matress) సంస్థ. నిద్రపోవడానికి పరుపు కూడా కంపెనీనే ఇస్తుందట! ఈ మేరకు ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. రెండు నెలల పాటు ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌ను వర్క్ ఫ్రమ్ బెడ్ నుంచే హాయిగా చేయవచ్చు. ఈ ఉద్యోగానికి పెద్దగా క్వాలిఫికేషన్లు గట్రాలు అవసరం లేదు కానీ, రోజుకు 8 నుంచి 9 గంటల పాటు చక్కగా నిద్రపోవాలి. మధ్యాహ్నం సమయంలో ఓ 20 నిమిషాల పాటు చిన్న కునుకు తీయాలి. వారాంతంలో వీలైతే ఇంకాస్తా ఎక్కువ సేపు పడుకోవాలి. స్లీప్ మెంటార్స్ నిర్వహించే వర్క్‌షాపులకు హాజరవ్వాలి. నిద్రలో 22 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు. సెలెక్ట్ అయ్యే ఇంటర్న్‌కు లక్ష రూపాయలు, స్లీప్ చాంపియన్‌గా ప్రమోట్ అయ్యేవారికి ఏడాదికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అయితే వేక్‌ఫిట్ లింక్‌డ్‌ఇన్ పేజీ ద్వారా అప్లై చేసుకోండి!