Happy Earth Day 2023 : పుడమితల్లి (ని) వేదన.. ప్రపంచ భూమి దినోత్సవం 2023..
ధరణీమాత భగభగమండుతోంది. కన్నబిడ్డలు చేస్తోన్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. అభివృద్ధి పేరుతో చేస్తోన్న అరాచకాలను తట్టుకోలేకపోతోంది. కాపాడమని ఆర్థిస్తోంది. ఉపేక్షిస్తే ఆ తల్లి మహోగ్రరూపం దాలుస్తుంది. అప్పుడంతా ప్రళయమే. ఆ విలయాట్టహాసంలో మాడిమసవ్వాల్సిందే. భూమి పెడబొబ్బలు పెడుతోంది. మనకు వినబడదు.వాహనాల రొద వాటిని మింగేస్తోంది. ధరణి కన్నీరు కారుస్తోంది. మనకు కనబడదు. ఫ్యాక్టరీల పొగమబ్బులు కమ్ముకున్నాయి.
ధరణీమాత భగభగమండుతోంది. కన్నబిడ్డలు చేస్తోన్న అకృత్యాలు భరించలేక ఆవేదన చెందుతోంది. అభివృద్ధి పేరుతో చేస్తోన్న అరాచకాలను తట్టుకోలేకపోతోంది. కాపాడమని ఆర్థిస్తోంది. ఉపేక్షిస్తే ఆ తల్లి మహోగ్రరూపం దాలుస్తుంది. అప్పుడంతా ప్రళయమే. ఆ విలయాట్టహాసంలో మాడిమసవ్వాల్సిందే. భూమి పెడబొబ్బలు పెడుతోంది. మనకు వినబడదు.వాహనాల రొద వాటిని మింగేస్తోంది. ధరణి కన్నీరు కారుస్తోంది. మనకు కనబడదు. ఫ్యాక్టరీల పొగమబ్బులు కమ్ముకున్నాయి. నేలతల్లి బతిమాలుతోంది. మనకు పట్టదు. మన కాళ్లకింద వెయ్యి టన్నుల న్యూక్లియర్ బాంబులున్నాయి. వందల కొద్ది హైడ్రోజన్ బాంబులున్నాయి. అవి ఏ క్షణంలోనైనా పేలవచ్చు. అదే జరిగితే భూమ్మీదున్న సమస్త జంతుజాలము, చెట్లు చేమలు నాశనమవుతాయి. భూమి ఓ మరుభూమిగా మారిపోతుంది. నివాస యోగ్యంగా లేని గ్రహంగా మిగిలిపోతుంది. సూర్య కుటుంబంలోని మిగతా గ్రహాల్లా మారిపోతుంది. ఇది మండిపోతున్న ధరణి భవిష్యవాణి...
మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ వున్న భూమాతను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాం? ఎంతగా బాధిస్తున్నాం? కడుపారా పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దుతున్నాం. అభివృద్ధి పేరుతో నాగరీకులమైన మనం అనాగరికంగా ప్రవర్తిస్తున్నాం. మనం చేసే తప్పిదాలకు ప్రకృతి పగబట్టింది. ప్రతీకారం తీర్చుకోడానికి సంసిద్ధమవుతోంది. అప్పుడప్పుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నా అదిచ్చే ప్రమాద సంకేతాలను గుర్తించలేకపోతున్నాం. కరువు కాటకాలు, వరదలు, పెను భూకంపాలు, మంచు తుఫాన్‌లు, సుడిగాలులు, జడివానలు ఇవన్నీ అవే. ప్రతి సంవత్సరం కోటి హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో అడవులు అంతరించిపోతున్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి చెప్పిన మాట. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను నదీనదాల్లోకి వదిలేస్తున్నాం. దాని వల్ల సముద్రాలు కూడా కలుషితమవుతున్నాయి. మితిమీరిన ప్లాస్టిక్‌ను వాడేస్తున్నాం. ఇది పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం 2040 నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది. భూమి భగభగమండే రోజులు దగ్గరపడ్డాయి. దానికి కారణం మనం. అవును మనమే. ఒకప్పుడీ ధాత్రి ఎంత అందంగా వుండేది? పచ్చటి అడవులతో, పారే సెలయేళ్లతో, నదీనదాలతో, కొండ కోనలతో మిగతా గ్రహాలకు కళ్లు కుట్టేంతగా, కుళ్లు పడేంతగా. మరిప్పుడు.? అడవులు అంతరిస్తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదీనదాలు చిక్కి శల్యమైపోతున్నాయి. సెలయేళ్లు కాలుష్యమవుతున్నాయి.
మంచు యుగంలో భూమంతా మంచే! వాతావరణంలో సహజంగా వున్న గ్రీన్‌హౌస్ వాయువులైన కార్బన్‌డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల కారణంగానే భూమి క్రమంగా వేడెక్కింది. జీవం పుట్టింది. అభివృద్ధి చెందింది. మనిషైంది. ఆ మనిషి తెలివి మీరాడు. నాగరికత నేర్చాడు. తన నుంచి ఉద్భవించిన మనిషిని ముచ్చటపడింది భూమాత. ఇప్పుడు అదే మనిషిని చూసి భోరున విలపిస్తోంది. కారణం గ్లోబల్ వార్మింగ్. సహజసిద్ధంగా వెలువడే గ్రీన్‌హౌస్ వాయువులు భూమ్మీద ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు ఉత్పత్తి చేసే రేడియో ధార్మికతను తగ్గించి టెంపరేచర్‌ను కంట్రోల్ చేస్తాయి. నాగరికత నేర్చిన మానవుడు గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదిలేస్తున్నాడు. ఫ్యాక్టరీల పొగగొట్టాలు, వాహనాలు, విద్యుదోపకరణాలు విడుదల చేసే వాయు కాలుష్యం కారణంగానే వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం రెట్టింపైంది. ఓజోన్ పొర పలుచపడుతోంది. ఉష్టోగ్రతలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో పెరుగుతున్న కర్బన తీవ్రత పర్యావరణ వేత్తలను బెంబేలెత్తిస్తోంది. గడచిన ఆరున్నర లక్షల సంవత్సరాలలో ఇంత కర్బన తీవ్రత లేదంటే ప్రస్తుత పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిందే.
పారిశ్రామికీకరణ జరగక ముందు వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్ ఘనపరిమాణం 280 పార్ట్స్ పర్ మిలియన్. అది క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే లెవల్లో పెరిగితే ఈ శతాబ్దాంతానికి గరిష్టంగా 1260కి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు సైంటిస్టులు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానవాళి తట్టుకోగల అత్యధిక కర్బన పరిమాణం 550 పార్ట్స్‌పర్ మిలియన్ మాత్రమే. ఈ లెక్కలు వింటే వెన్నులో సన్నటి వణుకురాలేదూ! వంటినిండా చెమటలు పట్టలేదూ! నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. మనిషి చేజేతులా అంతాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. తను అంతమవ్వడమే కాకుండా ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నాడు.
ప్రకృతి గతి తప్పితే అంతా వినాశనమే. రుతువులు మారతాయి. కాలాలు కనుమరుగవుతాయి. వేసవి మండిపోతుంది. కురిస్తే కుండపోత. లేకుంటే లేదు. రుతుపవనాల జాడ వుండదు. శీతాకాలంలోనూ వేడి గాలులు వీస్తాయి. ఊహించని విధంగా తుఫానులు విరుచుకుపడతాయి. తరచుగా భూకంపాలు పలకరించి వెళుతుంటాయి. వరదలు ముంచెత్తుతాయి.మొత్తానికి భూమి ప్రళయభీకర రూపం దాలుస్తుంది. వాతావరణంలో ఇప్పటికే కార్బన్‌డై యాక్సైడ్ వాయువు గాఢతలు పెద్ద ఎత్తున చేరాయి. ఆర్కిటిక్ ప్రాంతాన్నే తీసుకుంటే ఇక్కడ కొన్నిమీటర్ల మందంతో కొన్నేళ్లపాటు ఘనీభవించిన మంచు నెమ్మదిగా కరిగిపోతోంది. దీనికి కారణం వాతావరణం వేడెక్కడమే. మంచు కరిగితే నష్టం ఏంటి...అంటే చాలానే ఉంది. మంచుకు కర్బనాన్ని బంధించేగుణం ఉంటుంది. మంచు కరగడం వల్ల కర్బనం గాలిలోకి విడుదల అవుతుంది. అలా విడుదలయిన కర్బనం ఇంకా వేడిని పెంచుతుంది. దీంతో మంచు కరిగే వేగం పెరుగుతుంది. ఇదంతా ఓ సైకిల్. ఒక ఏడాదిని మించి మరో ఏడాది ఎండలు తీవ్రత రికార్డుకెక్కుతోంది. దీనికి కారణం ఆర్కిటిక్ సముద్రంలో హిమానీ నదుల వైశాల్యం తగ్గిపోవడమేననేది సైంటిస్టుల అభిప్రాయం. ఈ ప్రభావం ఒక్క ఉష్ణమండల ప్రాంతాల్లోనే కాదు మిగిలిన చోట్ల కూడా ఉంటుంది.
భూమిని ఒక్కటిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందు గ్రహవాతావరణాన్ని , శిలావరణాన్ని, జలావరణాన్ని, అతిశీతలావరణాన్ని, జీవావరణాన్ని అన్నిటిని విడివిడిగా, మొత్తంగా అర్థం చేసుకోవాలి. భూమి జీవమనుగడ సామర్థ్యం కలిగిన ఒకేఒక గ్రహం. ఒక అంచనా ప్రకారం గడచిన 50 సంవత్సరాలలో ప్రపంచ జనాభా రెండింతలైతే పంటపొలాలు మూడింతలయ్యాయి. అలాగే ప్రజల ఆర్థిక ఆదాయం ఏడురెట్లు పెరిగింది. మరి ఇంత ప్రగతితో రాబోయే కాలంలో భూమి ఎలా మనుగడ సాగిస్తుందనే సందేహానికి భూవిజ్ఞానశాస్త్రం తనదైన అధ్యయనంతో సమాధానాలు, ప్రత్యామ్నాయాలను రాబట్టవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఒక్క అమెరికాలోనే వాతావరణం, ప్రకృతివిపత్తులు, రోదసీ స్థితిగతులు లాంటి అంశాలకోసం ఏటా మూడు ట్రిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని చెబుతున్నారు. ఇది ఆ దేశ ఆర్థక వ్యవస్థలో దాదాపు మూడో వంతు. దీనిని బట్టి భూమి అధ్యయనానికి ఎంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
జరుగుతున్న పరిణామాలకు బాధ్యులుగా అన్ని దేశాలు అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలనే చూపిస్తున్నాయి. గత రెండొందలేళ్లలో వాతావరణాన్ని కలుషితం చేయడంలో 83శాతం పాపం అభివృద్ధి చెందిన దేశాలదే అంటున్నాయి.
ఏటా వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌డైయాక్సైడ్ పరిమాణంలో అమెరికా వాటా 25 శాతం అని లెక్కలు గడుతున్నారు. గడిచిన రెండు వందల ఏళ్లలో వాతావరణాన్ని కలుషితం చేయడంలో 83శాతం వాటా అభివృద్ధి చెందిన దేశాలదే. అయితే ఎఫెక్ట్ మాత్రం పేదదేశాలపై పడుతోంది. ఈ విషయంమీదనే 1997లోనే జపాన్‌లోని క్యోట్యోలో తీవ్ర చర్చ జరిగింది. ఆ నగరం పేరుమీదే క్యోట్యో ఒప్పందం కూడా చేసుకున్నాం. సమస్య తీవ్రతను 169 దేశాలు గుర్తించాయి. మళ్లీ 2015లో పారిస్‌లో ప్రపంచ దేశాలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం అయితే చేసుకున్నాయి కానీ అమలు మాత్రం చేయడం లేదు. అగ్రదేశాల నుంచి స్పందన రావడం లేదు. గ్లోబల్‌వార్మింగ్‌ను ఎదుర్కొనే బాధ్యత ఒక్క ప్రభుత్వానిదో, ఒక్క సంస్థదో కాదు. అందరిదీ. పౌరులు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. భూగోళాన్ని రక్షించుకోడానికి నడుం బిగించాలి. మనవంతుగా మనం చేయాల్సిన పనులు చేయాలి. కాలుష్యాన్ని నియంత్రిచాలి.
ఉదాహరణకు....ప్లాస్టిక్. ఇది వేలాది సంవత్సరాలైనా భూమిలో కరగదు. అలాంటి ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న వస్తువు కొనుగోలు చేసినా ప్లాస్టిక్ కవరు వాడుతున్నాం. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. అందుకే మనం మార్కెట్‌కి వెళ్లేటపుడు ఓ బ్యాగ్ పట్టుకెళితే సరి. అలాగే చిన్నచిన్న విషయాలు. కూలర్ వాడేముందు ఇంట్లో కిటికీ తెరుచుకోవాలి. వృథాగా బల్బులు, ఫ్యానులు వేయకూడదు. బైక్ వాడకాన్ని తగ్గించాలి. దగ్గర్లో పనులకు వాహనం బయటకు తీయకూడదు. పనిచేసే కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఉంటే వాహనాన్ని వాడాల్సిన అవసరమే ఉండదు. అలాగే వాహనాన్ని స్నేహితులతో షేర్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. పబ్లిక్ వాహనాలనే ఎక్కువగా యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే వాషింగ్‌మెషిన్లు వాడే వాళ్లు దుస్తులు అందులోనే డ్రైచేయకుడా బయట ఆరేయాలి.
ఇవేకాదు. హైటెక్ యుగంలో తప్పని సరైన కంప్యూటర్ వాడకంలోనూ జాగ్రత్తపాటించాలి. ఒక్క కంప్యూటర్ ఏడాదిలో 78కిలోల కార్బన్‌డైయాక్సైడ్ వెదజల్లుతుందట. అందుకే ఆఫీసులలో కంప్యూటర్ వాడేవాళ్లు దాని అవసరం లేనపుడు స్విచ్ ఆఫ్ చేస్తే సరి. ఇంకా నాణ్యత కలిగిన వస్తువులను ఉపయోగిస్తే ఇంధన వాడకాన్ని తగ్గించినట్టే. వాహనాల టైర్లు, బ్రేకులు, ఇంజిన్ బాగుంటే మైలేజ్ పెరుగుతుంది. పెట్రోలు వినియోగం తగ్గుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది...ప్రతిఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలి. ఒక్క చెట్టుకు 27 కిలోల కాలుష్యాన్ని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఇలా పౌరులు బాధ్యత వహిస్తే గ్లోబల్‌వార్మింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. కంపెనీలు కూడా తమంతట తాము నియంత్రణ చేసుకుని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలి. ప్రభుత్వాలు సైతం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇంధన వనరులను పెంచాలి. అటవీ విస్తీర్ణం పెంచాలి.
(ఇవాళ ప్రపంచ ధరిత్రీ దినోత్సవం )