భారతదేశం తెల్లదొరల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న శుభదినమిది!

భారతదేశం తెల్లదొరల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న శుభదినమిది! స్వాతంత్ర్యం పొందిన శుభ తరుణమిది. అందుకే మనం ప్రతి ఏడాది ఆగస్టు 15వ తేదీని ఓ పండుగలా జరుపుకుంటాం! నిజానికి ఇది మనకు అతి పెద్ద జాతీయ పండుగ! బ్రిటిష్‌ వారి కుట్ర కారణంగా భారత దేశం రెండు ముక్కలయ్యింది. ఆగస్టు 15వ తేదీనే పాకిస్తాన్‌(Pakistan)కూడా ఉనికిలోకి వచ్చింది. నిజానికి ఆ దేశానికి కూడా ఇవాళే స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day).కానీ పాకిస్తాన్‌ మాత్రం ఆగస్టు 14వ తేదీన తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇందుకు పెద్దగా కారణాలేమీ లేదు. కేవలం మనకంటే ముందే వేడుకలు చేసుకోవాలనే ఉబలాటమే! ఇంతకు మించి మరే కారణం లేదు.

నిజానికి భారత స్వాతంత్ర్య చట్టాన్ని 1947 జులై 18వ తేదీనే ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన భారత్‌, పాకిస్తాన్‌ పేరిట బ్రిటిష్‌ ఇండియా రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడనుంది అని ఆ చట్టంలో ఉంది. పాకిస్తాన్‌ జాతిపిత, ఆ దేశ తొలి గవర్నర్‌ జనరల్‌(Governor-General) మహ్మదాలీ జిన్నా(Muhammad Ali Jinnah) కూడా ఆగస్టు 15 తేదీనే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఆగస్టు 15వ తేదీని స్వతంత్ర, సార్వభౌమ పాకిస్తాన్‌ పుట్టినరోజుగా జిన్నా ప్రసంగంలో పేర్కొన్నారు. అంటే ఏ విధంగా చూసినా పాకిస్తాన్‌కు కూడా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్యం వచ్చిన రోజు! జిన్నాతో పాటు పాకిస్తాన్‌ మొదటి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా 1947 ఆగస్టు 15వ తేదీనే! 1948 జూలైలో పాక్‌ విడుదల చేసిన తొలి స్మారక పోస్టల్‌ స్టాంపుపై కూడా ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినంగా స్పష్టంగా పేర్కొన్నారు. 1967లో పాక్‌ మాజీ ప్రధానమంత్రి చౌధురీ ముహమ్మద్‌ అలీ(Mohammad Ali Bogra)రాసిన పుస్తకంలో కూడా స్వాతంత్ర్య దినోత్సవ ప్రస్తావన ఉంది.

1947 ఆగస్టు 15వ తేదీన ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం. ముస్లింలకు అతి పవిత్రమైన ఆ రోజునే ఖౌద్‌–ఏ–ఆజం జిన్నా పాకిస్తాన్‌ తొలి గవర్నర్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. తొలి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. నెలవంక, నక్షత్రంతో కూడిన పాక్‌ పతాకం ప్రపంచ యవనికపై తొలిసారి అధికారికంగా ఎగిరింది అని ఆ పుస్తకంలో ఆయన రాశారు. 1947 ఆగస్టు 14వ తేదీన అప్పటి బ్రిటిష్‌ ఇండియా వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌(Lord Mountbatten) కరాచీలో పాకిస్తాన్‌ రాజ్యాంగ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర చట్టం ప్రకారం మౌంట్‌బాటన్‌ ఆగస్టు 15వ తేదీన భారత్, పాకిస్తాన్‌ దేశాలకు అధికారాన్ని లాంఛనంగా బదలాయించాలి. కానీ ఒకే రోజున ఆయన ఢిల్లీలో, కరాచీలో ఉండటం కుదరని పని. పోనీ తొలుత భారతదేశానికి అధికారాన్ని బదలాయించి కరాచీకి వెళ్దామనుకున్నా అది సాధ్యంకాదు. కారణం బ్రిటన్‌ రాణి నిర్ణయం మేరకు విభజన అనంతరం స్వతంత్ర భారత్‌కు ఆయన తొలి గవర్నర్‌ జనరల్‌ అవుతారు కాబట్టి. భారత్‌కు అధికార బదలాయింపు జరిగిన క్షణమే మౌంట్‌బాటన్‌ తన వైస్రాయ్‌ హోదాను కోల్పోతారు. కేవలం గవర్నర్‌ జనరల్‌గా మాత్రమే ఉండాల్సి వస్తుంది. గవర్నర్‌ జనరల్‌ హోదాలో అధికార మార్పిడి చేయలేరు. వైస్రాయ్‌గానే ఆ పని చేయాలి. అందుకే ఆయన ఆగస్టు 14వ తేదీన కరాచీకి వెళ్లి అక్కడ అధికార బదలాయింపులు చేసి ఢిల్లీకి వచ్చారు. అయినప్పటికీ పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం మాత్రం ఆగస్టు 15వ తేదీనే వచ్చింది. ఇలా ఏ విధంగా చూసినా పాకిస్తాన్‌ కూడా ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలి. కానీ పాకిస్తాన్‌ మాత్రం 1948 నుంచి ఆగస్టు 14వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నది. భారత్‌ కంటే ముందే వేడుకలను జరుపుకోవాలనే తలంపు తప్ప ఇందులో మరే కారణమూ లేదు. 1948 జూన్‌ చివర్లో అప్పటి పాకిస్తాన్‌ ప్రధానమంత్రి లియాకత్‌ అలీ ఖాన్‌ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఆగస్టు 14వ తేదీనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించకూడదనే భావనతో స్వాతంత్ర్య దినాన్ని ఓ రోజు ముందుకు జరపడానికి జిన్నా కూడా అనుమతించారని తీర్మానంలో పొందుపరిచారు. ఇది కూడా అబద్ధమని జిన్నా జీవిత చరిత్ర రాసిన యాసర్‌ లతీఫ్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story