Russia Ukraine War : అణుయుద్ధమే వస్తే అంతే సంగతులు.. ప్రపంచం సర్వ నాశనమవుతుంది..!
ఏడాదిన్నర దాటింది. ఇంకా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. పది రోజుల్లో ముగించేద్దామనుకున్న రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తోంది. నిన్నటికి నిన్న రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించింది. వెంటనే రష్యా ఆర్మీ డ్రోన్లను పసిగట్టింది. మాస్కోలో ఓ విమానాశ్రయాన్ని మూసేసింది. మరికొన్ని విమానాలను దారిమళ్లించింది. ఉక్రెయిన్ సైన్యం ప్రయోగించిన అయిదు డ్రోన్లలో నాలుగింటిని రష్యా కూల్చేసింది. ఒకదాన్ని సురక్షితంగా కిందకు దింపింది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలనుకుంటోంది.
ఏడాదిన్నర దాటింది. ఇంకా రష్యా-ఉక్రెయిన్ (Russia Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. పది రోజుల్లో ముగించేద్దామనుకున్న రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపిస్తోంది. నిన్నటికి నిన్న రష్యా రాజధాని మాస్కోపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం డ్రోన్లను ప్రయోగించింది. వెంటనే రష్యా ఆర్మీ డ్రోన్లను పసిగట్టింది. మాస్కోలో ఓ విమానాశ్రయాన్ని మూసేసింది. మరికొన్ని విమానాలను దారిమళ్లించింది. ఉక్రెయిన్ సైన్యం ప్రయోగించిన అయిదు డ్రోన్లలో నాలుగింటిని రష్యా కూల్చేసింది. ఒకదాన్ని సురక్షితంగా కిందకు దింపింది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న రష్యా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలనుకుంటోంది. సైనికుల సంఖ్యను పెంచుతోంది. మరోవైపు వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ఉక్రెయిన్ ఉంది. రష్యాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు కూడా! కాకపోతే తమ దశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నాకే చర్చల గురించి ఆలోచిస్తామన్నారు. రష్యా మాత్రం యుద్ధాన్ని ఆపే మూడ్‌లో లేదు. ఇటీవల బెలారస్‌లో పుతిన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉక్రెయిన్ పట్ల ఆయన ఎంత కరుకుగా ఉన్నారో అర్థమవుతోంది. బెలారస్‌లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంటామన్నారు పుతిన్. అయితే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్ వార్‌కు దిగుతామన్నారు. ఒకవేళ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చివరకు అణు యుద్ధానికి దారి తీస్తే ఏమవుతుంది. ఆ రెండు దేశాలకే నష్టం వాటిల్లుతుందా? ప్రపంచానికే అది నష్టం తెస్తుందా? ఏం జరుగుతుంది? అసలు అణుయుద్ధాన్ని ఊహించుకుంటేనే వెన్నులో వణుకుపుడుతోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రత్యక్షంగా సమరం సాగిస్తున్నది రష్యా, ఉక్రెయిన్‌లే అయినప్పటికీ ఈ యుద్ధంగా అమెరికాతో పాటు ఐరోపా దేశాలన్నీ పరోక్షంగా పాల్గొంటున్నాయి. ఏడాదిన్నరగా రష్యాకు ధీటుగా ఉక్రెయిన్ నిల్చోగలుగుతున్నదంటే అందుకు కారణం ఈ దేశాల నుంచి అందుతున్న సాయమే! అమెరికా సారథ్యంలోన నాటో లేనిదే ఉక్రెయిన్ లేదు. అమెరికా అండదండలతోనే ఉక్రెయిన్ రెచ్చిపోతున్నదన్నది పుతిన్ భావన! అందుకే అణ్వస్త్ర ప్రయోగాల గురించి పదే పదే పుతిన్ మాట్లాడుతుంటారు. చెప్పడమే కాకుండా తన మిత్రదేశం బెలారస్‌కు కొన్ని అణ్వస్త్రాలను తరలించారు కూడా! పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నాకే కిరాయి సైనికుల బృందం వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు చేసింది. ఈ అనూహ్య పరిణామాన్ని పుతిన్ జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న పుతిన్ ఇప్పుడేం చేస్తారోనన్న భయం ఐరోపా, ఇతర దేశాలకు పట్టుకుంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు పుతిన్ అణ్వాస్త్రాలు ప్రయోగించకమానరనేది కొంతమంది వాదన. రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తే ఉక్రెయిన్ చూస్తూ ఊరుకోదు. ఆ దేశమూ అణుదాడికి దిగుతుంది. ఎవరు ముందు దాడి చేసినా దాని ప్రభావం మాత్రం భయంకరంగా ఉండబోతున్నది. ఒకవేళ అణుయుద్ధమే వస్తే అప్పటికప్పుడు ఎంత మంది చనిపోతారో చెప్పడం కష్టం కానీ వాతావరణంలో మాత్రం అనూహ్య మార్పులు వస్తాయి. తిండి దొరకక ఆకలితో చాలా మంది చనిపోతారు. క్షుద్భాదతో కనీసం 500 కోట్ల మంది మరణిస్తారని అంచనా! అంటే ప్రపంచ జనాభాలో సగానికిపైగానే కనుమరుగవుతుంది. బతికి ఉన్న 300 కోట్ల మంది కూడా జీవచ్ఛవాల్లా బతుకీడుస్తారు. అగ్నిపర్వతాలు పేలినప్పుడు వెలువడే పొగ, ధూళి కారణంగా ఆ ప్రాంతంలోని వాతావరణ చల్లబడి క్షామం తలెత్తుతుంటుంది. అణుయుద్ధంలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుంది. ఆకాశమంతటా ధూళి మేఘాలు కమ్ముకుంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కనీసం 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీన్నే అణు శీతాకాలం అంటారు. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. నగరాలు, పట్టణాలు, పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అణుబాంబులు విసిరితే మాత్రం మరింత విపత్తు వాటిల్లుతుంది. భారీ స్థాయిలో కర్బనాలు, ధూళి పైకెగుస్తాయి. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఫలితంగా వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాలలో 99 శాతం మంది కన్నుమూస్తారు. ఈ భూమ్మీద ఎంత మంది మిగులుతారో చెప్పలేం. అణుయుద్ధం అంత భయానకం, భయంకరమైనది మరోటి ఉండదు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా విసిరిన హైడ్రోజన్ బాంబులు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాయో చూశాం. విన్నాం. ప్రపంచం చేసుకున్న అదృష్టమేమిటంటే ఆ తర్వాత మరో అణు విస్పోటాన్ని చవి చూడకపోవడం. కొన్ని సార్లు అణుయుద్ధం వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1957లొ బాంబర్‌లో నుంచి అణుబాంబు జారి న్యూమెక్సికోపై పడింది. అదృష్టవశాత్తూ అది పేలలేదు. 1962లో అగ్రరాజ్యాలైన అమెరికా-సోవియట్ యూనియన్ మధ్య అణుయుద్ధం చేరువలోకి వచ్చి తప్పిపోయింది. లేకపోతే ఆనాడే ప్రపంచం సర్వ నాశనమయ్యేది. క్యూబాకు సాయం చేయడానికి వెళ్లిన రష్యా సబ్‌మెరైన్‌ను అమెరికా అడ్డుకుంది. అప్పుడు మాస్కోతో సబ్‌మెరైన్‌కు సంబంధాలు తెగిపోయాయి. ఆ సబ్‌మెరైన్ కెప్టెన్ అందులోని అణుబాంబును పేల్చడానికి రెడీ అయ్యాడు. కానీ రష్యాకే చెందిన వాసిలీ అర్కొపోవ్ సంయమనం పాటింపచేసి పెను ప్రమాదం నుంచి తప్పించాడు. దీన్నే క్యూబన్ క్షిపణి సంక్షోభం అని అంటారు. 1966లో స్పెయిన్ గగనతలంలో ఉన్న విమానాన్ని బీ-52 బాంబర్ ఢీకొట్టింది. ఫలితంగా నాలుగు అణ్వస్త్రాలు కిందపడ్డాయి. రెండు పేలాయి కూడా! కాకపోతే స్వల్ప స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో జనం బతికిపోయారు. 1979లో సోవియట్ యూనియన్ దాడి చేస్తుందన్న అలారం మోతతో అమెరికా ఎదురుదాడికి రెడీ అయ్యింది. కాకపోతే చివరి నిమిషంలో అది తప్పుడు హెచ్చరిక అని తెలుసుకుని ఆగిపోయింది. 1995లోనూ ఇలాగే జరిగింది. అమెరికా దాడి చేస్తుందేమోనని రష్యా ఎదురుదాడికి సిద్ధమయ్యింది. అప్పుడు కూడా ఇలాగే అవి తప్పుడు హెచ్చరికలని రష్యా గుర్తించింది. అణ్వస్త్ర ప్రయోగాన్ని నిలిపివేసింది.