Death valley : ప్రాణాలు తీసే మృత్యులోయ! ఆ ప్రమాదకరమైన చోటు ఎక్కడుంది?
మీరు ఎన్నైనా చెప్పండి .. ఎండలను భరించడం చాలా కష్టం. మొన్నటి వరకు మనం మలమలమాడిపోయాం..
మీరు ఎన్నైనా చెప్పండి .. ఎండలను భరించడం చాలా కష్టం. మొన్నటి వరకు మనం మలమలమాడిపోయాం.. ఉత్తరాదిలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయట! మన దగ్గరే కాదు అమెరికాలోనూ(America) సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. కాలిఫోర్నియాలో మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మాత్రం టెంపరేచర్‌కే అల్లాడిపోతుంటే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చోట జనాలు ఎలా ఉంటారో కదూ! పాపం అక్కడ జీవజాలం ఎలా బతుకుతున్నదో ఏమో! ఇప్పుడు కాలిఫోర్నియా గురించి చెప్పుకున్నాం కదా! అదే కాలిఫోర్నియాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఉంది. కాలిఫోర్నియాకు తూర్పున ఓ ప్రదేశమే డెత్ వాలీ(Death valley)! అచ్చ తెలుగులో మరణ లోయ! అక్కడ మహా వేడి! తట్టుకోలేనంత వేడి! అక్కడంతా ఎడారే! పచ్చటి చెట్టు ఒక్కటీ కనిపించదు.. చుట్టుంతా కొండలు.. మధ్యలో లోయ! ఆ లోయను దాటే ప్రయత్నంలో కొందరు చనిపోయారట కూడా! అందుకే దీన్ని మృత్యులోయ అంటారు.. అక్కడ జనాలు ఉండరా అంటే ఉంటారు.. కాకపోతే కొద్ది మందే! స్థిరనివాసం ఉన్నవారు తక్కువే అయినా.. అంత వేడిలోనూ అక్కడున్న కొండలు...కోనలను చూడ్డానికి చాలా మంది వస్తుంటారు..ఎందుకూ అంటే మలమమల మాడ్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకుని అట! అంత భయంకరమైన ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందామని అట! ఇదేం పిచ్చి అని అనుకోకండి. ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా!
1913, జూలై 10వ తేదీన వేసవిలో ఇక్కడ 56.7 (134 డిగ్రీల్ ఫారెన్ హీట్) డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందట! అక్కడ సగటు ఉష్ణోగ్రత 47 డిగ్రీలు.. దీన్ని బట్టి అక్కడ ఎండ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. లిబియాలోని అజీజియా ప్రాంతంలో కూడా ఎండలు మండిపోతుంటాయి! 1922లో ఇక్కడ ఏకంగా 58 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యిందట! అయితే వాతావరణ నిపుణులు మాత్రం ఇది నిజమై ఉండదంటారు.. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రతను నమోదు చేసినతనికి అంతగా అనుభవం లేదట! అంచేత ఈ ఫిగర్ తప్పయి ఉంటుందనేది శాస్ర్తవేత్తల ప్రగాఢ నమ్మకం.. 2020 ఆగస్టు 16, 2021 జులై 9, 2023 జూన్ 16వ తేదీలలో 130 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదైంది. అంటే 54.44 డిగ్రీల సెల్సియస్ అన్నమాట! ఇక్కడి ఫర్నేస్ క్రీక్‌లోని అత్యాధునిక సెన్సర్లు వీటిని గుర్తించాయి. 129 డిగ్రీలు ఆరుసార్లు నమోదైంది. ఇంచుమించు 54 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ మండు వేసవిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం సర్వ సాధారణం. భరించలేనంతగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎవరూ ఇక్కడికి రావద్దని అక్కడి నేషనల్ పార్క్ యాజమాన్యం నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా ఎవరూ వినడం లేదు. మొన్నే ఓ బైక్ రైడర్ వేడికి తట్టుకోలేక చనిపోయాడు. ఇది తెలిసి కూడా టూరిస్టులు అక్కడికి క్యూలు కడుతున్నారు.
డెత్ వ్యాలీలో ఏడాదిలో 147 రోజులు సగటున 100 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదవుతుంది. ఇది కూడా ఏప్రిల్ 14 నుంచి అక్టోబర్ 12లోపు! ఏటా 92 రోజులు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారెన్‌హీట్ నమోదవుతుంది. ఏటా 23 రోజులు సగటున 120 డిగ్రీల వేడి ఉంటుంది. ఇక 32 రోజుల అత్యల్ప ఉష్ణోగ్రత 90 డిగ్రీల పైమాటే. 1972 జులై 5వ తేదీన ఇక్కడ నేలపై 201 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి నమోదైంది. అంటే 94 డిగ్రీల సెల్సియస్.. నీరు మరిగే వేడి కన్నా ఓ ఆరు డిగ్రీలే తక్కువ. అదే రోజు వాతావరణ ఉష్ణోగ్రత 128 డిగ్రీల ఫారన్‌హీట్. 1929, 1953 సంవత్సరాల్లో చుక్క వర్షం పడలేదు. 1931-34 మధ్యలో 40 నెలల్లో కేవలం అంగుళం వర్షపాతం కంటే తక్కువే నమోదైంది. భరించలేనంత ఎండలకే కాదు, మెరుపు వరదలకు కూడా డెత్ వ్యాలీ ప్రసిద్ధం. రెండేళ్ల కిందట ఆగస్టులో వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. 2015లోనూ భయంకరమైన వరదలు సంభవించాయి. ఇక్కడ త్వరలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.