US man killed his wife:అత్తకు అల్లుడు మెసేజ్‌లు.. కట్ చేస్తే కటకటాల్లోకి..!
ఓ అల్లుడు తనకు పిల్లను ఇచ్చిన అత్తకు రోజూ మెసేజులు పెట్టేవాడు.
ఓ అల్లుడు తనకు పిల్లను ఇచ్చిన అత్తకు రోజూ మెసేజులు పెట్టేవాడు. దాంట్లో గుడ్‌మార్నింగ్, గుడ్ నైట్, హౌఆర్‌యూ లాంటి మెసేజ్‌లు మాత్రమే ఉండేవి. కానీ తన ఫోన్ నుంచి కాకుండా తన భార్య ఫోన్ నుంచి మెసేజ్‌లు పెట్టేవాడు. అత్త కూడా తన కూతురే పెడుతోంది అనుకునేది. కానీ పోనుపోను అత్తకు డౌట్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలియడంతో అల్లుడు అరెస్ట్ అయ్యాడు.
అమెరికాలోని(America) సౌత్ కరోలినా(Carolina) రాష్ట్రం పెండిల్టన్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు బ్రాండన్ బార్న్స్ (Brandon Barnes)గత ఏడాది తన కంటే ఏడాది చిన్నదైన జెస్సికా(Jessica)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. ఈ జంట ఉంటున్న ఇంట్లోనే మరో ఇద్దరు జెస్సికా స్నేహితులు విక్టోరియా(Victoria), కెండాల్(Kendall) పేయింగ్ గెస్టులుగా ఉండేవారు. తొలుత వీరి కాపురం సవ్యంగా సాగినా రానురాను వీరి మధ్య ఘర్షణలు చెలరేగాయి. అవి కాస్త పీక్‌కు వెళ్లాయి. ఈ దంపతులు గొడవ పడుతున్నా ఆమె స్నేహితులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగవులే ఉంటాయి కదా అని లైట్ తీసుకున్నారు. అయితే ఓ రోజు పెద్ద గొడవ జరిగింది. తమ బెడ్ రూం నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. దీంతో జెస్సికా స్నేహితురాలు విక్టోరియా వెళ్లి చూడగా.. తన భర్త బార్న్స్ చేతిలో జెస్సికా చనిపోయి ఉంది. దీంతో బార్న్స్ కొత్త నాటకానికి తెరలేపాడు. తాను జెస్సికా గొంతు కొంచెం బిగ్గరగా పట్టుకోవడంతో అనుకోకుండా చనిపోయిందని అతను నమ్మబలికాడు. తన భార్య తన చేతిలోనే చనిపోయిందని దొంగ ఏడ్పులు ఏడ్చాడు. దీంతో కరిగిపోయిన విక్టోరియా, మరో స్నేహితురాలు కెండాల్ కూడా తనకు సహకరించారు. తన భార్య చనిపోయిన విషయాన్ని ఎవరూ బయటకు చెప్పకూడదని.. ముఖ్యంగా జెస్సికా తల్లికి తెలియకూడదని మాట్లాడుకున్నారు. వారు ఉంటున్న ప్రాంతం నుంచి 10 కి.మీ. మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీప్రాంతంలో పడవేశారు.
కానీ జెస్సికా చనిపోలేదని ఎలాగైనా మేనేజ్ చేద్దామనుకున్నాడు బర్న్స్. తన భార్య ఆమె తల్లితో రోజూ మాట్లాడేది. మెసేజ్ చేయడం కానీ ఫోన్ మాట్లాడడం కానీ చేసేది. దీంతో బర్న్స్ తన భార్య మొబైల్ నుంచి రోజూ ఉదయం గుడ్‌మార్నింగ్ మామ్, గుడ్ నైట్ అంటూ అత్తకు మెసేజులు పంపించేవాడు. తను కూడా కొన్ని రోజులు జెస్సికానే పంపిస్తోంది అనుకుంది. తన కూతురుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అల్లుడు ఫోన్ కట్ చేసి బిజీగా ఉన్నానని టెక్స్ట్ చేసేవాడు. ఇలా ఒక నెలరోజులు గడిచినా కూతురుతో మాట్లాడేందుకు సిసిలియాకు అవకాశం దొరికేది కాదు. ఓ రోజు నేరుగా ఇంటికే వెళ్లింది. జెస్సికా ఏదో పని ఉందని బయటకు వెళ్లిందని బ్రాండన్ చెప్పాడు. మరోసారి కూడా ఇదే జరిగింది. దీంతో జెస్సికా తల్లి సిసిలియాకు అనుమానం వచ్చింది. పోలీసుల వద్దకు వెళ్లి తన కూతురు కనబడడం లేదని కానీ ఆమె ఫోన్‌తో తనకు ఎవరో మెసేజ్‌లు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు బ్రాండన్, అతని ఇంట్లో ఉంటున్న విక్టోరియా, కెండాల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసులకు భయపడిన విక్టోరియా జరిగిందంతా వివరించింది. దీంతో జెస్సికా మృతదేహాన్ని పోలీసులు కనుగొనగా.. ఆమె మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. బ్రాండన్‌ను అరెస్ట్ చేశారు.. అతనికి సహకరించిన విక్టోరియా, కెండాల్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.