అనాదిగా మహిళలు అణచివేతకు గురవుతూ వస్తున్నారు. అత్యాచారాల బారిన పడుతున్నారు. వేధింపులకు బలవుతున్నారు. గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చాల్సిన భర్తలు కటువుగా ప్రవర్తిస్తుంటారు. ఉమోజా ఉసో(Umoja Uaso) గ్రామంలో ఇదే జరిగింది. అత్యాచారాలకు(Rape) గురైన వారిని ఆదరించాల్సిన భర్తలు బయటకు గెంటేశారు. హఠాత్తుగా జీవితాలు రోడ్డునపడేసరికి ఆ అభాగ్యులు తల్లడిల్లిపోయారు. భవిష్యత్తుపై భయం వేసింది.

అనాదిగా మహిళలు అణచివేతకు గురవుతూ వస్తున్నారు. అత్యాచారాల బారిన పడుతున్నారు. వేధింపులకు బలవుతున్నారు. గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చాల్సిన భర్తలు కటువుగా ప్రవర్తిస్తుంటారు. ఉమోజా ఉసో(Umoja Uaso) గ్రామంలో ఇదే జరిగింది. అత్యాచారాలకు(Rape) గురైన వారిని ఆదరించాల్సిన భర్తలు బయటకు గెంటేశారు. హఠాత్తుగా జీవితాలు రోడ్డునపడేసరికి ఆ అభాగ్యులు తల్లడిల్లిపోయారు. భవిష్యత్తుపై భయం వేసింది. పురుషులపై అసహ్యం కలిగింది. నమ్మకం పోయింది. ఆ స్థితిలో వారికి సాటి మహిళ ఒకరు ధైర్యం చెప్పారు. పురుషుడి సహాయ సహకారాలు లేకున్నా హాయిగా జీవించవచ్చని బతుకు మీద ఆశలు కల్పించారు. దాంతో ఆ బాధిత మహిళల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అందరూ కలిసి ఓ ఊరును నిర్మించుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు. ఊళ్లో పురుషులకు(Men) ప్రవేశం లేదని బోర్డు పెట్టారు. సొంతకాళ్లపై నిలబడ్డారు. ఇంత చేసినా వారిపై వేధింపులు ఆగలేదు. అయినా ధైర్యం కోల్పోలేదు. ఎదురు తిరిగారు. ఇప్పుడు వారి ప్రపంచానికే ఆదర్శమయ్యారు. వారే సంబురు తెగ మహిళలు(Samburu tribe Women).

కెన్యాలోని(Kenya) సంబురు కౌంటీలో ఉంది ఉమోజా ఉసో గ్రామం. ఈ ఊళ్లో పదుల సంఖ్యలో నివాసాలు ఉంటాయి. అవన్నీ కర్ర, మట్టి, ఆవుపేడ, గడ్డి ఉపయోగించి కట్టుకున్నవే! గుడిసె చుట్టూ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. 50 మందికి పైగా మహిళలు ఇక్కడ నివసిస్తున్నారు.
మూడు దశాబ్దాల కిందట సంబురు తెగకు చెందిన 14 వందల మందికిపైగా మహిళలపై బ్రిటిష్‌ సైనికులు అత్యాచారం చేశారట! ఈ ఘటనపై కేసు అయితే నమోదయ్యింది కానీ న్యాయస్థానంలో న్యాయం దొరకలేదు. అత్యాచారానికి గురి కావడంతో వారిని భర్తలు వదిలేశారు. ఆ తెగలో మహిళలపై దాడులు, వేధింపులు సహజమయ్యాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న ఆ తెగలో మహిళలంటే చిన్నచూపు. ఆడవారిని పిల్లలను కనే యంత్రాల్లాగే చూసేవారు. కట్టు బానిసలుగా భావించేవారు. సంబురు తెగ మహిళలకు హక్కులు, ఆస్తులు ఉండవు. స్వేచ్ఛ అనేది వారు కలలో కూడా ఎరగరు. ఇలాంటి మహిళలందరి కోసం ఆ తెగకే చెందిన రెబెకా లొలొసొలి అండగా నిలిచారు. ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ఆ విధంగా 1990లో రెబెకాతోపాటు మరో 15 మంది గుడిసెలు కట్టుకున్నారు. అదో ఊరుగా మారింది. తమలాంటి మరికొందరు మహిళల్ని ఆహ్వానించారు. ఆ గ్రామానికి ఉమోజా అని పేరు పెట్టారు. స్వాహిలి భాషలో ఉమోజా అంటే ఐక్యత అని అర్థం. పేరుకు తగినట్టుగానే మహిళందరూ ఐకమత్యంగా ఉంటున్నారు. ఇల్లు అయితే కట్టుకున్నారు. మరి తిండి మాటేమిటి? జీవనోపాధి ఎలా? అన్న ప్రశ్నలు వచ్చాయి. మొదట్లో కూరగాయలను మార్కెట్లో కొనుక్కుని ఇతర ప్రాంతాల్లో అమ్మేవారు. అదేం పెద్దగా లాభసాటిగా అనిపించలేదు. దాంతో సంప్రదాయ వస్తువులు, ఆభరణాలు తయారుచేయడం మొదలుపెట్టారు. టూరిస్టులకు అమ్మసాగారు. వీరికి కెన్యా వైల్డ్‌ లైఫ్‌ సర్వీసు అండగా నిలిచింది. వారు తయారుచేసిన వస్తువులను ఈ సంస్థే కొనుగోలు చేస్తోంది. కెన్యాస్‌ హెరిటేజ్‌ అండ్‌ సోషల్‌ సర్వీస్‌, కెన్యా సాంస్కృతిక శాఖ నుంచి కూడా వీరికి సాయం లభిస్తోంది. అత్యాచారానికి గురైన మహిళలతోపాటు లైంగిక వ్యాధులతో బాధ పడుతున్న మహిళలు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలకు కూడా ఈ గ్రామంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల కూడా ఉందిక్కడ! ఇక్కడ కనీసం 200 మంది చిన్నారులు ఉన్నారు. మహిళలు తమ ఆదాయంలో పది శాతం డబ్బును గ్రామానికి పన్నుగా చెల్లిస్తుంటారు. ఈ గ్రామానికి రెబెకానే అధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్నారు. సమస్య వస్తే ఊళ్లో మహిళంతా కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆత్మ విశ్వాసంతో, అంతకు మించిన ఆత్మగౌరవంతో జీవిస్తున్న ఈ మహిళలకు ప్రపంచం సెల్యూట్ చేస్తోంది. 2005లో ఐక్యరాజ్యసమితిని రెబెకా సందర్శించారు. అప్పట్నుంచే ఈ ఊరు మరింత పాపులరయ్యింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని పురుషులకు ఇది కంటగింపుగా మారింది. వారి ఇగో గాయపడింది. ఉమోజా గ్రామాన్ని మూసేయాలంటూ కోర్టులో కేసు వేశారు. కోర్టు దాన్ని కొట్టేసింది. 2009లో రెబెకా మాజీ భర్త ఊరిలోకి చొరబడి దాడికి దిగాడు. చంపేస్తానని బెదిరించాడు. అయినా మహిళలు వెనుకంజ వేయలేదు. స్వేచ్చగా, తమకు నచ్చినట్టుగా జీవిస్తున్నారు.

Updated On 6 March 2024 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story